నువ్వు కూడా..?

-డా.నల్లపనేని విజయలక్ష్మి

ఈ గాయం అనాది కదా
అయినా ఇవాళ కొత్తగా బాధ పెడుతున్నది
కురుసభలో కాపాడబడిన ద్రౌపది మానం
మిత్ అని ఎప్పుడో తెలిసింది
మౌనంగా వేడుక చూసే పెద్దమనుషులూ
తొడ చరిచి అశ్లీలపు సంజ్ఞలు చేసే మగమహారాజులూ
ఎరుక లోనివారే

నీ దేహం ఒకనాడు వీర భోజ్యం
కులమత దురహంకారం
తిట్లలోనూ నీతో రమిస్తుంటే
తలదించుకున్న తల్లివి నువ్వు
నాగరికారణ్యంలో
తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్
నీ అస్తిత్వ మెప్పుడూ దేహదేహళి దాటనేలేదు
అయినా ఆకాశంలో సగం కలలు

తాను పెట్టిన గుడ్లను తానే తినే పాములా
రక్తం రుచి మరిగిన పులిలా
విద్వేషపు విషానికి మరిగి
తోబుట్టువుల మాంసాన్ని
తోడేళ్లకు ఎర వేస్తున్నావా?
కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారిగా
నువ్వూ రాజకీయపు పాచిక వైనావా?
అనాగరిక, అమానుష, వికృత క్రీడలో
నువ్వూ భాగమయ్యావా?

చివరికి నువ్వు కూడా?

(మణిపూర్ లో కొంతమంది స్త్రీలు శత్రు తెగకు చెందిన స్త్రీలపై అత్యాచారం చేయమని తమ పురుషులను ఉసి గొల్పారని విని దుఃఖంతో రాసుకున్న కవిత)

*****

2 thoughts on “నువ్వు కూడా..? (కవిత)”

  1. కవిత విభిన్న వస్తువుతో చక్కగా నిర్వహించబడింది.

  2. అనాదిగా వస్తున్న అకృత్యాలు కదండి ఆగలేవు
    చాలా బాగుంది మేడం మీ కవిత

Leave a Reply

Your email address will not be published.