ట్రాష్ డయెట్ !

-వసంతలక్ష్మి అయ్యగారి

ఊ.. ఏమిటక్కా విశేషాలు ?
 
ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ 
 కట్టేసినట్టుంటోంది నాకైతే.
 
అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్ తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాల గాసిప్పులు కానిచ్చివస్తారు.
నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు .
 
కొత్త వంటకాలేం చూశావేంటి?
 
చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని.
 
అదేమలాగ? 
 
ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో డైటని మొదలెట్టారు . ఆయన కూరలు వేరు, సరుకులు వేరు, వంటవేరు .. పల్లీనూనె నువ్వులనూనె పనికిరావట… అయితే ఆవునెయ్యి లేదా వర్జినుకొబ్బరినూనె..! ఒకప్పుడు పప్పులో చెంచాడు నెయ్యి వేసినా చెయ్యడ్డుపెట్టిన మనిషి యిపుడు కప్పులతో నేయి పోసి వంటలు. కాకుండా అవేంటో పనీర్ ముక్కలు… సోయా చంకులూనూ! ఈ జిడ్డు కాదుగానీ కిచెను రచ్చరచ్చ! తుడవలేక కడగలేక చస్తున్నాననుకో.
 
పోనీలెద్దూ పని నీకు తగ్గినందుకు సంతోషించూ..యిల్లంతా ఘుమఘుమలకి ఆనందించు.అయినా మీవాడూ…పిల్లా వర్క్ ఫ్రమ్ హోమే కదా.. తింటారుగా.
 
ఏంతినడం… వాడు నెలరోజులుగా యింటర్మిటెంటు ట. వాళ్లనాన్న ప్రోటీను మాత్రమే తింటే వీడు కేవలం లోకార్బ్  డైట్ ట.ద్విభుక్తమనుకుందూ . పగలు పదికి నానాజాతి సమతులాహారం పండూ కాయ పట్టేసి పన్నెండు గంటలపాటు  ఉపోషమనమాట. ఏదో కీన్వా మీద పడ్డాడు.
 
మావాడూ చేశాడులే యివన్నీ. . అమెరికాలో నూ యూత్ కిదో వెర్రిట. యేదీ స్థిరముండదు..వేలం వెర్రిలెద్దూ .
 
ఓహో.. విశ్వవ్యాప్తమయ్యాయా.. యీ ఆహారపుటలవాట్లూ !ఎంచక్కా నాలుగురకాలూ కలుపుకుని వేళకి అన్నం తినేసే సుష్మ , ఏకంగా యీమధ్య పూర్తిగా లిక్విడ్ డయటు మీదేననుకో. తేనెచుక్కలు నిమ్మనీరు ..రోజుకి పావుకిలో తేనైనా మంచిదేనన్నారట ఎవరో గురువుగార్లు యూట్యూబులో..అంతే.. నాపోరు పడలేక యాపిలుపండుకి నారోటిపచ్చడి పూసుకు తింటుంది. కూరకప్పులో వేసుకుని స్నాక్ లా చెంచాతో టకటకలాడిస్తుంది . చస్తే నెయ్యి వాసనకూడా పీల్చదనుకో… ఫ్యాటు ప్యాక్ అవుతుందట యెక్కడెక్కడో ! రేపు పెళ్లైతే యెలాగో !
 
ఇవన్నీ యీకాలమ్ కామనేనే !మా పెద్దదైతే రెడ్ రైసని అమెరికాలోదొరుకుతాయిలే .. అచ్చం కుంకుమపులిమేసినట్టుంటాయి … మనబ్రౌన్ రైసు కంటే గొప్పవిట.. అవితప్పించి మరే రకం తెల్లటి బియ్యమూ వండదంటే నమ్ము.ఇంతకీ నువ్వూ …అసలు తింటున్నావా లేదా ..?
 
హూం..అందరిబదులూ తినేస్తున్నట్టనిపిస్తోందనుకో .లాక్ డౌననగానే బస్తా బియ్యం వేయించానా.. 5 కిలోల గోధుమపిండి తెప్పించి ఫ్రిజ్ కెక్కించాను.ఆమధ్య తనకి సుగర్ పెరిగిందని కొర్రలు పదికిలోలపాకెట్ తెచ్చారు . తినడం మానేశారు .ఎక్కడ పొయ్యను .. యిడ్లీ దోశ పొంగల్ యేది చేసినా బియ్యానికి బదులు కొర్రలే వాడినా తరగడం లేదు..,
ఇంతకీ బావగారికి బీపీ తగ్గిందా.అత్తయ్యగారు బావుంటున్నారా … భక్తి టీవీ చూస్తున్నారా ?
 
బావగారు వంటల్లో ఉప్పు తగ్గించేశారనుకో . ఏం లాభం..సాయంత్రమయ్యేసరికి హల్దీరామో…ఘనశ్యామో పొట్లాలు లాగించేస్తారు . అత్తయ్గారికి అన్నీ పద్ధతి ప్రకారం జరగాలిగా. అన్నిరుచులూ కావాలి.
 
చివరకీ నువ్వూ నేనూ యింకా యెటువంటి క్రాష్ డైట్లకి మొగ్గుచూపలేదులావుంది కదూ .
 
ఎందుకు లేదూ … మనది ట్రాష్ డైట్… అందరి మిగుళ్లూ మనపొట్టలోకే మరి !
 
బాగా చెప్పావ్ ! మనది ఒబ్బిడ్డైటు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.