
అనుబంధాలు-ఆవేశాలు – 13
– ప్రమీల సూర్యదేవర
మా గూడెంలో ఆచారాలు శాన కట్టుదిట్టంగ ఉంటయ్. తరువాత వారం గదిలోకి వస్తూనే అన్నది. కాని తన ధోరణి మాత్రం క్రిందటి వారంలాగానే ఉన్నది. నా వైపు చూడలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పుకు పోయింది. ఎవురు తప్పు సేసినా పల్లెదొర ఏసిన సిచ్చ అనుభగించాల. కాని ఆ రోజు ఓబులు పల్లెదొరకు అవకాశం ఇయ్యల. షెరా కళేబరాన్ని బుజాన ఏసుకుని చరచర నడుస్త గూడెం దేవత కాడికి పోయిండు. పల్లె అంతా కదిలి ఓబులు ఎంట పోయింది. ఓబులు ఏటిసేయాలనుకుంటున్నడొ నేను పసిగట్టిన. నా గుండెలు అదిరి పోయినయ్. ఓబులు తాతను, తాత తండ్రి అట్టనె ఇచ్చేసిండు. ఆ రోజుల్లో ఓబులు ముత్తాత, ఆయనె పల్లెదొర. పాము కాటేసిన కుంకకి పొరపాటున ఏరేమందిచ్చిన కారణంగ అ కుంక సనిపోయిండు. బిడ్డను పోగొట్టుకుని గుండెలు పగిలేలా ఏడుస్తన్న అమ్మి, అయ్యలకు తన బిడ్డను అప్పసెప్పి పల్లెదొరపదవి నుండి తప్పుకున్నడు. ఆ రోజుల్లొ అట్టాగె జరిగేది. ఓబులు తొందరపడెలోగా అతన్ని ఆపాలని వాళ్ళ ఎనకె లగెత్తిన.
నేనాడకి ఎల్లేలకె ఓబులు బిడ్డని అమ్మోరి ముందర పండ బెట్టి అమ్మోరి కుంకుమ షెరా శరీరానికి పూత్తన్నడు.
ఓబులు సెయ్యట్టుకుని, “ఏంసేత్తన్నవయ్య నువ్వు? నాకన్నేయంసేయక” అని కాళ్ళ మీదపడిన.
నాఏపు జాలిగ సూసి, నన్ను లేవనెత్తి, , నా కన్నీరు తుడిసి, “ఆల్లబిడ్డను నా బాణానికి బలిసేసిన. నా తప్పుకి సిచ్చ నేనే ఏసుకుంటన్న, తప్పుకో” అని నా సేయి పట్టుకుని ఈవలకి తీసుకొచ్చిండు.
“ఇదెన్నడో మీ ముత్తాతలనాటి మాట. మీ తాత హయాంలో కాని, మీ అయ్య హయాంలో కాని ఇట్టా ఓరేన సేసిండ్రా? రొండొందల సంవత్సరాలనాడు జరిగిందని ఈనాడు కూడ అదె సెల్లుద్దా? అని ఓబులుతొ అని, పల్లెదొరేపు తిరిగి, మాట్టాడవేందొర? కావాలని సేసింది కాదు గదయ్య. నీకెరకేగ. నీ తీర్పు నువ్వు సెప్పు. ఈడు తనని సిచ్చుంచుకోటమే కాకుండా మా అందర్ని సిచ్చిస్తుండు. అమ్మోరి మీద ఆన. ఓబులు సేసిన నేరం తెలియక సేసిన నేరం. ఆల్లబిడ్డల్ని కూడ సొంత బిడ్డల్లా సాకిండు. పల్లె పెద్దవు, నీ తీర్పుసెప్ప”మని ఆయన్ని బతిమాలుకున్న.
పల్లెదొర తల దించుకుని గమ్మున కూకున్నడు. అంతా సోద్యం చూస్తున్నరు. ఓరూ నోరిప్పల. కాని కొందరు జాలిగ, మరి కొందరు ఇది సాధ్యమా? అన్నట్టు సూసిండ్రు.
“నువ్వేం దొరవయ్య నీకీ పెద్దరికం ఓరిచ్చారు ఇదేమైన సిన్న ఇసయమా? రెండు కుటుంబాల్తో శలగాటం ఆడతన్నవు” అని, పల్లెదొర మీద ఇరుసుకు పడిన.
నేను సేసే గోలతో తనకేం సమ్మందంలేనట్టు, , ఓబులు పిల్లోడి తల మీద సేయెట్టి, తన కొడుకు, సత్తేలుని, నూకాలు, దానేలులకు అప్పసెబుతనని పెమాణం సేసి, రానని ఏడత్తన్న నాలుగేళ్ళ నా కొడుకుని బలవంతంగ నూకాలు సేతిలొ ఎట్టిండు. ఆడు రెండు సేతులు సాపి అమ్మి, అమ్మి అని గింజుకుంటుంటే నా పాలుకారి కోక తడిసి పోనాది. నూకాలు వాడిని ఎత్తుకుని, గుండెలకు హత్తుకుని వోదారుత్తుంటె, ఆ పసివాడి ఏడుపు ఇనలేక రెండు చెవులు మూసుకుని, వాడు పాలుతాగే పసికందు. వాడి ఉసురు దానికి తగిలిద్దని పెద్దగ అరిసిన.
నేనన్న మాటలకు ఓబులు ఉలిక్కి పడి, ఇది నూకాలు నేరం కాదని సెప్పటానికి నోరు తెరిసి, భగభగ మండుతున్న నాకళ్ళల్లో నిప్పులు సూసి ఆగి పోయిండు. నేనాడ నిలవ లేక పారిపోయిన.
అలనాడు శ్రవణ కుమారున్ని సాటుగ సెట్టుసాటు నుండి బాణమేసి సంపిన దశరద మారాజుకి సంతానం కలిగుంటే తనకొడుకుల్లొ వొకడిని ఆ ముసలి దంపతులకిచ్చేవోడా? దేశాన్ని పాలించే రాజు సేయలేని పని నా మగడు సేసిండు.
అంజమ్మ కళ్ళల్లో కోపం, బాధ, ఆవేదన కలిసి అశ్రువుల రూపంలొ చెంపల మీద కారసాగాయి.
వావ్!! ఇంత త్యాగమా? తన నేరానికి తనే శిక్ష విధించుకున్నాడు, కాని కన్నతల్లి మాటేమిటి? ఆమె కడుపు కోత ఎవరు తీర్చగలరు? నా మనసంతా అంజమ్మపై జాలితొ నిండి పోయింది.
అమ్మి అమ్మి అని సేతులు సాపుతున్న బిడ్డను తలుత్త ఏ అడవి జంతువైనా నన్ను మింగేయ కూడదా? ఏ ఇషప్పురుగైన నన్ను కరవ కూడదా? అనుకుంటూ అడవిలొ మూడు రోజులు తిరిగిన.
నూకాలు బిడ్డ సచ్చిపోనాడు. ఆడిని తిరిగి తీసుకు రాలేం. పానం ఉన్న నాబిడ్డ నాకు కాకుండ నా ఎదురుగనె మరొక తల్లి సాకటమా? నా పాలుతాగి, నేనెట్టిన గోరుముద్దలు తిని, అమ్మి అని నా కొంగట్టుకుని తిరిగినోడు ఏరే ఆడదాని కొంగట్టుకుని తిరుగుతాడా? అదీ నాకన్నులముందే!
ఆరోజుల్లో ఓబులు ముత్తవ్వ ఎట్టా తట్టుకున్నదో! మగడు బిడ్డనిచ్చేయగానే ఒప్పేసుకున్నదా? బాధ గట్ర ఎయ్యలేదా? ఆమే కనక బతికుంటె నేనడగాలనుకున్న ఎన్నో పశ్నలు నా తల్లో సుళ్ళు తిరుగుతుండగ మూడోరోజు రాత్రి సీకటి పడినంక ఇంటికొచ్చిన.
ఇంటెడు శాకిరీ సేసే నా పెద్దబిడ్డ, సీతాలు, నీరసంగ గుడిసెలో తొంగున్నది. లేడిపిల్లలా గెంతుతూ శలాకీగ తిరిగి, నలుగుర్నీ సంతోషంగ నవ్వించే నా సిన్నబడ్డ, మంగ, ఆరుబయట దడి పట్టుకుని అడవి కేసి సూత్తా నుంచుంది. మీదపడి కుస్తీలు పట్టే తమ్ముడు లేక ఏం సేయాలొ తోచక నా బిడ్డడు, సీనయ్య సిన్నబోయి దిగాలుగ నూకాలు ఇంటికేసి సూత్త కూకున్నడు. ఓబులు జాడలేదు. ఆల్లందర్నీ అట్టాసూసి నాకడుపు తరుక్కు పోనాది తల్లి. బిడ్డల ముగ్గుర్ని అక్కున సేర్చుకుని నలుగురం బోరుమంట ఏడ్సినం.
“అయ్య నిన్నెతుకుత అడవిలోకి పోయిండు.” ఎక్కిల్ల మధ్య మంగ అన్నది.
సత్తేలుని ఆల్లకి అప్పచెప్పి, ఓబులు ఇంటికొచ్చి, తన విల్లు, బాణాలు తీసుకుని, షెరా కిందకు దుమికిన సెట్టుకిందకెల్లి, ఆ సెట్టు కింద మన్ను ఒంటి నిండ పులుముకున్నడు. షెర ఆత్మ తన సేష్టలకు నవ్వుతుందేమోనని, దులిపేసుకున్నంక ఆడనె సితి పేర్చి తను ఎంతో మక్కవగ సూసుకునె విల్లు ,బాణాలు తగల పెట్టిండు. సత్తేలుని తలుసుకుని తల బాదుకుంట ఏడ్సిండంట.
సత్తేలు నా ముగం సూత్తడా? ఆడికి అన్నేయం సేసిన అని కన్నీరు కారత్త , బిడ్డలు ముగ్గుర్ని దరికి తీసుకుని, నూకాలు, దానేలుల బిడ్డని సంపి పాపం మూటగట్టుకున్న. పాయచ్చిత్తం సేసుకోవాలనుకున్న. నన్ను చమించండని వలవల ఏడ్సిండని సీతాలు సెప్తుంటె నాకు ఓబులు మీద మమకారం ఉబికి పోనాది కాని, ఆడిని చమించ లేక పోయిన.
మూడు రోజులు అడవిలో తిరుగుత ఓబులు సేసిన అన్నేయం గురించి ఆలోసించిన. ఓబులు ధర్మానికి పానం పెడతడు. ఓర్నీ ఒక్క మాటనడు. మా ఊర్ల పల్లెదొర పేరుకె ఉంటడు. యవ్వారాలన్ని ఓబులు సూసుకుంటడు. ఓబులు మాటకి తిరుగు లేదు. అందర్ని ఆదరంగ సూసుకుంటడు. మా జాలిగుండె. నూకాలు దుఃఖం సూడలేక ఏరే ఆలోచన లేకుండ సేసేసిండు. ఆడికి సత్తేలు అంటె పానం, గారాలబిడ్డ. బిడ్డలందర్నిఅట్టగె సేరదీత్తడుగాని ఈడు అందర్లోకి సిన్నోడుగంద. సత్తేలుని ఇచ్చేయటానికి ఎంత గుండెనిబ్బరం వుండాల!
ఒక్క ఊర్ల ఉంటం అందరం. పొద్దున్న లెగిసి ఆల్ల ముగం సూడాలంటె మొగం సెల్లక బిడ్డనిచ్చేసిండు. ఓబులు మనస్సు అర్దమయ్యింది కాని నా గురించి ఆలోచించ కుండ స్వార్దంతో తనకు తోచిన ఇదంగ సేసేసిండన్న ఆలోచన తట్టుకోలేక పోయిన.
మూడు దినాలుగా బిడ్డలు ఏమీ తినలేదని విని గుడిసెలోకెల్లి మొక్కజొన్నపిండి కలుపుతున్న. బయట ఓబులు గొంతు ఇనిపించి, నాగుండె దబదబ కొట్టుకున్నది.
“అమ్మి ఘుస్సా తగ్గిపోయిందా? ఎదురెల్లిన సీనయ్య బుజం మీద సెయ్యేసి లోనకొత్త అడుగుతున్నడు.
ఓబులుకి ఉన్న శకితి ఎసమంటిదో మరి తనక్కడ లేక పోయినా జరిగిన ఇషయాలన్ని కల్లతో సూసినట్టె పొల్లు పోకుండ సెబుతడు. అమ్మోరె ఆడికాశకితినిచ్చిందని పల్లెదొర అంటడు. నేనొచ్చిన సంగతి ఎరుకయ్యె నాఎనకె వొచ్చిండు.
మూకుడుకేసి రొట్టెలు నొక్కుత ఓబులు ఏపు తలెత్తి కూడ సూడల. పల్లెదొర కుందేలిచ్చిండని నాకెదురుగ ఎట్టి, నా పక్కనె కూకుని మోకాల్లమీద తలానించుకుని ఎక్కెక్కి ఏడ్సిండు.
ఆ పసివాడి మాటలు, సేష్టలు తలుచుకుని కుమిలి పోయిండు. ఓబులు అమ్మి, అయ్య సనిపోయినప్పుడు ఆడికళ్ళు ఎఱ్ఱగ నిప్పు కణికల్లా కమిలి పోయినై కాని ఆ కళ్ళల్లోనీళ్ళు సూడల.
ఎంత కట్ట మొచ్చిన గంబీరంగ ఎదుర్కొనెవోడే కాని కన్నీరు కార్చల. అలాంటిదీనాడు పసోడి మల్లె ఏడుత్తంటె నా గుండె కరిగి పోయింది. దగ్గరకెల్లి , ఓబులు తల నాగుండెల కానించుకుని ఇద్దరం ఏడుత్త కూకున్నం. ఓబులు ముందుగ తేరుకుని, మనబిడ్డ యాడికిపోల. మన కళ్ళెదురుగనె ఉన్నడు. మనం సూడాలనుకుంటె ఎల్లి సూడొచ్చు, అని నాకళ్ళు తుడిచాడు.
కుందేలు మాంసం సత్తేలు ఇట్టంగ తినేవోడని, మాంసం వొండుకుని, మూకుళ్ళో పెట్టి, గుడ్డకప్పి నూకాలు ఇంటికి, తుప్పలు దాటి, జొన్నసేను దాటి దాని ఇంటి ముందుకొచ్చి, తలుపు తీద్దామనె ఆలోచన (మాగుడిసెల తలుపులకెవరకి తాళాలుండవు) ఇరమించుకుని తలుపు కాడ మూకుడెట్టి పెద్ద సప్పుడు సేసి గబగబ నడుత్త ఇంటి కొచ్చేసిన.
సత్తేలు బువ్వ తిన్నడో లేదో! కుందేలు మాంసం నేనిచ్చిన్నని వాడికి తెలుసుద్దా ? వాడు తింటంటె సూడాలని ఉన్నదని ఆలోచించుకుంట ఆ రేత్తిరి కన్నుమూయల. సీకట్నె లెగిసి తలుపు తీద్దును కదా! నేనిచ్చిన మూకుడు గుమ్మంలో ఉన్నది. నేను కప్పిన గుడ్డ కప్పినట్టె ఉన్నది.
నూకాలు ఎంత పొగరుబోతో నాకు ఎరుకె. మేమిద్దరం కలిసి పెరిగినం. ముద్దులు మూటకడ్తుండె నూకాలును గూడెంలో అంతా ఎత్తుకుని దించేవారు కాదు. నూకాలు పెరిగే కొద్దీ దాని అందం కూడ పెరుగుత పదింతలయ్యింది. గూడెంలొ కుఱ్ఱకారులందరు దాని కంటికొన సూపుకోసం తహతహలాడేవారు. ఆళ్ళని ఎనకే తిప్పుకుని ఆడించేది కాని నూకాలు పెట్టే తీపి అందుకునేవాడు దానేలు అని దాని మనస్సు ఆడిమీదె ఉందని నా కెరుకె. మా ఇద్దరి మద్దెన రగస్యాలు లేవు. ఒకరికొకరం కలుసుకున్నప్పుడు మా మనసుల్లో దాగున్న యువకుల గురించి సెప్పుకుని కలలు కనేటోల్లం.
మాగూడెం ఆచారాల పెకారం ఈడొచ్చిన మగపిల్లలందరు పల్లెపెద్ద ముందర వరస కట్టి నిలబడ్తరు. ఆడపిల్ల ఎల్లి, నచ్చినోడికి తీపి తినిపించి తన మగనిగ ఎన్నుకుంటది. ఇదొక వేడుక. పల్లెదొర ముగూర్తం సూసి సెప్పిన రోజు అబ్బో ఆ కుర్రకార్ల అడావుడి సూడాల! జుట్టు నున్నగ దుంకొని, నూనూగు మీసాలకు నూనె రాసి మెలిపెట్టుకుని, జింకశర్మాలు సుట్టుకుని, తలపాగల్లో, మొలల్లో పక్షి ఈకలు దోపుకుని మా ఉషారుగ తిరిగిండ్రు.
అంజమ్మ గతంలోకి వెళ్ళిపోయి పెదవులపై చిరునవ్వు చిందులాడుతుండగ చెప్పుకు పోతుంది.
నూకాలు, ఎన్నడు లేంది, ఆయేల సిగ్గులొలకబోత్త వయ్యారాలు బోత దానేలు నోటికి తీపి అందించగానె దానేలు పట్టలేని ఆనందంతొ దాన్ని రెండుసేతుల్తొ ఎత్తి నాట్యం సేసిండు. మేమందరం వాళ్ళిద్దరిసుట్టూసేరి దడికట్టి , డప్పులు వాయిస్త ఒకరి చేతులొకరం పట్టుకుని నాట్యం సేసినం. పిల్లలందరు మొండి మొలల్తో కేరింతలు కొడ్త మా పక్కన జేరి గంతు లేసిండ్రు.
మా గూడెంవాసుల నాట్యం సూసి తీరవల్సిందె! ఆడోల్లం రంగు రంగుల కోకలు గోచీపోసికట్టి , రకరకాల అడవి పూలు కొప్పుల్లో తురుముకుని, కాలిగజ్జెలు ఘల్లు ఘల్లున మోగుతుండగ, ఒకరి సేతులొకరం పట్టుకుని మెడలొ పూసల గొలుసులు మాతొపాటె ఎగుర్త వయ్యారాలు పోతుండగ, వలయాకారంగ తిరుగుత–మగవాళ్ళు మోకాలి పైకి దోతీలు కట్టుకుని, రంగు రంగుల పక్షిఈకలు తలపాగాల్లో గుచ్చుకుని, మెడల్లో అనేక రకాల పూసల గొలుసులు, పూలదండలు ఏసుకుని, ముంజేతులకి కాలిమడాలకు పూలు సుట్టుకుని, వారు మోగించే డప్పులకు లయబద్దంగ అడుగులేస్త నాట్యంసేత్తంటె సూసేవాళ్ళు కళ్ళు తిప్పుకోలేరు.
దానేలు మేకపోతుని అమ్మోరికి బలిచ్చిండు. మాంసంతింటా, కల్లు తాగుత ఆరేత్తిరంత నాట్యం సేసినం. సూర్యభగవానుడు ఉదయించక ముందె దానేలు, నూకాలును తనింటికి తోలుకు పోయిండు. అంజమ్మ కళ్ళల్లొ ఆనందం క్షణమాత్రం తొంగిచూసింది.
కొద్దిరోజులకె నేను ఓబులుకి తీపి తినిపించిన. ఓబులుని పిన్నా పెద్దా అందరు గారవిత్తరు. నాకెరుక తెలిసిన కాడ్నుండి, ఆడే నా మగడు కావాలని కోరుకునేదాన్ని. ఆడిని కట్టుకున్నంక జీవితంలొ ఎన్నో ఇలువలు నేర్పిండు. ధర్మం బోదించిండు. తోటి మనిషిని గారవించి సాయంసేత్తే ఎంత తుప్తి కలుగుద్దో సూపిండు. ఆడు దేవుడె. ఓబులు అడుగు జాడల్ల నడస్త అందరికి చేదోడు వాదోడుగ వుండటం నేర్సుకున్న. పల్లెలోఅందరు నన్ను గారవిత్తంటె నూకాలుకు ఈసు కలిగేదికాని బయట పడేది కాదు. తన పరపతి తగ్గిపోయిందని గిలగిల్లాడి పోయేది. అయిందానికి కానిదానికి నాతొ పోటీపడేది. కల్మసం లేకుండ నేను నూకాలుని ఎప్పట్లా అభిమానంతొ సూడ్డం దానేలు గమనించి కొన్నిమాట్లు నాకు వత్తాసు పలికేవాడు. అది అగ్గి మీద ఆజ్జం పోసినట్టయి బుసబుస లాడేది. ఒక్క పానంలా కలిసి పెరిగిన మా ఇద్దరిమయ్యాన ఎడం ఎక్కువై పోనాది. ఇద్దర్లొ ఓరం నోరిప్పల కాని అప్పాయత తగ్గింది. దానేలు, ఓబులు ఇద్దరుఎప్పట్లా అన్నదమ్ములమల్లె మసల్తరు.
ఏనాటికైన నాబిడ్డ నాకాడి కొత్తడా? అమ్మి ,అని నా కొంగట్టుకుని తిరుగుతడా? సచ్చి పోయిన షెర తిరిగిరాడు. సత్తేలు, షెర ఎట్టాఔతడు? నూకాలు నామీద పగతీర్చుకుంటంది. రేయింబవళ్ళు నాకిదే ఆలోచన.
నూకాలు, సత్తేలుని, ఈపు మీద కట్టుకుని కట్టెలకు రావటం సూసి, నేనగపడ్తె వాడేడుత్తడేమోనన్న భయంతో వాడిని సేతుల్లోకి తీసుకుని, లాలించి పాలివ్వాలనె కోరిక సంపుకుని, గుండె సిక్కబట్టుకుని, వాళ్ళ కంట బడకుండ సెట్టుసాటున దాగుని వాడిఏపేసూత్త వాళ్ళు ఎల్లిపోయేదంక కూకునేదాన్ని. ఆడిపాలకోసమైన నూకాలు నాకాడికి తీసుకొత్తదేమోనని ఎదురు సూసేదాన్ని. అదీ ఒకతల్లేగ బిడ్డబాద ఎరగద? కటినంగ మారిపోయిందది. ఓబులు కావాలని సేసిన నేరం కాదు గాని కుటుంబంలో అందరం బాధ పడ్తన్నం.
అంజమ్మ వెళ్ళే సమయం ఆసన్నమైనదని రక్షకభటులు రావటంతొ గ్రుక్క త్రిప్పుకోకుండ చెప్పుకు పోతున్న ఆమె వాక్పృవాహానికి అడ్డు పడింది. కాళ్ళకు, చేతులకు బేడీలు వేసుకుని వారివెంట వెళ్ళటం ఇష్టంలేని దానిలా వెనక్కెనక్కు చూస్తూ వెళ్ళి పోయింది.
అరమరికలు, దాపరికం లేకుండా చెప్పుకు పోతున్న అంజమ్మకి నా కౌన్సిలింగ్ అంత అవసరం వుండక పోవచ్చు, కాని ఆమె తనబాధ ఎవర్తోనైన పంచుకోగలిగితె కొంత మనఃశ్శాంతి ఉండవచ్చునని అనిపించింది.
అంజమ్మ చెప్పేది వింటున్నంత సేపు నాకు వేరే ప్రపంచంలో ఉన్నట్లున్నది. ఇది సినిమా కాదు. నవల అంతకన్నా కాదు. నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఈ రోజుల్లో కూడ కన్నబిడ్డను త్యాగం చేయగలిగిన మానవులుంటారా? ఓబులు ఆ క్షణంలొ తన నేరానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకున్నాడే కాని వేరే ఆలోచనేదీ ఉండి ఉండదు. ఒక్కక్షణం–తల్లి, అంజమ్మ గురించి ఆలోచించి నట్లయితె అలా చేయగలిగేవాడు కాదేమో! అంజమ్మ కారాగార పాలయ్యేది కాదు. అడవుల్లో జీవిస్తున్న తెగల గురించి, వారి జీవనవిధానం గురించి పత్రికల్లో చదివే వారం. నా జీవితంలొ వారిలొ ఒకర్తో పరస్పర సంభాషణ జరుపుతానని కలలో కూడ ఊహించలేదు.
* * * * *
(మళ్ళీ కలుద్దాం )

1974, సెప్టంబర్ నుండి ఒహాయో రాష్ట్రంలో సిన్సనాటిలో నివసించి, 2004, జనవరి నెలలో టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియోకి చేరుకున్నాము. నా మొట్ట మొదటి కథ ‘భయం’ 2007 డిసెంబర్ మరియు 2008 జనవరి ‘తెలుగునాడి’ మాసపత్రికలో ప్రచురించబడింది. రెండవ కథ ‘కదిలే బొమ్మలు’ 2010 ఏప్రియల్ నెలలో ‘విపుల’ మాసపత్రికలో ప్రచురించబడింది. 2003 ఫిబ్రవరిలో ప్రచురింపబడిన మొదటి నవల ‘అనుబంధాలు-ఆవేశాలు’ చదివిన పాఠకులు ఇచ్చిన స్పందనతో రెండవ నవల ‘ అనురాగ సంగమం ‘ 2024 ఫిబ్రవరిలో ప్రచురించటం జరిగింది. హస్తినాపురం (ఆస్టిన్) సాహిత్య సభలో పాల్గొని నా స్వీయ రచనలు కొన్ని చదువుతుంటాను.
