
అద్వైత రూపం
(నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– శింగరాజు శ్రీనివాసరావు
ఏ నిర్లక్ష్యం వ్రాసిన వీలునామానో
నేలమీద మట్టికి ఎరుపు అద్దకం అద్దింది
విధి వ్రాసిన వ్రాతో, బాధ్యతా రాహిత్యమో
మెలుకువరాని నిద్రలోకి చేరుకున్నాడతను
ఆమె పగిలిన కనుగుడ్ల నుంచి వొలికిన కన్నీటిసిరా
అతని ముగిసిన కథను తిరిగి వ్రాయలేక పోయింది
వెలుగు బొట్టు జారిన ముఖం
గుడిసె ముంగిలిని చీకటిలోకి నెట్టింది
జాలి పలుకుల వర్షం శరీరాన్ని తడిపినా
జోలెలో కరుణ కాసులేవి రాలలేదు
కంటనీరు కడుపులోకి జారినా
మండుతున్న జఠరాగ్ని ఆరలేదు
వెలగని కట్టెల పొయ్యిమీద
గింజలు లేని చట్టి అడిగింది…
నా కడుపు నిండేది ఎపుడని?
కడుపున కాచిన కాయల బాధ్యత మోయడానికి
నాలుగిళ్ళలో పొరకకట్టగా మారింది ఆమె
ఇప్పుడు ఆమె తల్లి, తండ్రి ఒకటే అయిన
అద్వైతరూపం…
బిడ్డలను కప్పి కాచుకునే సహజకవచం…
*****

నేను భారతీయ స్టేట్‌బ్యాంకులో డిప్యూటిమేనేజరుగా బాధ్యతలు నిర్వహించాను. పదవీ విరమణ అనంతరం సాహిత్యం మీద అభిలాషతో 2016 సంవత్సరం నుంచి కవితలు, కథలు వ్రాయడం మొదలుపెట్టాను. నా మొదటి కవితను మరియు మొదటి కథను ప్రచురించినది “ఆంధ్రభూమి వారపత్రిక”. మొదటిసారిగా “నేలతల్లి” కథకు ఆంధ్రభూమి దినపత్రికలో ద్వితీయ బహుమతి లభించింది. ఇప్పటి వరకు సుమారు 50 కథల పైగా వివిధ వార, మాస పత్రికలలోను, అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యాయి. అందులో 20 కథలకు బహుమతులు లభించాయి. రెండు వందల వరకు కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వాటిలో 30 కవితల వరకు బహుమతులు పొందాయి.
