అంతు చిక్కని దాన్ని

-డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

భూమికి గొడుగై విస్తరించి
విశ్వమంతా వ్యాపించి
కడుపులో దాచుకున్న నీటిని
మేఘాల తోడునీడగా
నా ఆవేశాన్ని
మధ్య మధ్యలో గుమ్మరిస్తూ
నా బాధను వెళ్లగక్కుతూ
భూదేవితో నివేదన
అది నా ఆవేదన!!

అలసట లేక
పగలు రాత్రి తెలియక
సూర్యచంద్రుల గమనానికి ఆసరా
నా కళ్ళే వెలిగే తారలు

తుది మొదలు లేక
లెక్కల్లో తేలక
అంతు చిక్కలేక
అందరికి అందని దాన్ని
అందరి దాన్ని!!

శూన్యమైన నేను
అవసరం అందరికి
పాలపుంతను చేరాలని
గ్రహాలను అందుకోవాలన్న తాపత్రయం
మానవుల కోరిక
గగనాన్ని తాకాలన్న పక్షుల కల
విమానానికి దారి తీసిన వల
వెలుతురు చీకటి సమ్మేళనమై
నీలం తెలుపు నలుపు రంగులతో
మెరుపులతో మెరుస్తూ
ఉరుములతో భయపెడుతూ
నా మనసును తెలువుతూ
సప్త వర్ణ శోభితమై
ఇంద్రధనుస్సుకు రూపమై
అందానికి చేరువై
నిశిలో శశికి తల్లినై
వెన్నెలపరచి చల్లగా
మదిని దోచేసే నేస్తమై
కనువిందు చేస్తూ
నా వైపుకు తిప్పుకునే
ఆనందాల ఆకాశాన్ని
గుండ్రంగా ఎర్రని బొట్టును పెట్టి
అందాల జాబిల్లిని తలలో దాల్చిన ముత్తైదువుని
అవును నేనో గమనం లేని గగనాన్ని!!

అంతటా నేనే
ప్రపంచమే నేను
నేను లేక విశ్వం శూన్యం!!

*****

Leave a Reply

Your email address will not be published.