నడక దారిలో-70

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు సాహిత్యం , సంగీతం, బొమ్మలు సాధన. మా వివాహం.పల్లవిజననం.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారి స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి అమెరికాలో పాప జన్మించటం, , . హైదరాబాద్లో పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ పోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేక తెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం ,వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీ కాలేజీ ప్రహసనాలూ,పల్లవికి కరోనా వచ్చి తగ్గటం,వీర్రాజుగారి పెయింటింగ్స్, సేకరించిన ఆర్ట్ పుస్తకాలు రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్తులో అంకితోత్సవం , కుందుర్తి శతజయంతిప్రతిభా పురస్కారాలు ఎంపిక,వసుధ ఎంగేజ్మెంట్,సుశీలా నారాయణరెడ్డి అవార్డు,మరో రెండు నెలలకే వీర్రాజుగారుఅనారోగ్యంతో హాస్పిటల్ లో పదిరోజులు వుండి డిస్చార్జ్ అయ్యారుతర్వాత—)

***

వీర్రాజుగారు కొంచెం తేరుకుంటున్నట్లుగానే కనిపిస్తున్నా ఆపరేషన్ చేసిన దగ్గర ఇంకా పూర్తిగా పచ్చి తగ్గనందువలన స్నానం చేయటంలేదు. రోజూ రెండుపూటలా ఒళ్ళు తుడుస్తున్నాను.
వాకర్ ఉన్నాసరే తనకి తాను నడవటానికి భయపడుతున్నారు. దానికి తోడు హాస్పిటల్ లో చాలా మందులు రాసారు. పూటపూటకీ అరడజను పైగా మందుబిళ్ళలు మింగి నోరంతా చేదైపోయిందని చికాకు, ఇబ్బంది పడుతుంటే పటికబెల్లం ముక్కో, ఎండుఖర్జూరమో చప్పరించమంటూ ఇచ్చేదాన్ని. ఏంటీబయోటిక్స్ ఇంకా వాడుతున్నందున పొట్టలో గాభరాగా ఉందంటే బార్లీనీళ్ళు, కొబ్బరినీళ్ళు, రాగిజావ , మజ్జిగ వంటివి ఇస్తున్నాము.

బాగానే వున్నారనుకునే సరికి రెండురోజులుగా మోషన్ కావటం లేదని చికాకు పడటం మొదలుపెట్టారు. మందులు ఎక్కువ వేసుకోవటం వలన మలబద్ధకం ఏర్పడినట్లు వుంది. ఆయనకు ఇష్టమైన రీతిలోనే ఆహారం తయారుచేయటం వలన బాగానే తింటున్నారు. జావలూ, బార్లీ నీళ్ళు తాగుతున్నారు. ఆఖరుకు మూడోరోజు వుదయమే మంచంమీద పడుకొని వుండగా మోషన్అయింది. అపుడు నేను డైపర్ తీసి క్లీన్ చేసి పక్కన కుర్చీలో కూర్చోబెట్టి పక్కబట్టలన్నీ మార్చాను. తర్వాత వాష్ రూమ్ కి వాకర్ తో నడిపించి తీసుకువెళ్ళి వేడినీళ్ళతో శుభ్రంగా స్నానం చేయించినట్లుగానే కడిగి బట్టలు మార్చి రూముకు తీసుకు వచ్చాను. మధ్యాహ్నం మామూలుగానే భోంచేసారు. హాల్లో కాసేపు కూర్చుంటానని అంటే పల్లవీ, నేను తీసుకు వెళ్ళాం.

వరుసగా బాల్య మిత్రులు ఇద్దరు ప్రకాశరావులతో, సత్యనారాయణతో చాలా సేపు మాట్లాడారు. ‘సుభద్రా,పల్లవీ చాలా సేవ చేస్తున్నారు ‘అని చెప్తుంటే కోప్పడ్డాను.”అవన్నీ ఎందుకు చెప్పటం .ఈ రోజు మీరు తేలికగానే వున్నారు. మరోవారం అవుతే మీకు మీరు నడిచి వెళ్ళగలుగుతారు” అన్నాను. భోజనం తర్వాత మళ్ళా బెడ్ రూముకు వచ్చి రెస్ట్ తీసుకున్నారు. ఏదో మాటలు సందర్భంలో ” చిట్టి ( చిన్నమరిది) యూ.ఎస్ నుండి ఈరోజే కదా వస్తానన్నాడు. వచ్చే వుంటారా”అని అడిగారు.”ఉదయం వచ్చివుంటారు. జెట్ లాగ్ వుంటుంది కదా బహుశా సాయంత్రం వస్తారు ” అన్నాను.

నాలుగింటికి ఎప్పట్లాగే లేచి రాగిజావ తాగి హాల్లో కూచుంటానంటే పల్లవీ, నేనూ సాయంగా వుంటే వాకర్ తో నడుచుకుంటూ వచ్చారు. కాసేపు టీవీ చూసి శంకరంకి ఫోన్ కనెక్ట్ చేయమని అడిగి ‘మాట్లాడతాను’ అంటే నా ఫోన్ లో కనెక్ట్ చేసి ఇచ్చాను. చాలా సేపు మాట్లాడారు. అప్పుడు కూడా మా సేవల గురించి చెప్పబోతే ఆపాను. ‘మరో వారంరోజుల్లో బాగానే నడవగలను ‘ అని ఆశావాహంగా మాట్లాడారు. కాసేపు అయ్యాక బెడ్రూంకి వెళ్తానంటే తీసుకు వెళ్ళాము. అయిదున్నర దాటాక హాల్లో కూర్చుంటానని అన్నారు. ఆరు అయినా తర్వాత వెళ్దురుగాని మరికాసేపు విశ్రాంతిగా పడుకోమని అన్నాము. కానీ మొండిగా నేనే వెళ్తానని లేవబోయారు. సరేనని లేపిన తర్వాత పట్టుకోవద్దని అంటున్నా పల్లవి ఒకవైపు, నేను ఒకవైపు వున్నాము. హాల్ వైపుకు నాలుగు అడుగులు వేసేసరికి ఆయనకు ఒళ్ళంతా చెమట్లు పడుతుండటం గమనించి ఆపబోయాను. కానీ మొండిగా మరో నాలుగు అడుగులు వేసి హాల్ లోకి వెళ్ళబోయేసరికి మూత్రవిసర్జన అయిపోయి కుప్ప కూలిపోయారు. ఆషీని కూడా పిలిచి ముగ్గురం కలిసి లేపలేక పక్కింటి సతీష్ ని పిలవమన్నాము. అందరూ సాయం పట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ మీద కాసేపు కూర్చోబెట్టి తిరిగి మంచంమీదకు చేర్చారు. అప్పటికే స్పృహ లేనట్లుగా అయ్యారు. డా.సూర్యప్రకాష్ గారికి పల్లవి ఫోన్ చేసింది. ఆయన అంబులెన్స్ కి ఫోన్ చేసారు. బిల్డింగ్లో వారు కొందరు వచ్చారు. పైన ఒక మెడికో వచ్చింది సిపిఆర్ చేసింది. పల్స్ వీక్ అయిపోతుంది అంది. అంతలో అంబులెన్స్, డాక్టర్ వచ్చి చూసి మాసివ్ హార్ట్ ఎటాక్ అని ప్రాణం లేదని చెప్పి వెళ్ళిపోయారు. నాకు మతిపోయినట్లైంది. ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న వ్యక్తికి ఏమైంది అర్థం కాలేదు.
ఆషీ నా ఫోన్ తీసుకుని గ్రూప్స్ లో విషయం పెట్టింది. ఒక్కొక్కరే వస్తున్నారు. సూర్యప్రకాష్ ,కామేశ్వరిగారు వచ్చినప్పుడు మాత్రం దుఃఖం ఆపుకోలేకపోయాను.” ఏమీ కష్టపడకుండా వెళ్ళిపోయారు. మీరు బాధపడితే మంచిదికాదంటూ’ ఓదార్చారు. అప్పుడే చిట్టి,ఉషా వచ్చారు. ‘ఉదయమే ఫ్లైట్ దిగాము. మధ్యాహ్నం రావాలనుకునికూడా పడుకుంటారేమో సాయంత్రం వెళ్ళొచ్చు అనుకున్నాము. వచ్చుంటే బాగుండేది ప్రాణం వుండగా మాట్లాడేవారమ’ని బాధ పడ్డారు.

అప్పటికే రాత్రి అయిందని ఐస్ బాక్స్ తెప్పించారు. ఇంట్లో పెట్టటానికి అపార్ట్మెంట్ వాళ్ళు అంగీకరించి లేదేమో మరి తెలియదు. కానీ దానిని పైకి తీసుకురావటానికి కుదరలేదని మాపార్కింగ్ లాట్ లో పెట్టి ఇంట్లోనుంచి నా నుండి యాభై ఒక్క ఏళ్ళ సాహచర్యం గల వీర్రాజు గారిని తీసుకు వెళ్ళిపోయారు. రాత్రే భారవీ,కవితావచ్చారు. కళ్యాణ్, అనురాగ్ రాత్రికి బయలుదేరి తెల్లారే సరికి వచ్చారు.
చిట్టీ, ఉషా ఇక్కడే వుండిపోయారు. పొనుగోటి కృష్ణారెడ్డి వచ్చి అంత్యక్రియలు ఎలా చేయాలనుకుంటున్నారని అడిగాడు. వీర్రాజుగారు మరణించారన్న దగ్గర నుంచి నా మనస్సులో సంఘర్షణ మొదలయ్యింది. అంత్యక్రియలు చేయటానికి కొడుకు లేడు, అల్లుడూ లేడు. మెడికల్ కాలేజీకే ఇవ్వాలనిపించింది. కానీ రాజమండ్రి వదిలి అరవై ఏళ్ళు దాటినా వీర్రాజుగారి మనసెప్పుడూ రాజమండ్రినీ, గోదావరినీ వదిలి రాలేదు. కులాచారం ప్రకారం పాతిపెట్టటమే అయినా దహనం చేసి గోదావరిలో నిమజ్జనం చేయాలనుకున్నాను. అందుకనే సంఘర్షణకు గురి అయ్యాను. ఆఖరుకు మరిదిచిట్టి అంత్యక్రియలు చేయటానికి అంగీకరించాడు .

కవులూ, రచయితలూ, ఆర్టిష్టులూ చాలామంది వచ్చారు. జనసాహితి మిత్రులంతా వచ్చారు. శీలావీర్రాజూ అమర్ రహె అంటూ అందరూ నినదిస్తూ తీసుకువెళ్ళారు. దహనం చేసేటప్పుడు కూడా ఆయన కవితలు చదువుతూ నినాదాలు చేసారుట. అనారోగ్యం వలన శారీరకంగా ఎక్కువ రోజులు బాధపడకుండా బంధువులూ, మిత్రులూ సమక్షంలో మహారాజులాగే వెళ్ళిపోయారు. కుందుర్తి కవిత సింగపూర్ నుండి వచ్చింది. ఫ్రీవర్స్ ఫ్రంట్ కుందుర్తి శతజయంతి పురస్కారాలు వీర్రాజు అంకుల్ ఉన్నప్పుడు చేయకుండా నేనే వాయిదా వేసాను అని చాలా దుఃఖించింది. వీర్రాజుగారిదే కాక నాదీ అదే అభీష్టం కనుక ఆ ప్రకారంగానే పూజలు ఏవీ పెట్టుకోలేదు. ఆ రోజునుండి ప్రతీ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలన్నీ వీర్రాజుగారి గురించి అద్భుతమైన ఆత్మీయ నివాళి వ్యాసాలు ప్రచురించటం నాకు అత్యంత ఆశ్చర్యం కలిగించింది. “మనను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు. మనం పోతే ఒక చిన్న వార్త మాత్రమే వస్తుందేమో” అని వీర్రాజుగారు అనేవారు. అటువంటిది ఇంత గొప్ప నివాళి అందుకున్నారు.
వరవరరావుగారు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడటమే కాకుండా వ్యాసం రాసారు.

స్వాతి బలరాంగారు ఫోన్ చేసి స్వాతిని ప్రారంభించటంలో వీర్రాజుగారి ముఖ్యపాత్ర గురించే చాలాసేపు మాట్లాడి ఆయన నా గురువు అని వాపోయారు. అంతేకాకుండా యాభై ఏళ్ళక్రితం నాటి ఆర్థిక పరిస్థితులలో కూడా తనకు చేదోడువాదోడుగా వీర్రాజుగారు వుండటాన్ని బలరాం గుర్తుచేసుకుని నాకు లక్షన్నర రూపాయలు పంపుతానని అన్నారు. కానీ నేను రిటైర్డ్ ప్రభుత్వ పెన్షన్ అందుకుంటు న్నాననీ, పల్లవి సాఫ్ట్వేర్ వుద్యోగం చేసిందనీ మాకు ఆర్థికంగా ఇప్పుడు లోటు ఏమీలేదని గౌరవంగా చెప్పి డబ్బు పంపవద్దని కోరాను. “సరే మీ అడ్రస్ పంపండి పత్రిక పంపుతాను” అన్నారు. స్వాతిలో ప్రచురిస్తోన్న అసభ్యమైన సినీతారల చిత్రాలూ, సరసమైన కథలూ చూసి పత్రిక పంపవద్దని బలరాంగారికి వీర్రాజుగారు అప్పట్లో వుత్తరం రాసారు. ఆ విధంగా సుమారు గత మూడు దశాబ్దాలకు పైగా కాంప్లిమెంటరీ కాపీ స్వాతి పత్రిక మాకు పంపటం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళా పంపసాగారు.

ఇంట్లో తిరుగుతూ, గలగల మాట్లాడకపోయినా ఇల్లంతా చిన్నబోయింది. కళ్యాణ్, అనురాగ్ , కృష్ణ కుటుంబం, చిట్టీవాళ్ళూ, భారవీవాళ్ళూ, శ్రీదేవి వాళ్ళూ రోజూ వస్తూనే వున్నారు. మూడోరోజు శ్రీదేవి అందరికీ తానే భోజనం వండి తీసుకువచ్చింది. ఆ రోజున అందరూ ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. అంతవరకూ దుఃఖం బయటపడకుండా వున్నా ఒక్క సారి ఇల్లు ఖాళీ అయిపోయే సరికి ముగ్గురం ఏడుపు ఆపుకోలేక ఒకరినొకరం హత్తుకుని దుఃఖించాం.

12వ తేదీ ఆదివారం కనుక ఆరోజు తాజ్ హోటల్ లో సంతాప సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని పల్లవి చేత బంధువులు అందరికీ ఫోన్ చేయించాను. మా పెద్దన్నయ్యకి చేస్తే మా వదిన ఫోన్ లో “ఇంట్లో పూజ చేయటం లేదా తక్కువలో అయిపోతుందనా హొటల్ లో చేసేస్తున్నారు ” అంది. ఇంట్లో కంటే హొటల్ లో చేస్తే యింకా ఎక్కువౌతుంది అని తెలియదా. ఏమయితేనేం వాళ్ళు రాలేదు సరికదా కనీసం ఫోన్ లోనైనా నన్ను అన్నయ్య పలకరించలేదు. అదే విధంగా పెద్దాడబడుచు భర్తా, పిల్లలూ కూడా అంతే. వీర్రాజుగారి తరపునా, మా నాన్నగారి తరపునా, పల్లవి అత్తగారి తరపునా దగ్గర బంధువులు కూడా ఎవ్వరూ రాలేదు, ఫోన్ లో కూడా పలకరించలేదు. బహుశా సక్రమంగా దైనందిన కర్మకాండ చేయలేదనేమో. రెండో రోజు నాళేశ్వరం శంకరం పల్లవిని స్మశానానికి తీసుకువెళ్ళి అతనే ఒక కుండలో అస్థికలు ఏరి వేసి ఇచ్చాడు. అది చూసి పల్లవి కదిలిపోయింది. ఇంటికి వచ్చాక ‘ ఏ బంధం వుందని శంకరం అంకుల్ ఇంత చేసారు’ అని కన్నీళ్ళు పెట్టుకుంది. శ్మశానం వాళ్ళిచ్చిన పేపర్ మున్సిపల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తేనే డెత్ సర్టిఫికెట్ వస్తుందని వివరాలు కూడా శంకరమే చెప్పారు.

అయిదో రోజు మా మరిది చిట్టి, ఉషా మేము ముగ్గురం, భారవీ కలిసి ఉదయమే రాజమండ్రి బయలుదేరాము. శంకరం తాను కూడా వస్తాననీ రాత్రి డైరెక్టుగా కాలేజీ అయిపోయిన తర్వాత బస్ లో వస్తానన్నాడు. భారవే మినీ వేన్ మాట్లాడాడు. సాయంత్రానికి రాజమండ్రి చేరిపోయాము.హొటల్ లో డ్రైవర్ కి కూడా కలిపి నాలుగు రూములు రవిప్రకాష్ చేత బుక్ చేయించాము.హొటల్ కు రవిప్రకాష్ వచ్చి మాట్లాడాడు. మర్నాడు చేయాల్సిన ఆస్తిక నిమజ్జనం కోసం ఏర్పాటు చేయిస్తానని అన్నాడు.

దేవాంగ సంఘం ఆయన ఒకరు వచ్చి మర్నాడు దేవాంగసంఘంలో సంతాప సభ నిర్వహిస్తున్నామని రమ్మని చెప్పాడు. అంతేకాకుండా శీలావారి వీథిని శీలా వీర్రాజు వీథి అని మార్చటానికి ప్రపోజల్ పెట్టాలనుకుంటున్నాము అని అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. ఆ సమయంలో బత్తుల ప్రకాశరావుగారు, గణేష్ రాం గారూ కూడా హైదరాబాద్ లోనే వున్నారు. అందువలన ఇక్కడ ఏపని కోసం వచ్చామో అది పూర్తి చేసుకోవాలనే ఆలోచనలోనే వున్నాను.

ఉదయం చీకటితోనే తయారై గోదావరి ఒడ్డుకు బయలుదేరాము. బస్సులో వస్తానన్న శంకరం ఇంకా చేరక పోయేసరికి ఫోన్ చేసాను. రాజమండ్రికి డైరెక్ట్ బస్ తప్పిపోయిందనీ, విజయవాడ వరకూ వచ్చి మరో బస్ పట్టుకున్నాననీ, తాను తిన్నగా గోదావరి వొడ్డుకు వస్తానన్నాడు.

మేము గోదావరి వొడ్డున పూజ చేయించాల్సిన పంతులు కోసం చూస్తుండగా శంకరం వచ్చి గోదావరినదిలో మునిగి పూజ దగ్గరకు వచ్చాడు. ఈ లోగా పంతులుగారు వచ్చి మరిది చిట్టి చేత పూజ చేయించారు. తర్వాత పడవలో పంతులుగారితో బాటు చిట్టీ, భారవీ, శంకరం నది మధ్యకు వెళ్ళి నిమజ్జనం చేసి తిరిగి వొడ్డుకు వచ్చారు. ఒడ్డుకు రాగానే అక్కడ సిమెంట్ బెంచిమీద కూలబడి శంకరం వెక్కివెక్కి ఏడ్చాడు. అది చూసేసరికి ఎప్పటినుంచో అణచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా నాకూ వెళ్ళుకొచ్చేసింది. చిట్టి చేయటంలో ఇంకెవరూ లేరు కనుక అది అతనికి తప్పని బాధ్యత. ఏ వైపు చుట్టం అని ఈ శంకరంకీ వీర్రాజుగారికీ. ఏనాటి రుణానుబంధం. వుదయం సంగారెడ్డి వుద్యోగానికి వెళ్ళి రాత్రి అష్టకష్టాలు పడి బస్సుల్లో వచ్చి సమయానికి హాజరై తన చేతులారా అస్తికనిమజ్జనం చేసాడు. బహుశా మానస పుత్రుడు అయివుంటుంది అనిపించింది.

అక్కడ నుండి భోజనం చేసి దామెర్ల రామారావు చిత్ర కళా పరిషత్ కు వెళ్ళి వీర్రాజుగారి గ్యాలరీ చూసాము. ప్రారంభోత్సవం నాటి జ్ణాపకాలు మనసులో మెదిలాయి. తర్వాత చుట్టుపట్ల ప్రాంతాలు కొన్ని చూసి గోదావరి హారతి చూసి హొటల్ కు తిరిగి వచ్చేసాము. మర్నాడు వుదయం జాంపేటకు వెళ్ళాము. మారిపోయిన ఇళ్లనీ, ప్రాంతాన్నీ చూసి చిట్టీ, ఉషా బాల్య జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయారు. ఆనాటి తమ ఇంటినే చిట్టి గుర్తు పట్టలేకపోతుంటే అంతకు ముందు వీర్రాజుగారు కూడా అదేవిధంగా ఆనవాలు పట్టకపోవటాన్ని చెప్పాను. తర్వాత దేవాంగసంఘంవారు నిర్వహించిన వీర్రాజుగారి సంతాప సభకు వెళ్ళాము. వాళ్ళంతా వాళ్ళకు తెలియని వీర్రాజుగారి గురించి మాట్లాడారు. దాని తర్వాత తిరుపతిలో దేవాంగ సత్రంలో ఒక గదిని వీర్రాజుగారి పేరిట కట్టించడానికి ఏడున్నర లక్షలు అవుతుందని ఒక కరపత్రం మాకు ఇచ్చి ఇద్దరు ముగ్గురు అందుకు కన్విన్స్ చేయటానికి ఊదరగొట్టేసారు. నాకు చికాకు అనిపించింది. మేము వచ్చిన, వున్న పరిస్థితి ఏమిటి? మా దగ్గర లక్షలు పోగు పోసుకుని వున్నామను కున్నారా? ఒక వేళ వున్నా ఈ పరిస్థితుల్లో ఆ వత్తిడి ఏమిటి? ఏమీ మాట్లాడకుండా వూరుకున్నాము. హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం కట్టాము. ఈ సారి శంకరంకూడా మాతో బాటూ మినీ వేన్ లో వచ్చాడు.
నేను సాహితీకారులకు ఫోన్ చేసి 12 వతేదీన నారాయణగూడ తాజ్ హొటల్ లో శీలావీ శ్రద్ధాంజలి సభ జరుగుతుందని చెప్పాను.

ప్రత్యేకంగా శివారెడ్డి, గోపీ, నగ్నముని, నిఖిలేశ్వర్, శిఖామణి వంటి దగ్గర మిత్రులకు సభలోమాట్లాడమని కోరాను. హైదరాబాద్ వచ్చాక పన్నెండో రోజు కార్యక్రమం గురించి ఏర్పాట్లు మొదలు పెట్టాము. జనసాహితి లక్ష్మీ, శ్రీధర్ తాజ్ హొటల్ లో వాళ్ళకు తెలిసిన ఆయన వున్నాడట, ఆరోజుకి వాళ్ళే బుక్ చేసారు. బానర్ చేయించాము. వీర్రాజుగారి గురించి వచ్చిన వ్యాసాలను సేకరించి దశదినకర్మనాటికి వచ్చేలా ప్రజాసాహితి ప్రత్యేక సంచిక ప్రచురించారు.

దగ్గర బంధువులూ, మా కుటుంబానికి ఆత్మీయులు, మిత్రులూ, సన్నిహితులూ సుమారు రెండువందల మందికి పైగా హాజరయ్యారు. శివారెడ్డి, ఎన్.గోపీ, నగ్నమునీ, నిఖిలేశ్వర్, శిఖామణీ, శంకరం, ప్రసాద మూర్తి, ఎన్.వేణుగోపాల్ వంటి ప్రముఖులచే లక్ష్మి ప్రజా సాహితి వీర్రాజుగారి ప్రత్యేక సంచికను ఆవిష్కరింపచేసింది. అందరూ ఆత్మీయంగా మాట్లాడారు. బత్తుల ప్రకాశరావుగారూ మాట్లాడారు.
ఆషీచేత ముగింపువాక్యాలు చెప్పించారు.

బంధువులకూ, కుటుంబ మిత్రులకూ వీర్రాజు గారి పేరిట చిన్నవెండిగిన్నెలు పంచింది పల్లవి. సాహితీబంధువులకు వీర్రాజుగారి కవిత్వం సెట్, ఇంగ్లీష్ కథల పుస్తకం కవర్లలో పెట్టి అందజేసాము . తదనంతరం భోజనాలు చేసి వీర్రాజుగారికి ఘనంగా సంతాపం సమావేశం శ్రద్ధాంజలితో ముగిసింది.

*****

Leave a Reply

Your email address will not be published.