
ఒక అనుచిత శోధన
एक गलत तफ़्तीश
హిందీ మూలం – డా. లతా అగ్రవాల్
తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు
“ఏమండీ, కాలనీ వాట్సప్ మీద ఒక మెసేజ్ వచ్చింది. మీరు చూశారా?” రంజన సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన భర్తకి చెబుతూ అడిగింది.
“లేదు. నాకు చూడటం కుదరలేదు. ఏమని ఉంది మెసేజ్ లో?” మిస్టర్ శర్మ అడిగాడు.
“రేపు డాక్టర్ కులకర్ణి కాలనీలో మెడికల్ అసోసియేషన్ తరఫున ఒక క్యాంపు పెడుతున్నారని. విశేషమేమిటంటే, ఇది పూర్తిగా ఫ్రీగా నడుపుతున్న మెడికల్ టెస్ట్ క్యాంప్ అని.” రంజన సంతోషం వ్యక్తపరుస్తూ అంది.
“పెడితే పెట్టుకోనీ. డాక్టర్లకి ఇది బిజినెస్సే కదా.”
“మీరు మరీనూ… ఇది బిజినెస్ పర్పస్ తో కాదు, సోషల్ వర్క్ దృష్టితో పెడుతున్నారు. కాలనీలో ప్రతివ్యక్తికి మెడికల్ చెకప్ చెయ్యాలనే ఆశయంతో. జనంలో హెల్త్ అవేర్ నెస్ కోసం వాళ్ళు మొత్తం సిటీలో ఇలాంటి క్యాంపులు పెడుతూ ఉంటారు.”
“సరే, పెట్టుకోనీ. నువ్వు దేనికి ఇంత ఇలా ఉబలాటపడుతున్నావు?” మిస్టర్ శర్మ కాస్త విసుగుచూపిస్తూ అన్నాడు.
“ఎందుకంటే రేపయితే మీకు ఆఫీసుకి సెలవురోజు. మీరు ఇంట్లోనే ఉంటారు కదా. రెండోది ఈ క్యాంపు ఫ్రీగా పెడుతున్నారు. మనం ఎక్కడికైనా మెడికల్ చెకప్ కోసం వెడితే ఒక్క చెకప్ కే చార్జి వెయ్యి రూపాయలన్నా కావడం సాధారణమైన విషయం. మరి మనం ఇద్దరం కూడా ఫుల్ మెడికల్ చెకప్ చేయించుకుందామా.” రంజన ముఖంలో ఉత్సాహాన్ని తెలియపరుస్తూ అంది.
“కాని మనకేమీ ప్రోబ్లమ్ లేనప్పుడు ఎందుకు వెళ్లాలి చెకప్ చేయించుకునేందుకు. ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళని చేయించుకోనీ. ఊరికేనే గుంపుని పెంచుకుంటే ప్రయోజనం ఏముంది.” మిస్టర్ శర్మ చాలా సహజంగానే అన్నాడు.
“అదే కదా….. మరిచిపోయారా మీరు. మీకు అసలేమీ జ్ఞాపకం ఉండదు. అరే, పోయిన నెలలో ఉన్నట్టుండి నాకు కడుపులో తీవ్రంగా నొప్పి వచ్చింది కదా.” రంజన గుర్తు చేస్తూ అంది.
“అవును… దానికి కారణం జబ్బు ఏదీ కాదు. ఆరోజు కిట్టీ పార్టీలో ఫ్రీగా దొరుకుతోంది కదా అని నీకు కావలసినదానికన్నా ఎక్కువగా ఛోలే-భటూరేలు లాగించేశావు నువ్వు. అందుకనే నీకు గ్యాస్ తయారై, చివరికి వాంతి చేసుకున్న తరువాత సర్దుకుంది కూడా.”
“సరే, అదికాదు. నేను మీకు చెప్పానుకదా, నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తూ ఉంటోందని.”
“అయితే అది గ్యాస్ ప్రోబ్లమ్. కాస్త వాకింగ్ చేస్తూ ఉండు. నాతోపాటు పొద్దున్నే యోగా చెయ్యడానికి వస్తూ ఉండమని ఎన్నిసార్లు చెప్పాను నీకు… కాని నువ్వు మాత్రం వినవు. అప్పుడైతే పక్కమీదనుంచి లేచి రావడానికి నీకు ఒళ్ళు వంగదు. నీ బుర్రలో అక్కరలేని సైకాలజీ పెట్టుకోకు. ఫ్రీగా ప్రయోజనం పొందడంలోని ఆనందం కావాలని తిన్నగా చెప్పేసెయ్.”
“మీరు ఏమన్నాఅనండి… నేను చెకప్ చేయించుకోవాలి.” రంజన తన నిర్ణయం తెలియపరుస్తూ అంది.
“అయితే వెళ్ళు. వెళ్ళి లైన్ లో నిలబడు.”
“ఊహూఁ…. నేను ఒక్కదాన్నీ వెళ్ళను. ప్లీజ్ మీరు నాకోసం నాతోబాటు రాకూడదూ…” రంజన ప్రాధేయపడుతూ ఉంటే మిస్టర్ శర్మ రంజనతో పాటు క్యాంప్ లోకి వెళ్ళడానికి సిద్దమయ్యాడు.
ఆరోజు కాలనీలోని అరుణ్ సభాగారంలో ఉదయం మిస్టర్ శర్మ యోగా కోసం చేరుకునే సమయానికే అక్కడ దృశ్యం మారిపోయి ఉంది. అక్కడ జనసందోహంతో సందడిగా ఉంది. మొత్తం హాలంతా పెద్ద-పెద్ద బ్యానర్లు పెట్టి ఉంచారు. (`ఆరోగ్యమే మహాభాగ్యము’, మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీకు సేవలు అందిస్తున్నవారు- కార్డియోలజిస్ట్, డెర్మటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటెరోలజిస్ట్, న్యూరోలజిస్ట్, ఆర్తోపెడిక్ సర్జన్, యూరోలజిస్ట్, గైనికోలజిస్ట్, సైకాలజిస్ట్, పల్మోనాలజిస్ట్, ఆప్టోమెట్రిస్ట్…..) ఇదంతా చూసి మిస్టర్ శర్మకి ఆశ్చర్యం కలిగింది. ఇంతమంది డాక్టర్ల సమ్మేళనమా… ఇంటికి వచ్చి ఈ సంగతి రంజనకి చెప్పినప్పుడు ఆమెకి ఇంకా ఎంతో ఉత్సాహం కలిగింది.
“నేను చెప్పానుకదా…. మీరు మాత్రం నమ్మలేదు.ఇది సౌకర్యవంతంగా ఉంటుంది కదా, ఇంతమంది డాక్టర్ల పేర్లు మనం వినలేదు. వాళ్ళందరూ ఇవాళ కలుసుకునేందుకు ఒక్కచోట దొరుకుతారు.”
“నేననేది అదికాదు. ఏమీలేకుండా ఊరికేనే, ముక్కోటి దేవతలందరూ ఒక్కచోట కనిపిస్తున్నట్లుగా నువ్వు ఎంతో సంబరపడిపోతున్నావు…. ”
రంజన, మిస్టర్ శర్మ అక్కడికి చేరుకోగానే, కాలనీ డాక్టరు కులకర్ణి గేటు దగ్గరే ఉత్సాహంగా, సాదరంగా వాళ్ళకి స్వాగతం చెబుతూ అన్నాడు- “అరే శర్మగారూ. మీరా… అంతా కులాసానే కదా?”
“డాక్టరుగారూ! దేవుడిదయవల్ల అంతా బాగానే ఉన్నాము. కాస్త మా ఆవిడకే కొంచెం ఇబ్బందిగా ఉంది.” నవ్వుతూనే మిస్టర్ శర్మ రంజన వైపు చూపిస్తూ అన్నాడు.
“అలాగా. మేడమ్ గారూ ఏమయింది మీకు…. మంచిదయింది మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మొత్తం డాక్టర్ల టీమ్ అంతా ఉంది. రండి. ఈపక్కకి రండి.” తన టేబిలు దగ్గర కూర్చుంటూ డాక్టర్ కులకర్ణి వాళ్ళని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సంకేతం చేస్తూ అడిగాడు- “ఇప్పుడు చెప్పండి ప్రోబ్లమ్ ఏమిటి?”
“హూఁ!” అంటూ మిస్టర్ శర్మ రంజనను మోచేతితో స్పృశిస్తూ నీ సమస్య ఏమిటో చెప్పమంటున్నట్లుగా సంజ్ఞ చేశాడు.
“అదీ డాక్టరు గారూ, పోయిన నెలలో కడుపులో బాగా తీవ్రంగా నొప్పి వచ్చింది. తల కూడా భారంగా అనిపించింది. కొంచెం సేపట్లోనే వాంతులు కూడా అవడం మొదలయింది….” రంజన తన సమస్యగురించి ఇంకా ఏదో చెబుతున్నంతలోనే మిస్టర్ శర్మ మధ్యలోనే అన్నాడు- “ఇది కూడా చెప్పు. వాంతులయిన తరువాత కడుపునొప్పి సర్దుకుందని. ఎందుకంటే, ఛోలే భటూరే తినడంవల్ల గ్యాస్ ఫార్మ్ అయిందని.”
“ఇంక అంతా మీరే చెప్పండి… నేనేమీ మాట్లాడను.” రంజన కొద్దిగా కోపం చూపిస్తూ అంది.
“అరే మేడమ్ గారూ, కోపం తెచ్చుకోకండి. శర్మగారి స్వభావం మీకు బాగా తెలుసుకదా, మాటిమాటికీ వేళాకోళం చెయ్యడం ఆయనకి అలవాటు. సరే, ఇప్పుడు మీ వయస్సు ఎంత ఉండచ్చునో చెప్పండి.”
“సార్, 50 ప్లస్.”
“మీరు 40 ప్లస్ అనే అనిపిస్తున్నారు మేడమ్ గారూ. మిమ్మల్ని మీరు బాగా మెయింటెయిన్ చేసుకున్నారు.”
“హిహి…” అంటూ రంజన తనమీద తనే మోహితురాలయింది.
“శర్మగారూ! చూడండి. సమయం అనేది చాలా ప్రమాదకరంగా నడుస్తోంది. 50 ప్లస్ వారు కూడా ఏదీ రిస్కు తీసుకోకూడదు. కడుపులో ఉన్న సమస్య. మన దగ్గర డాక్టర్లు కూడా ఉండనే ఉన్నారు. అసలు ఇబ్బంది ఏమిటన్నది ఇప్పుడే తెలిసిపోతుంది. మీరు నాతో రండి.” అంటూ ఆయన వాళ్ళిద్దరినీ తీసుకుని గ్యాస్ట్రోఎంటెరాలజిస్టు ఉన్న టేబిలువైపుకి నడిచాడు. రంజన, మిస్టర్ శర్మ సమ్మోహితులైనట్లుగా డాక్టర్ కులకర్ణి వెనకాలే నడిచారు.
“డాక్టర్ అమిత్! వీరు మిస్టర్ అండ్ మిసెస్ శర్మ. నాకు మంచి నెయిబర్లు. మేడమ్ కి కొంచెం పొట్టకి సంబంధించిన ప్రోబ్లమ్ ఉంది. ప్లీజ్ కాస్త చూడండి.” డాక్టర్ కులకర్ణి మాటల్లో తేనె ఒలుకుతున్నట్లుగా ఉంది.
“డోంట్ వర్రీ మిస్టర్ కులకర్ణీ. నేను ఇప్పుడే చూస్తాను. కాస్త ఇద్దరు పేషెంట్లు ఇంకా ఉన్నారు.” రంజన ఇంతగా వి.ఐ.పి. ట్రీట్ మెంటు చూసి ఆనందం పట్టలేకుండా ఉంది. ఆమె గుండెలో డాక్టర్ కులకర్ణికోసం ఎన్నో కృతజ్ఞతలు వెలువడుతున్నాయి. క్లినిక్ లో అయితే ఇంత ఫీజు ఇచ్చుకుని కూడా, గంటలతరబడి ఎదురుచూస్తూ కూర్చోవాలి. మన వంతు ఎప్పుడు వస్తుందా అని. ఇక్కడమాత్రం కులకర్ణిగారి కారణంగా పని ఫటాఫట్ అయిపోతోంది.
“ఏమండీ, ఏమంటారు…. మనం ఊరికేనే డాక్టర్లగురించి అనుకుంటూఉంటాం. ఇక్కడ చూడండి. వీళ్ళు ఎంత ప్రాక్టికల్ గా ఉన్నారో.” నెమ్మదిగా తన భర్త చెవుల్లో గుసగుసలాడుతూ అంది రంజన. మిస్టర్ శర్మ హాలంతా పరికించి చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. ఆయన అనుకుంటున్నది నేను సంవత్సరాల తరబడి రోజూ ఉదయం ఇక్కడికి యోగా కోసం వస్తున్నాను. కాని ఇక్కడ ఎప్పుడు చూసినా, 25-30 కన్నా ఎక్కువ జనం కనిపించలేదు. ఈరోజు మాత్రం నాలుగుపక్కలా పెద్ద-పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. ఇది ఫ్రీ క్యాంప్ ప్రభావం. నిజంగా ఇంతమంది జనం ఆరోగ్యానికి సంబంధించిన జబ్బులతో బాధ పడుతున్నారా? రంజన మాటలతో మిస్టర్ శర్మ ధ్యాస భంగమయింది. ఆయన ఏదో చెప్పేలోగానే డాక్టర్ అమిత్ గొంతుక వినిపించింది.
“మిసెస్ రంజన శర్మా, ప్లీజ్ రండి” రంజన గ్రీన్ తెర వెనుకగా ఉన్న స్ట్రెచర్ మీద పడుకుంది.
“చెప్పండి మేడమ్, నొప్పి ఎక్కడ ఉంటోంది. ఇక్కడా?”
“కాదు.”
“ఇక్కడా?”
“కాదు-కాదు.”
“ఇక్కడ?”
“అవును. ఇక్కడే.”
“ఓకే. ఏదయినా తిన్నప్పుడు వస్తుందా లేకపోతే ఎప్పుడూ ఉంటుందా?”
“ఈమధ్య తరచు తేలికగా నొప్పి వస్తూ ఉంటుంది.”
“మీకు మెన్సస్ నెలవారీ రిగ్యులర్ గా ఉంటోందా?”
“అది… వెనక అయితే ఉండేది. కాని మూడు-నాలుగు నెలలకి ఎప్పుడైనా…”సంకోచిస్తూ అంటున్నరంజన మాటలు అస్పష్టంగా ఉన్నాయి. డాక్టర్ అమిత్ కి అర్ధం అయింది.
“ఓకే….ఓకే, సరే మీరు లేచి బయటికి రండి.” అంటూ డాక్టర్ అమిత్ హ్యాండ్ గ్లవ్స్ తీసి డస్ట్ బిన్ లో వేస్తూ బయట తన కుర్చీలో కూర్చున్నాడు. అప్పటికి రంజన కూడా వచ్చి తన భర్త పక్కనే కూర్చుంది. తన నోట్ ప్యాడ్ మీద ఏదో ప్రిస్క్రిప్షన్ రాస్తూ డా. అమిత్ అన్నాడు-
“మిస్టర్ శర్మా! నాకు కొంచెం డౌట్ గా ఉంది. మిసెస్ శర్మ గారి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఏమయినా ఉండవచ్చునని. బెటర్, మీరు అల్ట్రాసౌండ్ చేయించండి. పరిస్థితి కాస్త క్లియర్ అవుతుంది.” డా. కులకర్ణి సమ్మోహనం రంజన మీద పూర్తిగా ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు మిస్టర్ శర్మ కూడా ఆయన పరిధిలోకి వచ్చేశాడు.
“సరే డాక్టరు గారూ, ఈ కాలనీకి పక్కనే సుజల్ అల్ట్రాసౌండ్ సెంటరు ఉంది. అక్కడ చేయిస్తాను. రిపోర్టు తీసుకుని మీదగ్గరికి వస్తాను.”
“సుజల్ అల్ట్రాసౌండా…! ఇదెక్కడినుంచి వచ్చిందండీ…. ఈ పేరెప్పుడూ వినలేదే…. వద్దు మిస్టర్ శర్మా, మీరు అలాంటి ఇలాంటి సెంటర్లలో రిస్కు తీసుకోవద్దు. నా దృష్టిలో హీరానంద్ హాస్పిటల్ ఉంది చూడండి..”
“హీరానందా! ఎప్పుడూ ఈ పేరు వినలేదండీ…. ఎక్కడ ఉంది?” మిస్టర్ శర్మ అడిగాడు.
“అరే, ఏమిటి మీరనేది. ఇది నియర్ బై అయోధ్యానగరి మంచి హాస్పిటల్. మీరు అక్కడ చేయించుకోండి. నేను రాసిస్తాను. మీకు అక్కడ పని తొందరగా చేసి ఇస్తారు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అక్కడికే వచ్చి రిపోర్టు కూడా చెక్ చేసుకుంటాను.” డా. అమిత్ అన్నాడు.
“సరే. అలాగేనండి.”
“అదే, మీరు లేట్ చెయ్యకండి. జబ్బు పెరగడంవల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. నేనయితే రేపే మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోమని చెబుతాను.”
నిజంగానే మర్నాడు మిస్టర్ శర్మ ఆఫీసునుంచి సెలవు తీసుకున్నాడు. పొద్దున్నే ఏమీ తినకుండా పరగడుపునే రంజనని హీరానంద్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళాడు. సాయంత్రం డాక్టరుగారు రిపోర్టు చూసి ఏం చెబుతారోనని ఎదురుచూస్తున్నాడు. ఆ సాయంత్రం రిపోర్టు చెక్ చేశాక, డా. అమిత్ సీరియస్ గా తన ముఖంపెట్టి అన్నాడు- “నేను దేనికి భయపడ్డానో అదే జరిగింది.”
“ఏమయింది డాక్టరు గారూ!” కంగారు పడుతూ మిస్టర్ శర్మ అడిగాడు.
“మిస్టర్ శర్మా! ఈవిడ గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉన్నాయి.. మంచిదయింది మీరు సమయానికి చెక్ అప్ చేయించుకున్నారు. లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది.”
“ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టరు గారూ?”
“ఏం వర్రీ అవద్దు మిస్టర్ శర్మా, ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలి. కంగారు పడకండి. స్టోన్స్ తీసేస్తారు. మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా మేడమ్ గారి పేరుతో.”
“అవును. ఉందండి.”
“ఎన్ని లక్షలకి?”
“అది… అయిదు లక్షలకి ఉందండి.”
“అయితే మీరు తొందరగా ఇదే హాస్పిటల్లో అడ్మిట్ చేయించండి. నేను ఎవరైనా మంచి సర్జన్ తో మాట్లాడతాను.”
“కాని, మా పిల్లలు బయట ఉన్నారండి. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడాలి.”
“అరే మిస్టర్ శర్మా, మీరు అనవసరంగా వర్రీ అవుతున్నారు. ఇందులో ఇంత వర్రీ కావలసిన పని లేదు… మామూలు ఆపరేషనే. అంతా బాగానే ఉంటుంది. మీరు ఏం డిసైడ్ చేసినా, త్వరగా చెయ్యండి. ఇన్ ఫ్యాక్ట్, నేను చెప్పేదేమిటంటే, ఈ వారంలోనే చేయించుకోండి… లేకపోతే డాక్టర్లు బయటికి వెడుతూ ఉంటారు. వాళ్ళ టైమ్ దొరకడం కష్టమవుతుంది.”
“సరే డాక్టరుగారూ, నేను ఇంటికి వెళ్ళి పిల్లలతో మాట్లాడి చెబుతాను.”
“ఏదయినా నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి. ఒక రోజు ముందుగా అడ్మిట్ చేయించుకోవాలి. ఎందుకంటే కావలసిన టెస్టులు అన్నీ చేయించుకోవాలి కదా. ఆ మర్నాడు మార్నింగ్ ఆపరేషన్ కావాలి. ఈలోగా నేను కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తాను. రిగ్యులర్ గా ఇస్తూ ఉండండి.”
మిస్టర్ శర్మ ఇంటికి వెళ్ళి ఇద్దరు కొడుకులతోనూ మాట్లాడినప్పుడు చిన్నకొడుకు రితేష్ అన్నాడు-
“నాన్నా! ఎందుకన్నా మంచిది మీరు ఇంకో డాక్టరు దగ్గర కూడా ఒపీనియన్ తీసుకోండి.”
“సరేరా. తెలుసుకుంటాను.”
ఒకపక్క తన ఉద్యోగం గురించిన పనులవత్తిడి. రెండోది రంజన కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అందువల్ల మిస్టర్ శర్మ అంత తొందర చూపించలేదు. రంజన మందులు కూడా విడవకుండా తీసుకుంటోంది. ఇంచుమించు ఒక వారం కావస్తూనే, డాక్టర్ అమిత్ క్లినిక్ నుంచి వాళ్ళ అసిస్టెంటు ఫోన్ చేశాడు.
“నేను డాక్టర్ అమిత్ గారి అసిస్టెంటుని మాట్లాడుతున్నానండి. ఆపరేషన్ గురించి మీరు ఏం ఆలోచించారండి… మీరు మళ్ళీ ఇంతవరకూ రాలేదు.”
“మా పిల్లలకి ఇప్పుడే రావడం కుదరదు. వాళ్ళకి సెలవుకూడా దొరకడంలేదు. వాళ్ళు వచ్చారంటే కాస్త ఆలోచించుకుని చెబుతాను.”
“మీరు ఎలా బాగుందనుకుంటే అలా చెయ్యండి మిస్టర్ శర్మ గారూ. కాని నేను అనుకోవడం స్టోన్స్ గాల్ బ్లేడర్ లో ఎక్కువ సమయం ఉండటం ప్రమాదకరం కావచ్చునని. మీరు ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే పేషెంటుకి అంత ఫేవరబుల్ గా ఉంటుంది.”
మర్నాడు ఉదయం కాలనీలోని ఆ సభాగారంలో యోగా కోసం వెడుతూ ఉంటే డాక్టర్ కులకర్ణి ఎదురుపడ్డాడు.
“గుడ్ మార్నింగ్ మిస్టర్ శర్మా, మేడమ్ గారు ఎలా ఉన్నారు?”
“ఆవిడకి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉన్నట్లుగా డాక్టర్ అమిత్ చెప్పారు. ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు.”
“అయితే ఇందులో టెన్షన్ దేనికి? చేయించేసుకోండి ఆపరేషన్. ఇట్స్ సో ఈజీ.” దానితోపాటు ఆయన సూచన కూడా ఇచ్చాడు- “’టైమ్ ఉండగా తెలిసినప్పుడు ఎక్కువ ఆలస్యం చెయ్యడం మంచిది కాదు మిస్టర్ శర్మా.”
మిస్టర్ శర్మ మళ్ళీ కాస్త జాగ్రత్త పడ్డాడు. సాయంత్రం పిల్లలతో మాట్లాడుతూ ఆయన అన్నాడు- “ఇంకా ఏ డాక్టరు దగ్గర ఒపీనియన్ తీసుకోవాలో నాకు అర్థం కావడంలేదు. ఇక్కడ డాక్టర్లు చెబుతున్నది ఆలస్యం చెయ్యడం మంచిది కాదని.”
అప్పుడు పెద్దకొడుకు రోహన్ అన్నాడు- “మీరు దిగులు పడకండి నాన్నగారూ, నేను ఆన్ లైన్ లో తెలుసుకుంటాను.” రోహన్ ఆన్ లైన్ లో చెక్ చేసిన తరువాత ఒక డాక్టర్ మన్సూర్ ప్రొఫైల్ కి చెందిన గ్రేడ్ చూసి ఆయన పేరు సజెస్ట్ చేశాడు. ఆయన ఎండోస్కోపీలో ఎక్స్ పర్ట్. ఇటు ఒక వారానికి మందులు అయిపోగానే రంజనకి మళ్ళీ కడుపులో నొప్పి రావడం మొదలయింది. ఇంక మిస్టర్ శర్మ ఆవిడని మళ్ళీ చూపించడమే బాగుంటుందని అనుకున్నాడు. పాత రిపోర్టులన్నీ డా. మన్సూర్ కి ఎదురుగా ఉంచాడు. వాటిని మొదటిదృష్టిలోనే చూసి డా. మన్సూర్ వాటిని వేరుగా పెట్టాడు. రంజనని చెక్ అప్ చేసి ఆయన తన సలహా ఇస్తూ అన్నాడు- “మిస్టర్ శర్మా, పరిస్థితి క్లియర్ గా లేదని నాకనిపిస్తోంది. మీరొక పని చెయ్యండి. `ఈఆర్ సీపీ’ (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలెంజియో ప్యాంక్రియేటోగ్రాఫీ) చేయించండి. ఎందుకంటే విడవకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నా కడుపునొప్పి వస్తూనేవుందంటే నాకు ఇది ప్యాంక్రియాజ్ క్యాన్సర్ కాదుకదా అని అనుమానంగా ఉంది. నేను చెప్పేది మీరు ప్యాంక్రియాజ్ కి, గాల్ బ్లేడర్ బయోప్సీ కి రెండింటికీ కూడా టెస్ట్ చేయించుకోండి.”
“క్యాన్సర్…!”ఆ పేరు వినగానే మిస్టర్ శర్మకి కళ్ళముందు చీకట్లు కమ్మాయి. డాక్టర్ మన్సూర్ కి ఊళ్ళో మంచి పేరుంది. ఆయన అబద్ధం ఎందుకు చెబుతాడు? మరోపక్క అతని ఫ్రెండ్స్ కూడా సలహా ఇచ్చారు- “డాక్టరంటే దేవుడిలాంటివాడు. తప్పుడు అభిప్రాయం ఎందుకు చెబుతాడు.” ఇంక అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్యాంక్రియాజ్, గాల్ బ్లేడర్ బయోప్సీకి చెందిన రెండు టెస్టులూ చేయించాడు. దేవుడి దయవల్ల రిపోర్టులు నెగటివ్ గా వచ్చాయి. కాని, బయోప్సీ, దానితోపాటు ఎండోస్కోపీ చేయించుకున్న తరువాత ఆరోగ్యం మెరుగు పడటం మాట అలావుంచి, రంజన ఆరోగ్యం ఇంకా పాడవసాగింది. ఆమె బాధ ఇంకా పెరిగింది. ఈ పరిస్థితి చూసి మిస్టర్ శర్మ ఇంక గత్యంతరం లేక హీరానంద్ హాస్పిటల్లో డాక్టర్ అమిత్ దగ్గరికి చేరుకున్నాడు. బహుశా ఆయన ఉన్న విషయమే చెప్పి ఉంటాడని అనుకున్నాడు. గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉండవచ్చునేమో. డా. అమిత్ దగ్గరికి వచ్చి అతను డా. మన్సూర్ దగ్గర జరిగినదంతా చెప్పాడు. విషయమంతా విని డా. అమిత్ మండిపడ్డాడు. ఆయన వ్యవహారమే మారిపోయింది. ఆయన కంఠస్వరంలోని తియ్యదనం కాకరకాయలోని చేదుతనంగా మారిపోయింది.
“సారీ! మిస్టర్ శర్మా, మీరు నేను చెప్పింది నమ్మకుండా పేషెంటు కేసుని ఇంకా క్రిటికల్ గా చేశారు. ఇప్పుడు ఒకవేళ కేసు విషమిస్తే దానికి మీరే బాధ్యులవుతారు. నేను మీకు చెప్పాను కదా, గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఎక్కువ సమయం వరకు ఉండటం అనేది చాలా ప్రమాదకరమని.” మిస్టర్ శర్మ ఏమీ చెప్పలేక పరితాపంతో తల వంచుకుని వింటూ నిలబడ్డాడు. చివరికి తప్పు తనవల్లే జరిగింది. ఏం చెయ్యాలి మరి.
“సార్, జరిగిందేదో మరిచిపొండి…. ప్లీజ్ ఇప్పుడు ఇకముందు ఏం చెయ్యాలో చెప్పండి.”
“చేసేదేముంది మిస్టర్ శర్మా, పేషెంటుని ఇమీడియెట్ గా అడ్మిట్ చేయించండి. మేం మళ్ళీ ఆవిడకి ఆ మొత్తం టెస్టులన్నీచెయ్యాలి. అప్పుడే చెప్పగలుగుతాం పరిస్థితి ఏమిటన్నది.”
రంజనని అడ్మిట్ చేశారు. మిస్టర్ శర్మ కంగారుగా కొడుకులిద్దరినీ కాల్ చేసి మాట్లాడాడు. వాళ్ళు కూడా తరువాతి ఫ్లైట్ పట్టుకుని వచ్చారు. మరోపక్క రంజన బాధ కూడా ఎక్కువైపోతోంది. ఆమెకి మంత్లీ బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా అవుతూవుండేది, ఇప్పుడు ఉన్నట్టుండి పెరిగిపోయింది.
“మిస్టర్ శర్మా, మేము స్పెషలిస్టుని పిలవవలసి వస్తుంది. వాళ్ళ విజిట్ కి చార్జి అవుతుంది.”
“అయితే అవుతుంది. డాక్టర్లని పిలవండి.” ముగ్గురు స్పెషలిస్టులని హాస్పిటల్ అరేంజ్ చేసింది. వాళ్ళు అనుమానం వెలిబుచ్చారు.
“బహుశా కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా ఈ నొప్పి వస్తున్నట్లుంది. ఆవిడని వెంటనే ఐసియూ లో ఉంచండి.”
రోహన్ డాక్టర్ అమిత్ ని అడిగాడు- “సార్, ఇన్ని టెస్టులు చేయించాక కూడా ఇంతవరకూ అసలు జబ్బు ఏమిటో ఎందుకు అంతు చిక్కడంలేదు. ప్రతి డాక్టరు కేవలం అనుమానం మాత్రమే వ్యక్తపరుస్తు న్నారు. డెఫినిట్ గా ఎవరూ ఏమీ ఎందుకు చెప్పటం లేదు?”
“చూడండి మిస్టర్ రోహన్, మేము డాక్టర్లం…దేవుళ్ళం కాదు. రిపోర్టు ఏం చెబుతోందో అదేకదా మేము చెప్పేది… అదీకాక ఆపరేషన్ డిలే చేసి మీఅంతట మీరే కేసుని క్రిటికల్ గా చేశారు.”
అమ్మ ప్రమాదంలో ఉంది. డాక్టర్ల అధీనంలో ఉంది. అందుకని రోహన్ మౌనంగా ఉండిపోయాడు. లేకపోతే అతను ఎంతో చెప్పాలని అనుకుంటున్నాడు. డాక్టర్, మా అమ్మ ఆరోగ్యంగా ఉన్న మనిషి. మిమ్మల్ని దైవస్వరూపులుగా భావించి మీ ఆశ్రయంలోకి వచ్చింది. కాని ఇవాళ ఆవిడ పరిస్థితి ఇలా తయారయింది.
ఐసియులో రంజన పరిస్థితి మెరుగుపడటానికి బదులు ఇంకా విషమించసాగింది. ఆమెకి చాలా కంగారుగానూ, అశాంతిగానూ ఉంది. ఆమెకి బి.పి. మాటిమాటికి అస్థిరంగా అయిపోతోంది, డాక్టరు లివర్, హార్ట్, కిడ్నీ తో సహా ఇంకా చాలా బ్లడ్ టెస్టులు రాశాడు. ఈసారి రిపోర్టు చూసి ఆయన చెప్పింది కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిందని, ఆవిడని డయాలిసిస్ లో ఉంచాలని. రంజనని డయాలిసిస్ లో ఉంచారు. ఆమెకి బలహీనత పెరుగుతూనే ఉంది. మందులు ఇస్తున్న పేరుతో ప్రతి అరగంటకి నర్సు వచ్చి ఏవేవో మందులు ఇచ్చి వెడుతోంది. బిల్లు యాడ్ అవుతూ ఉంది. మందుల ప్రభావమో లేక మరింకేదో కారణమో తెలియదు కాని రంజనకి వాంతులు మొదలయ్యాయి. వాంతులతో కడుపులో మెలిపెడుతున్న కారణంగా బాధ కూడా పెరిగింది. పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే, మంచినీళ్ళు, ఎలక్ట్రాల్ కూడా ఆమెకి సూట్ అవడం లేదు. కడుపులోకి వెడుతూనే వాంతి అవుతోంది. ఏమీ తినని కారణంగా వీక్నెస్ ఎక్కువయింది.
రంజనని హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంచుమించు ఒక నెల అయింది. అప్పటికే ఇన్సూరెన్స్ మొత్తం పాలసీ అంతా డాక్టరు గారికి సమర్పించడం జరిగిపోయింది. మిస్టర్ శర్మ పెట్టుకున్న సెలవుకూడా అయిపోయింది. పిల్లలు ఐ.టి. కంపెనీ ఉద్యోగాల్లో కొత్తగా చేరినవాళ్ళు. సాధారణంగానే ఈ కంపెనీలలో ఎప్పుడూ సెలవులకి సమస్య ఉంటూనే ఉంటుంది. రిక్వస్టు చేసుకుని ఇద్దరు అన్నదమ్ములూ ఒకరితరువాత మరొకరు వంతులుగా ఎనిమదేసి రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వస్తున్నారు. ఫ్లైట్ లో వాళ్ళు రావడానికి, వెళ్ళడానికి అయే ఖర్చు అదనంగా అవుతోంది. జీవితం అనే బండి ఎలాగో కుదుపులని సహించుకుంటూ నడుస్తోంది. ఇల్లు పనివాళ్ళమీద నమ్మకంతో విడిచిపెట్టేశారు.
ఇక్కడ హాస్పిటల్లో రంజన దినచర్య ప్రతి పదిహేను-ఇరవై నిమిషాలకి ఒక లిక్విడ్ మందు, ప్రతి మూడు గంటలకి ఒక డ్రిప్, ప్రతి వారం ఒక రక్తం బాటిలు… ఇవే ఆమె జీవితానికి ఆధారాలు అయ్యాయి. ఇప్పుడు ఆమె తరచు స్పృహలేని స్థితిలో ఉంటోంది. డ్రిప్ లో వేసిన మందుల ప్రభావమో మరింకేదయినానో తెలియదు….
కాని ఒకరోజున రితేష్ కి అతని మిత్రుడు ప్రణయ్ క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు ఫోన్ చేశాడు.
“ఆంటీకి ఏమయింది రితేష్?”
“అదే తెలియడంలేదు ప్రణయ్… ఇంతవరకూ డాక్టర్లు లోకంలో ఉన్న టెస్ట్ లన్నీ చేయించారు. కాని ఏమీ చెప్పడంలేదు. తమ డాక్టరువృత్తిలో ఉన్న ఎక్స్ పెరిమెంటులన్నీ మమ్మీ మీదనే చేస్తున్నారని అనిపిస్తోంది. ఒకసారి ఒక జబ్బు గురించిన అనుమానంతో చెక్ అప్ చేయిస్తున్నారు. మరోసారి మరో అనుమానంతో.”
“నువ్వొక పని చెయ్యి. ఆంటీగారి మొత్తం రిపోర్టులన్నీ నాకు పంపించు. మా కజిన్ ఒక అక్క బొంబాయిలో మంచి డాక్టరు. ఆవిడని అడుగుతాను.”
రితేష్ డాక్టరుని రిపోర్టు చూడటానికి అడిగాడు. డాక్టరుగారికి కోపం వచ్చింది.
“వాట్ డూ యూ మీన్? మామీద నమ్మకం లేకపోతే పేషెంటుని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు… ఇంత అపనమ్మకంగా ఉంటే మీ పేషెంటుని తీసుకెళ్ళిపొండి.” డాక్టరుకి తెలుసు పక్షి తన అధీనంలో ఉందని. రెక్కలు తటతటా కొట్టుకుంటుంది కాని, ఎగిరిపోలేదు… దాని రెక్కలు కత్తిరించిపారేశాడు తను. అయినా కూడా రితేష్ ఏదోవిధంగా ఏం మాట్లాడకుండా వార్డుబాయ్ తో సెట్ చేసుకుని రిపోర్టుల ఫోటోని మొబైల్ లోకి తీసుకుని ప్రణయ్ కి పంపించాడు.
ఇక్కడ స్పెషలిస్టులు వస్తూనే ఉన్నారు. తమ బిల్లులు ఇస్తూనే ఉన్నారు. రంజనకి కొత్తకొత్త జబ్బులు ఉన్నట్లు చెబుతూనే ఉన్నారు. ఈసారి స్పెషలిస్టు చెప్పింది పేషెంటుకి లివర్ అఫెక్టెడ్ అని, అందువల్లనే ఆవిడకి ఏమీ అరగడంలేదని. ఆయన తన ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఒక పాలిథీన్ బ్యాగ్ నిండా మందులు బిల్డింగు కింద ఉన్న కెమిస్టు నుంచి వచ్చాయి. పేషెంటుకి మంచినీళ్ళు, ఎలక్ట్రాల్ పడకుండా ఉన్నప్పుడు ఇన్ని మందులు ఎలా భరిస్తోందన్నది వాళ్ళకి అర్థం కావడంలేదు. లేకపోతే ఈ మందులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎందుకంటే ఈమందులు కుటుంబసభ్యుల ముందు ఎప్పుడూ ఇవ్వడంలేదు.
ఆరోజుకి రంజన హాస్పిటల్ కి వచ్చి 45 రోజులయింది. ప్రతి టెస్టుకి చెందిన బిల్లు, ప్రతి స్పెషలిస్టుకి చెందిన బిల్లు, రూం రెంట్… ఆరోగ్యం విషయానికి వస్తే రోజురోజుకీ డౌన్ అయిపోతోంది. ఏమీ తినకుండా, తాగకుండా ఏ మనిషయినా ఎంతవరకూ ఉండగలడు. నీరసం అయితే పెరుగుతూనే ఉంది. ఆ నీరసాన్ని భరిస్తూ రంజనకి శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలగసాగింది. డాక్టర్ వెంటనే రిపోర్టు చేతిలో పెట్టాడు.
“ఈవిడ హార్టు 20% పని చేస్తోంది. ఈవిడకి పేజ్ మేకర్ తగిలించాలి.” మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటూ తన కాళ్ళతో నడిచివచ్చిన రంజన ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద జీవచ్ఛవంలా పడివుంది. చివరికి తన చేత్తో తను ఒక చిన్న కప్పు కూడా ఎత్తుకుని తాగలేకపోతోంది. అంతా నర్సు మీదనే ఆధారపడివుంది. హాస్పిటల్ పేరుని మళ్ళీ నిర్ణయించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది `ఆరోగ్యకేంద్రం’ కాదు, `అనారోగ్యకేంద్రం’ గా మారిపోయింది. ఇక్కడ చక్కగా ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా వచ్చి రోగిష్టివాడైపోతాడు.
మిస్టర్ శర్మ కూడా కూర్చుని ఉండే ఆలోచిస్తున్నాడు. రంజన శుభ్రంగా ఉన్న స్థితిలో హాస్పిటల్ కి వచ్చింది. సాధారణంగా వచ్చిన బాధతో. డాక్టరు దగ్గరికి వచ్చాక తనలోనుండి ఎన్ని జబ్బులు బయటికి వచ్చాయి… ఇదంతా ఎలా జరిగింది? ఏమీ అర్థం కావడంలేదు. అంతకుముందురోజే కాలనీలో డాక్టర్ కులకర్ణి కనిపించాడు. కాని ఆరోజు ఆయనకి మిస్టర్ శర్మ బెస్ట్ నెయిబర్ కాదు. కేవలం ఒక పేషెంటు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి మాత్రమే. ఆయన ముఖం ముడుచుకొని చిరచిరలాడుతూ మాట్లాడి ముందుకి వెళ్ళిపోయాడు.
మిస్టర్ శర్మ ఈమధ్యనే ఇల్లు కట్టించుకున్నాడు. తరువాత మిగిలిన కొద్ది సొమ్ముకూడా నెమ్మదిగా తీసి డాక్టరుగారి పరం చేశాడు. పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే జాబ్ లో చేరారు. సెలవులు పెట్టుకుంటున్న కారణంగా వాళ్ళ కెరియర్ కూడా ప్రమాదంలో పడుతోంది. రంజన పరిస్థితి కొంచెమైనా మెరుగుపడితే కాస్త తృప్తి ఉండేది… ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో ఏమీ అర్థం కావడంలేదు. వాళ్ళు మానసికం గానూ, శారీరికంగానూ చాలా అలిసిపోయారు.
ఆరోజు ఉదయంనుంచి రంజన చాలా ఏడుస్తోంది. ఒంట్లో బహుశా ఏదో చాలా బాధ కలుగుతున్నట్లుంది. కొడుకు పరుగెత్తుకుని వెళ్ళి డాక్టరుని పిలుచుకుని వచ్చాడు. డాక్టరు ఆ జీవచ్ఛవంలో కూడా ఏదో జబ్బు వెతికి పట్టుకున్నాడు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని సలహా ఇచ్చాడు. దానికి సంబంధించిన పెద్ద ఎస్టిమేట్ కౌంటర్లో డిపాజిట్ చెయ్యమని ఆదేశం కూడా. డాక్టరుకి అర్థమైపోయింది. బాతు ఇంక బలి కాబోతోందని. ఇంక ఆఖరి బంగారు గుడ్డు కూడా తీసేసుకుంటే పోతుంది కదా…
ఈ పరిస్థితిలో డబ్బు ఏర్పాటు చేసుకోవడం ఎలా? మిస్టర్ శర్మ కొడుకులవంక చూశాడు.
“నాన్నా!అమ్మ నగలు అమ్మకన్నా ఎక్కువేం కాదుకదా.” ఇదే ఆలోచించి లాకర్ లో ఉంచిన మొత్తం నగలన్నీ తీసుకువచ్చి వీలుపడినచోటల్లా కొంతడబ్బుకి ఏర్పాటు చేశారు. కొంత దగ్గరిబంధువులదగ్గర అప్పుచేసి ఎలాగో అమౌంట్ కౌంటర్ లో జమ చేశారు. ఎలాగైనా రంజనకి ఆపరేషన్ చేయించాలని.
రంజన ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళింది.
మిస్టర్ శర్మ కాలనీలో ఫ్రీ క్యాంప్ పెట్టిన రోజుని తిట్టుకుంటున్నాడు. అక్కడికి అసలు ఎందుకు వెళ్ళినట్టు? వెళ్ళి చేసిన నిర్వాకం ఏమిటి? చక్కగా సాగుతున్న తమ సంసారాన్ని దోపిడికి గురి చేసుకున్నారు. మరోపక్క కొడుకులు మన కుటుంబం ఎంత సంతోషంగా ఉండేది, మనం నలుగురం ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం, మన అమ్మ ఎప్పుడూ నవ్వుతూ ఎంత అందంగా ఉండేది, తన పిల్లల కెరియర్ గురించి అమ్మ ఎన్ని కలలు కంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల గురించి ఎంత ఊహించుకుని ఆనందపడేది, ఎటువంటి కుటుంబం ఎలా ఏ స్థాయికి వచ్చింది. ఎవరి దిష్టి తగిలిందో తెలియదు… ఆపరేషన్ థియేటర్ బయట మిస్టర్ శర్మ, ఇద్దరు కొడుకులు చాలా ఆదుర్దాగా పచార్లు చేస్తున్నారు. డాక్టరు బయటికి రావడం కోసం ఎదురు చూస్తున్నారు.
కాని డాక్టరుకి బదులుగా నర్స్ వచ్చింది. చేతిలో ఏదో పెద్ద స్లిప్ పట్టుకువచ్చి అంది- “ప్లీజ్…ఇమీడియెట్…”. కొడుకు పరుగెత్తాడు. ఆపరేషన్ టేబిలు మీద అమ్మ మందులు లేని కారణంగా జీవితాన్ని కోల్పోకూడదు…ఆ అమాయకులకి తెలియదు. వాళ్ళ అమ్మ అప్పటికే ఎప్పుడో జీవితం చాలించిందని, ప్రాణాలు కోల్పోయిందని. లోపల ఉన్న యముడి ప్రతిరూపాలు తమ వాటాకి రావలసిన డబ్బుకోసం లాక్కుని వసూలు చేసుకునే ధోరణిలో ఉన్నారు. చివరికి మందులు తెచ్చిన పెద్ద ప్యాకెట్ లోపలికి వెళ్ళింది. బహుశా వాళ్ళకి ఆఖరి వాయిదా సొమ్ముకోసం ఎదురుతెన్నులు చూస్తున్నట్లున్నారు. పదిహేను నిమిషాల తర్వాతనే ఓటీ తలుపు తెరుచుకుంది. ఒక నైపుణ్యం ఉన్న నటుడిలా తల వంచుకుని ఇద్దరు డాక్టర్లు బయటికి వచ్చారు.
“ఆయామ్ సారీ మిస్టర్ శర్మా…. మిసెజ్ శర్మ ఈజ్ నో మోర్…”మిస్టర్ శర్మ సర్వస్వం కోల్పోయినవాడిలా డాక్టర్ని చూస్తూ ఉండిపోయాడు.
“జీవితమంతా కూడబెట్టిన సంపాదన సమర్పించుకున్నాను డాక్టర్… షీ ఈజ్ నో మోర్ అని మీరు అంటున్నారు. నా భార్య తన పిల్లలకోసం ఎన్ని కలలు కందో మీకు తెలుసా…? ఇప్పుడు తన కలలు నెరవేరే సమయం వచ్చింది… మీరేమో షీ ఈజ్ నో మోర్ అంటున్నారు.” కాని అతని కన్నీళ్ళ ప్రభావం ఏమాత్రం డాక్టరు పైన పడలేదు. ఆయన తన లంచ్ బ్రేక్ సమయానికి వెళ్ళిపోయాడు. నాశనమై పోయిన కుటుంబానికి చెందిన ఆ ముగ్గురూ అలా నిలబడి ఉండిపోయారు. రితేష్ కి అనిపించింది అమ్మని ఒక్కసారి చూడగలిగితే… వాళ్ళు ముగ్గురూ లోపలికి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. వార్డ్ బాయ్ వాళ్ళని బయటే ఆపుజేశాడు.
“సార్, మీరు లోపలికి వెళ్ళకూడదు.”
“ఎందుకని? మేము మా అమ్మని చూడాలి.”
“ఆవిడ డెడ్ బాడీ ని మార్చురీకి పంపించేశాం.”
“మార్చురీకా…ఎందుకని? మేము మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ కూర్చుని ఉన్నాం… మార్చురీ ఎక్కడుందో చెప్పండి… మా అమ్మని మేము ఒక్కసారి చూడాలనుకుంటున్నాం. మేము అక్కడికే వెళ్ళి ఆవిడని చూసుకుంటాం.” అంటూ రితేష్ ముందుకి అడుగువేశాడు. ఇంతలోనే ఇద్దరు లావుగా, ఒడ్డూ-పొడుగుగా ఉన్న ఇద్దరు బౌన్సర్లు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డారు.
“చెప్పాం కదా. మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.”
“ఎందుకని?”
“ఎందుకంటే, మీ బిల్లు మీరు పూర్తిగా కట్టలేదు.”
“అరే, బిల్లు తీసుకుని మేము ఎక్కడికీ పారిపోము.”
“అలా కాదు… ముందు మీరు కౌంటరు దగ్గరికి వెళ్ళి మీ బిల్లు పేమెంటు చేసెయ్యండి. ఆ తర్వాత మీ డెడ్ బాడీని ఇంటికి తీసుకెళ్లండి.” దురదృష్టం వెన్నంటిన ఆ ముగ్గురూ కౌంటరు దగ్గరికి వెళ్ళారు. పాలసీకి చెందిన ఐదు లక్షలు కాకుండా, మొత్తం మందులకి, ఆపరేషన్ చార్జిలకి, డాక్టర్లు రౌండులు వేసిన చార్జిలకి, ఇవన్నీ ఇచ్చిన తరువాత కూడా లక్షన్నరకి బిల్లు వాళ్ళకోసం ఎదురుచూస్తోంది. ఎలా ఏర్పాటు చేసుకోవాలి…? వాళ్ళింకా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంతలోనే ప్రణయ్ దగ్గరినుంచి ఫోన్ వచ్చింది.
“హలో రితేష్! సారీ యార్. అక్క తన సెమినార్ గురించిన పనిలో అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళింది. ఇప్పుడు తిరిగి వచ్చేసింది. అక్క మొత్తం రిపోర్టులన్నీ చూసింది. తను చెప్పిందేమిటంటే, ముందు రిపోర్టు అల్ట్రాసౌండ్ ది, అందులో ఎక్కడా పేషెంటుకి గాల్ బ్లేడర్ లో స్టోన్స్ ఉన్నట్టుగా లేనేలేదు. పొట్ట కిందభాగంలో వస్తున్న నొప్పి మంత్లీ పీరియడ్ సమయంలో సాధారణంగా 50 కన్నా ఎక్కువ వయస్సున్న మహిళలకి అలా వస్తుందని, ఇది చాలా సాధారణమైన విషయమని చెప్పింది. కాని, అర్థంపర్థం లేకుండా ఇలా హైపవర్ మెడిసిన్స్ ఎందుకు ఇచ్చారన్నది తెలియడంలేదు. ట్రీట్ మెంట్ ఎవరు ప్రిస్క్రైబ్ చేశారని అక్క అడుగుతోంది. నీకు తెలుసా, ఇంత హైపవర్ డోస్ ఇచ్చినప్పుడు ఆవిడ లివర్ ఎఫెక్ట్ అవుతుందని. అలాంటప్పుడు ఆవిడ అసలేమీ తినలేదు, తాగలేదు. ఆ డోస్ వెంటనే ఆపుజెయ్యి. మిగిలిన ఇబ్బంది అంతా ఆవిడ వీక్నెస్ వల్ల ఉన్నది. ఆవిడకి ఏమీ జబ్బు లేదు. ఆవిడ హార్ట్, కిడ్నీలు, మొత్తం బ్లడ్ రిపోర్టు. అన్నీ నార్మల్ గా ఉన్నాయి. రోహన్, ఈరోజుల్లో దొంగ డాక్టర్లుగా చెలామణి అవుతున్న గ్రూపులు ఇటువంటి స్కామ్ లో పని చేస్తున్నాయి. వీళ్ళు పేషెంటుని తమ కట్టడిలోకి తీసుకుని, వాళ్ళకి అబద్ధపు రిపోర్టులు చూపించి, కొత్త-కొత్త జబ్బులు ఉన్నాయని చెప్పి, డబ్బులు దోచుకుంటున్నారు. మీరుకూడా ఇటువంటి ఏదో మెడికల్ స్కాంలో ఇరుక్కున్నారని నాకనిపిస్తోంది. నా మాట విని తొందరగా ఆంటీని అక్కడనుంచి బయటికి తీసుకువచ్చేయండి. ఇంతకీ, ఇప్పుడు ఆంటీకి ఎలా వుంది?”
“ప్రణయ్! అమ్మ ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వీళ్ళంతా మా అమ్మని చంపేశారు ప్రణయ్, డాక్టర్లు ఈ భూమిమీద భగవంతుని స్వరూపులని అని జనం అంటూవుంటారు. అదంతా శుద్ధ అబద్ధం… వీళ్ళు దేవుళ్ళు కారు. వీళ్ళు యమదూతలు.”
***
డా. లతా అగ్రవాల్ – పరిచయం
26 నవంబరు 1966 న షోలాపూర్, మహారాష్ట్రలో జన్మించిన డా. లతా అగ్రవాల్ `తులజ’ ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, విద్యావేత్త. ఎన్సిఇఆర్టీ, భోపాల్ లో లెక్చరర్ గా, వైష్ణవ యూనివర్సిటీ, ఇండోర్ లో బోర్డు మెంబరుగా, భోపాల్ యూనివర్సిటీకి అనుబంధసంస్థ అయిన మిత్తల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, భోపాల్ కి ప్రిన్సిపాల్ గా, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో కౌన్సెలర్ గా సేవలందించారు. వీరి రచనలు ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారితమయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వీరి పుస్తకాలు 16 విద్యకి సంబంధించినవి, 7 కవితాసంకలనాలు, 12 బాలసాహిత్యం, 5 కథాసంకలనాలు, 7 మినీకథాసంకలనాలు, 3 నవలలు, 4 సమీక్షాగ్రంథాలు, 20 నాటికలు, 1 ఇంటర్ వ్యూల సంకలనం ప్రచురితమయ్యాయి. హిందీ కల్చరల్ ఆర్గనైజేషన్, టోక్యో, జపాన్ నుంచి `కళాశ్రీ’ సన్మానం, మారిషస్ హిందీ సాహిత్య అకాడమీ నుంచి `హిందీ సాహిత్యరత్న’ సన్మానం తో సహా అంతర్జాతీయ స్థాయిలో 4 సన్మానాలు పొందారు. 2 సార్లు కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు జాతీయస్థాయిలో ఇంచుమించు 60 కన్నా ఎక్కువగా పురస్కారాలతో సన్మానింపబడ్డారు. ఉత్తమసాహిత్యసృజనకు 14 రాష్ట్రాలనుంచి సత్కారం పొందారు. డా. లతా అగ్రవాల్ భోపాల్ వాస్తవ్యులు.
*****

బహుభాషావిదులైన డా. రావు (1948) గారి చాలా స్వీయ, అనువాదిత కథలు, వ్యాసాలు, కవితలు తెలుగు, హిందీలలో ప్రచురితమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల మధ్య అనువాదంలో సుదీర్ఘ అనుభవంతో ఒక నవల, 200కి పైగా కథలు, కవితలు అనువదించారు. త్రిభాషా నిఘంటువులో సహసంపాదకత్వం చేశారు. వేరువేరు సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ కి చెందిన కొన్ని పత్రికలకు సంపాదకునిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ద్వారా పండిత్ శివసేవక్ తివారీ స్మృతి పతకంతోనూ, అరసం గుంటూరు జిల్లా యూనిట్ ద్వారా శారదాంకిత స్వర్ణపతకంతోనూ సన్మానితులు. రష్యన్ కవితల అనువాదానికి ముంబయిలోని రష్యన్ ఎంబసీ ద్వారా ప్రశంసించ బడ్డారు. తెలుగు కవితలకు వేరువేరు సంస్థల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో జనరల్ మేనేజరు స్థాయిలో రిటైర్ అయ్యాక ముంబయిలో ఉంటున్నారు.
