ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-3)

మరుసటి వారంలో గురువారం సాయంత్రం ఆఫీసుల తర్వాత ఏడుగంటలనించి పది గంటల వరకు జోత్స్న, గౌతం క్యారెక్టర్ లకి డబ్బింగ్ చెప్పడానికి పూర్వజ, ఆదిత్య వచ్చారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి డబ్బింగ్ సెషన్స్ పూర్తి చేసేసాను.

శుక్రవారం సాయంత్రం ఆఫీసు కాగానే శశి వచ్చాడు. బయట సమ్మర్ లైట్ బాగా ఉండడం వల్ల తనొక్కడే ఉన్న డేలైట్ షాట్స్, కాస్త చీకటి పడ్డాక నైట్ షాట్స్ మొత్తం తన ఇండివిడ్యువల్ షాట్స్ అన్నీ పూర్తి చేసాను.

శనివారం నాడు మళ్ళీ తీయవల్సిన ఇంట్లోని షాట్స్, కార్ షాట్స్ పూర్తిచేసి, మధ్యాహ్నం నించి డబ్బింగ్ కూడా చెప్పించేసి సాయంత్రం 6:00 గంటల కల్లా శశిని పంపించేశాను.

అదే రోజు సాయంత్రం నించి మూడు రోజుల పాటు మా ఇంటికి గెస్ట్ లు వచ్చి, బాగా బిజీ గా ఉండడంతో షెడ్యూల్ అక్కడితోటి ఆపేసాను. ఎడిటింగ్ కూడా పెద్దగా పూర్తి చెయ్యలేకపోయాను.

కానీ మొదట్నుంచి ఏరోజుకారోజు ఎంత లేటయినా ఎడిటింగ్ చేసేసి ఒకచోట పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను. వరుసగా పగలు మొత్తం షూటింగ్ చేయడం, రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు కూర్చొని ప్రతిరోజూ రషెస్ చూసుకుని, బాగా వచ్చినవి ఒక వరుసలో పెట్టుకుంటూ, ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. మంచి షాట్స్ అనిపించినవన్నీ ఒక వరుసలో పెట్టుకోవడం, మొదటి దఫా ఎడిటింగ్ చేసుకోవడం మొదలైనవి చేస్తూ వస్తూ ఉన్నాను.

శర్మగారికి మొదటి, రెండు రోజుల్లో చేసిన రషెస్ అన్నీ పంపించాను. మొదటి రోజు సీన్స్ లైటింగ్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ తీయమని సూచించారు. అంతేకాకుండా మిడ్ షాట్స్, క్లోజప్స్ పెంచాలన్నారు. ఆయన సూచనల ప్రకారం మళ్ళీ షూటింగ్ చేసినప్పుడు, ఇక రెండోరోజు నించి షాట్స్ తీసినప్పుడు ఆయన చెప్పిన మార్పులు గుర్తుచేసుకుంటూ షూటింగ్ చేస్తూ వచ్చాను.

ఇక డైలాగ్స్ లోనూ చాలా మార్పులు అక్కడికక్కడ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రాసిన తెలుగు పదాలు ముగ్గురూ పలకలేకపోయారు. ఇక కొన్ని పదాల్లో “మరీ టూ మచ్ తెలుగు అయిపోయింది” అని వాళ్ళు కంప్లైంట్ చేయడంతో మార్చాల్సి వచ్చింది. జెన్ జీ యువతలో వస్తున్న మార్పు ఇది. ఉదాహరణకి ‘తేనె లొలికించడం’ అనేది ‘స్వీట్ టాక్ చేయడం’ అని, ‘నామకరణం’ అనే పదాన్ని ‘పేరు పెట్టడం’ అని మార్చాల్సి వచ్చింది.

“మీరు రాసే తెలుగు ఇప్పుడు ఎవరూ మాట్లాడట్లేదని” షూటింగ్ మొత్తం కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు శశి. నిజానికి ఈ వ్యాసం మొత్తంలో రాస్తూ వచ్చిన తెలుగే స్క్రిప్ట్ లో కూడా రాసినది. అదేమీ గ్రాంథికం కాదు. కానీ ఏ వాక్యమూ ఇంగ్లీషు లేకుండా పలకలేని స్థితిలో ఉన్నారు ఇప్పటి పిల్లలు.

ఇక డైలాగ్స్ చెప్పేటప్పుడు వాళ్ళ నేచురల్ లాంగ్వేజ్ ని బట్టి కొన్ని డైలాగ్స్ మారిపోతూ వచ్చాయి. అదే అర్థం వచ్చేటట్టుగా వాళ్ళ నేచురల్ లాంగ్వేజ్ లో చెప్పమని చెప్పాను. కానీ వాళ్లకి సాధారణంగా కనిపించి, నాకు బూతులు అనిపిస్తున్న భాష మాత్రం నేను ఒప్పుకోలేక, నేను రాసిన డైలాగ్స్ ని అలాగే చెప్పాల్సిందేనని పట్టుబట్టాను. సరళమైన తెలుగు పదాల అర్థాలు కూడా వాళ్లకి వివరించాల్సి వచ్చింది.

ఇక ప్రతి డైలాగ్ ని మళ్ళీ మళ్ళీ చాలా సార్లు రీటేక్ చేయాల్సి వస్తూనే ఉంది. ఒకటే షాట్ లో బాగా వచ్చినవి ఒకటో రెండో మాత్రమే ఉన్నాయి. అందరూ కొత్తవాళ్ళు కావటం వల్ల పెద్ద పెద్ద లెంగ్తీ డైలాగ్స్ చెప్పలేకపోవడం, వాటిని కట్ చేసి రీ షూట్ చేయాల్సి వచ్చేది.

అలాగే ఏ పొజిషన్ లో కెమెరా ఉంటే సీన్ కరెక్ట్ గా వస్తుంది అనేది మళ్ళీ మళ్ళీ చూసుకోవాల్సి వచ్చేది. చేసింది వెంటనే తిరగ చూసుకుని, బాగా వచ్చినా, రాకపోయినా వెంటనే మరో షాట్ చేయాల్సి వచ్చేది. సెల్ఫోనులో షూటింగ్ చేస్తూ ఉండేసరికి షాట్ మళ్ళీ చూడడం కూడా కష్టంగా ఉండేది. ఇలా ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి వేస్తూ ఉండేసరికి ఐదు నిమిషాల షాట్ గంట పడుతూ ఉండేది.

ఇలా చాలా సీన్స్ లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే కెమెరాని నేనే పట్టుకోవాలి, అదే టైంలో డైరక్టర్ గా ఎదుటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ నేనే చూసుకోవాలి. ఇదంతా బాగా కష్టం అవుతూ ఉండేది నాకు. కెమెరాకి ఎవరైనా ఉండుంటే బాగుండేదని చాలా అనిపించింది.

మొత్తం షూటింగ్ హడావిడిగా తీయాల్సి వచ్చేసరికి లాస్ట్ మినిట్ వరకు కెమెరాకి ఎవరూ దొరకకపోవడం, సరిపడా “క్రూ” లేకపోవడం లోపాలుగా మిగిలాయి. అన్నీ నా భుజస్కంధాలపైనే వేసుకోవాల్సి వచ్చింది.

మొత్తానికి అతి కష్టం మీద రెండు వారాల్లో షూటింగ్, డబ్బింగ్ మొత్తం పూర్తి అయిపోయింది.

ఇక నా డబ్బింగ్, ఫిల్మ్ మొత్తం బేసిక్ ఎడిటింగ్ పూర్తి చెయ్యడానికి నాకు మరో వారం పట్టింది.

దాదాపుగా మే నెల చివరి రోజుల కల్లా ఫస్ట్ వెర్షన్ ఎడిట్ చేసిన ఫైల్స్, డబ్బింగ్ ఫైల్స్ ఇండియాలో డ్రమ్స్ రాము గారి టీమ్ కి పంపించాను. ఇక బ్యాక్ అండ్ ఫోర్త్ ఎడిటింగ్స్ లో తేడాలు రావటం, నేను చేసింది కాకుండా ఇంకా ఎక్స్ట్రా కట్ చేసేయటం, ఇలా ఎడిటింగ్ ఫైల్ దాదాపుగా వారం పది రోజులు ప్రతీరోజూ భూమికి ఆ మూల నించి ఈ మూల వరకు అటూ ఇటూ తిరుగుతూనే ఉంది.

ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ చేయటం వరకు వచ్చేక మరొక ఎడిటింగ్ ప్రాబ్లం వచ్చింది. అదేవిటంటే కేవలం సీన్స్ షూటింగ్ మాత్రమే కాకుండా టెక్నికల్ గా చేయాల్సిన ప్రతి స్క్రీన్ కూడా నేనే చేయాల్సి వచ్చింది.

అవన్నీ ఇండియాలో టీమ్ కి చెప్పి చేయిస్తూ ఉంటే లేట్ అయిపోతుంది, అదీగాక వాళ్ళకి కొన్ని ఏఐ(AI) అంశాలు పూర్తిగా అర్థం కావడం కష్టం.

అందుకని స్క్రీన్ మీద పాపప్ రావడం అంటే డైలాగ్స్ చెప్పేటప్పుడు స్క్రీన్ మీద వాట్సాప్ డైలాగ్స్ చూపించటం, మెసేజెస్, నోటిఫికేషన్లు రావడం మొదలైనవి, టెక్నికల్ గా AI మాట్లాడుతూ ఉన్నటువంటి స్క్రీన్లకి తగిన సీన్స్ మొదలైనవన్నీ రకరకాల ఏఐ(AI) టూల్స్, కాన్వా వంటి టూల్స్ ఉపయోగించి నేనే తయారు చేశాను.

ఇలా అలాగే మొత్తం ఫిల్మ్ లో ఉన్న ఏఐ(AI) డైలాగ్స్ అన్నీ నా వాయిస్ తో రికార్డ్ చేసి, ఏఐ(AI)తో మళ్ళీ వాయిస్ మార్చి రీరికార్డు చేశాను.

మొత్తానికి ఇలా టెక్నికల్ గా చేయాల్సినటువంటి ప్రతి పని, అంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి ప్రతి పని చేసిన తర్వాత, వాటన్నిటిని చేర్చి రీ ఎడిట్ చేసిన ఫైల్స్ మళ్ళీ ఇండియాకి పంపించాల్సి వచ్చింది.

ఇక మొత్తం ఫిల్మ్ డ్యూరేషన్ 20 నిమిషాలు మించకూడదు అన్నది ఆటా వారి నిబంధన. అప్పటికే ముప్పయి నిమిషాలపాటు తీసిన ఫిల్మ్ ని చాలావరకు కట్స్, ఎడిట్స్ చేసుకుంటూ వచ్చాను. కథలో ప్రధాన భాగం అంతా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకొని ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది.

ఇక నేను పంపిన డబ్బింగ్ ఫైల్స్ యాడ్ చేసి, ఇండియా నించి మొదటి వెర్షన్ ఫైల్స్ వచ్చిన తర్వాత మధ్యలో కొన్ని డైలాగ్స్ మిస్ అయిపోవడం, డబ్బింగ్ లో ఎవరైనా ఎక్కడో ఒకచోట తప్పు చెప్పడం, ఒకటి రెండు చోట్ల లిప్ సింక్ కాకపోవడం ఇలా ఏవేవో లోపాలు ఉంటే అవన్నీ కూడా మార్చి పంపిస్తూ వచ్చాను.

ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నాకు కొన్ని చోట్ల నచ్చలేదు. మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ ప్రతి సీను చూసుకొని, ప్రతి సీన్ లోనూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కరెక్ట్ గా వచ్చేటట్టు ఇండియా టీమ్ తో సరి చేయించాను.

అదే సమయంలో పాట ఏదైనా ఉంటే బావుంటుదనిపించి అప్పటికప్పుడు “వెన్నెలా వెన్నెలా” అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ రాసి, ట్యూన్ కట్టాను. ఆ పాటని మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మధురిమ బండారితో పాడించాను. ఆ పాట మ్యూజిక్ ని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గా పెట్టమని ఇండియా టీమ్ కి చెప్పాను. అవన్నీ ఏయే సీన్లలో ఎంత సేపు రావాలో ఎడిటింగ్ ఫైల్ లో యాడ్ చేసి పంపించాను.

ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంక టైటిల్స్ కి సమయం వచ్చింది. ఆ టైటిల్స్ దగ్గర కూడా ఇండియా టీమ్ సరిగ్గా చేయలేకపోవడంతో టైటిల్స్ బ్యాక్ గ్రౌండ్ సీన్స్ మొత్తం నేనే తయారు చేసి అక్షరాలు మాత్రం వాళ్లని యాడ్ చేయమని చెప్పాను. అందులో కూడా తప్పులు ఉంటే ఒకట్రెండు రోజుల పాటు సరిచెయ్యాల్సి వచ్చింది.

మొదట టైటిల్స్ లో నేమ్ ప్లేట్ ఇండియా టీం చేస్తే, అది ఒక వైట్ కార్ కి అతుక్కోవడం, ఏఐ(AI) ట్రాన్సిషన్ ఫ్లో లో వెళ్లడం మొత్తం నేనే చేసి పంపించాను వాళ్ళకి. టైటిల్స్ ఏఐ(AI) మ్యూజిక్ కూడా నేనే యాడ్ చేశాను.

ఇవన్నీ చేయడానికి నాకు చాట్ జీపీటీ, జెమినీ, క్లాడ్, ఎలెవన్ లాబ్స్, కాన్వా వంటివన్నీ బాగా ఉపయోగపడ్డాయి.

అవన్నీ నేను బాగా నేర్చుకుని, పనిచేయాల్సి వచ్చింది.

కానీ ప్రతి రోజూ ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు ఒక్కటే పని అయ్యింది. పర్ఫెక్షన్ కోసం పదేపదే పని చేయాల్సి వస్తుండేది.

ఇలా జూన్ 15వ తారీఖు సమయానికి ఇంకా కరెక్షన్స్ వర్క్ నడుస్తూనే ఉంది. దాదాపుగా జూన్ 20వ తారీకు సమయానికి ఫిల్మ్ ఒక కొలిక్కి వచ్చింది.

ఇక ఫైనలైజ్ చేసేద్దాం అనుకుని ఆటా వెబ్సైట్ ఓపెన్ చేసి సబ్మిషన్ డీటెయిల్స్ మళ్ళీ చూసాను.
తీరా చూస్తే వాళ్ళు ఒక పెద్ద బాంబు పేల్చారు.

*****

(సశేషం)

 

Leave a Reply

Your email address will not be published.