
ప్రమద
స్వీపర్నుంచి సుపీరియర్ వరకు!
ప్రతిభ, పట్టుదలతో ఎదిగిన ప్రతీక్షా టోండ్వాల్కర్
-నీరజ వింజామరం
కొన్ని విజయగాథలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మరికొన్ని మన ఆలోచనలను మార్చేస్తాయి. ప్రతీక్ష టోండ్వాల్కర్ జీవితం రెండో కోవకు చెందుతుంది. ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌గా పనిచేసిన ఆమె, అదే బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) స్థాయికి ఎదిగారు. చదువు మధ్యలో ఆగిపోయినా, చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా, చేతిలో చిన్న బిడ్డ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు వెంటాడినా ఆమె తన జీవితానికి ఒకే ఒక దిశను ఎంచుకున్నారు – చదువు ద్వారా స్వయం సమృద్ధిని సాధించడం.
ఇది కేవలం ఒక ఉద్యోగంలో సాధించిన ప్రమోషన్ల కథ కాదు. పరిస్థితులు మనల్ని ఎక్కడ నిలబెట్టినా, మనం ఎక్కడికి చేరాలనుకుంటున్నామో నిర్ణయించుకునే హక్కు మనకుందని నిరూపించిన మహిళ కథ.
ప్రతీక్ష 1964లో మహారాష్ట్రలోని పుణెలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో ఆమె చదువు ఏడో తరగతి దగ్గరే ఆగిపోయింది. పదహారేళ్ల వయసులోనే సదాశివ్ కడూ అనే వ్యక్తితో ఆమెకు వివాహమైంది. ఆయన ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో పుస్తకాలు బైండింగ్ చేసే ఉద్యోగిగా పనిచేసేవారు.
వివాహమైన కొంతకాలానికే వారికి వినాయక్ అనే కుమారుడు జన్మించాడు. అయితే కుటుంబ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో అనుకోని విషాదం ఎదురైంది. ఒక ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త మరణించారు. అప్పటికి ప్రతీక్ష వయసు కేవలం ఇరవై సంవత్సరాలు. ఒడిలో చిన్నబిడ్డ, చేతిలో సరైన విద్యార్హతలు లేవు, ఆదాయానికి మార్గం లేదు. ఒక యువతి జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసే పరిస్థితి అది.
భర్త మరణానంతరం తనకు రావాల్సిన బకాయిలను తీసుకోవడానికి ప్రతీక్ష ఆమె భర్త పని చేసిన SBI బ్యాంకు శాఖకు వెళ్లారు. తనకు, తన బిడ్డకు జీవనాధారం అవసరమని, ఏదైనా చిన్న ఉద్యోగం కల్పించాలని బ్యాంకు అధికారులను అభ్యర్థించారు.
ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న బ్యాంకు అధికారులు కొంతకాలం తర్వాత అదే శాఖలో స్వీపర్‌గా పనిచేసే అవకాశం కల్పించారు.
నెలకు కేవలం రూ.60–65 మాత్రమే జీతం. ఉదయం రెండు గంటలపాటు బ్యాంకు ప్రాంగణాన్ని ఊడ్వడం, మరుగుదొడ్లను శుభ్రం చేయడం, ఫర్నిచర్‌ను తుడవడం ఆమె విధులు. ఆ కొద్దిపాటి ఆదాయంతో బిడ్డను పెంచడం సాధ్యం కాకపోవడంతో మిగిలిన సమయంలో ఇతర చిన్నచిన్న పనులు కూడా చేసేవారు. చెప్పుల తయారీ యూనిట్లో పనిచేసిన సందర్భాలూ ఉన్నాయి. తన కుమారుడికి బిస్కెట్ల ప్యాకెట్ కొనివ్వడానికి కూడా డబ్బులు సరిపోని రోజులు ఉండేవి. బస్సు ప్రయాణంలో ఒక స్టాప్ ముందే దిగి నడుచుకుంటూ వెళ్లి మిగిలిన డబ్బును ఆదా చేసేవారని ఆమె ఒక
ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ చిన్న సంఘటన ఆమె కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల తీవ్రతను తెలియజేస్తుంది.
స్వీపర్‌గా పనిచేస్తున్న సమయంలో బ్యాంకులో తన చుట్టూ పనిచేస్తున్న ఉద్యోగులను గమనించేవారు. వారు ఫైళ్లు పరిశీలించడం, లెక్కలు చూడడం, ఖాతాదారులతో మాట్లాడటం ఆమెను ఆకర్షించేవి.
తాను కూడా అలాంటి ఉద్యోగం చేయగలగాలని అనుకున్నారు. ప్రతీక్షకు ఒక విషయం స్పష్టమైంది. తన జీవితాన్ని మార్చుకోవడానికి చదువే మార్గమని గుర్తించారు.
అప్పటివరకు ఆగిపోయిన చదువును తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించారు. బ్యాంకు అధికారులు ఆమెకు సహకరించారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో తోడ్పడ్డారు. చదువుకోవడానికి సెలవు కూడా ఇచ్చారు. సహోద్యోగుల సహాయంతో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తి చేశారు.
ఉద్యోగ బాధ్యతలు, కుమారుడి పెంపకం, కుటుంబ అవసరాల మధ్య చదువుకోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. ముంబైలోని నైట్ కాలేజీలో చేరి చదువును కొనసాగించారు. 1995లో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేశారు.
చదువును కొనసాగించాలనే ఆమె పట్టుదల ఫలించింది. బ్యాంకులోనే స్వీపర్ ఉద్యోగం నుంచి క్లర్క్ స్థాయికి ఎదిగారు. 1993లో ప్రతీక్ష ప్రమోద్ టోండ్వాల్కర్ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయన కూడా బ్యాంకులో మెసెంజర్‌గా పనిచేసేవారు. ప్రతీక్ష చదువుకోవాలనే ఆసక్తిని ఆయన ప్రోత్సహించారు. బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవ్వాలని ప్రోత్సహించడమే కాకుండా ఇంటి బాధ్యతలను కూడా పంచుకున్నారు.
ప్రతీక్ష తన జీవితంలో కుటుంబ సహకారం ఎంతో ముఖ్యమని అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆమె భర్త ఆమె చదువుకు, ఉద్యోగంలో ఎదుగుదలకు అండగా నిలిచారు. ఆమెకు బదిలీలు వచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పకుండా సహకరించేవారు. ఆయనకు పక్షవాతం వచ్చిన సమయంలో కూడా ఆమె చదువును కొనసాగించేందుకు ప్రోత్సహించేవారు.
ఆమె మొదటి భర్త ద్వారా కలిగిన కుమారుడు వినాయక్ కూడా తల్లి ఆశయాలను అర్థం చేసుకుని ప్రోత్సహించాడు. రెండో వివాహం తర్వాత వారికి మరో ఇద్దరు పిల్లలు కలిగారు.
ప్రతీక్ష ప్రయాణంలో ప్రతి ప్రమోషన్ ఒక కొత్త మెట్టు. 1995లో సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత క్లర్క్‌గా ఎదిగిన ఆమె, బ్యాంకులో అంతర్గత పరీక్షలకు సిద్ధమయ్యారు. 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. అక్కడి నుంచి వివిధ అధికారిక హోదాల్లో పనిచేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. దాదాపు 37 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, 2022 జూన్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు.
ఒకప్పుడు అదే బ్యాంకులో నేలలు ఊడ్చి, మరుగుదొడ్లు శుభ్రం చేసిన ఆమెకు, ఇప్పుడు అదే సంస్థలో ఉన్నతస్థాయి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఈ మార్పు కేవలం హోదాలో వచ్చిన మార్పు మాత్రమే కాదు. విద్య, కృషి, పట్టుదల ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చగలవో చెప్పే ఉదాహరణ.
ప్రతీక్ష ఆశయాలు బ్యాంకు ఉద్యోగంతోనే ముగియలేదు. 2021లో ఆమె నేచురోపతి కోర్సును కూడా పూర్తి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత తనకు వచ్చిన జ్ఞానాన్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకోవాలని భావించారు.
తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ఒకప్పుడు అసాధ్యంగా అనిపించిన విషయాలను సాధించగలిగాననే సంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్నవారికి, జీవితంలో ముందుకు వెళ్లలేమని భావించేవారికి తన కథ ప్రేరణ కలిగించాలని ఆమె కోరుకున్నారు.
ఆమె భర్త ప్రతీక్షా టోండ్వాల్కర్ కథను కేవలం పేదరికం నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన ఒక మహిళ విజయగాథగా మాత్రమే చూడకూడదు. ఇందులో అనేక సామాజిక అంశాలు దాగి ఉన్నాయి.
చిన్న వయసులో బాల్యవివాహం, మహిళల చదువుకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారడం, భర్తను కోల్పోయిన మహిళ ఎదుర్కొనే సామాజిక, ఆర్థిక సమస్యలు, ఒంటరిగా పిల్లలను పెంచే తల్లుల కష్టాలు… ఇవన్నీ ఆమె జీవితంలో కనిపిస్తాయి.
అయితే ఈ కథలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఒక మహిళకు అవకాశం కల్పిస్తే, ఆమె తన జీవితాన్నే కాకుండా తన కుటుంబ భవిష్యత్తును కూడా మార్చగలదు. ప్రతీక్షకు బ్యాంకు ఉద్యోగులు అందించిన సహాయం, ఆమె భర్త మరియు కుమారుడు ఇచ్చిన ప్రోత్సాహం ఆమె ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాయి. అంటే వ్యక్తిగత పట్టుదలతో పాటు కుటుంబం, సంస్థ, సమాజం అందించే సహకారం కూడా విజయానికి అవసరం.
ప్రతీక్ష సాధించిన విజయం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదు. ఒకసారి చదువు ఆగిపోయిందని జీవితాంతం అదే పరిస్థితిలో ఉండిపోవాల్సిన అవసరం లేదు. అవకాశాలు లభించినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు ఆమె బ్యాంకులో పనిచేసే ఉద్యోగుల పనిని చూస్తూ తానూ వారిలా ఎదగాలని కలలు కన్నారు. ఆ కలను నిజం చేసుకోవడానికి ఆమెకు ముప్పై ఏళ్లకు పైగా పట్టింది. కానీ ఆమె ఆగలేదు.
మనం ఎక్కడ ప్రారంభించామన్నది కాదు, ఎక్కడికి చేరాలనే సంకల్పం ఎంత బలంగా ఉందన్నదే ముఖ్యం.
ఒక వ్యక్తి ప్రారంభించిన పని అతని అంతిమ గుర్తింపు కాకూడదని ప్రతీక్ష జీవితం చెబుతోంది.
*****

నీరజ వింజామరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల , జమిస్తాన్ పూర్, రాంనగర్ , హైదరాబాద్ లో ఇంగ్షీషు స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పాటలు వినడం , పుస్తకాలు చదవడం ఆమె హాబీలు .
పిల్లలంటే చాలా ఇష్టం. వంటింట్లో ప్రయోగాలు చేస్తుంటారు.

31 రోజుల నెల ‘ కథ మనసును కలిచి వేసేలా రాశారు రచయిత్రి. అనువాదం కూడా అంతే ప్రభావం చూపిస్తోందని వేరేగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ మన సమాజంలో జనాలు తమ బంధుత్వాలని పైకి కనపరిచేది ఒకటి అయితే వాస్తవం మరోటి .