ఈ తరం నడక – 29

అడుగులు

-రూపరుక్మిణి 

 

 

సరికొత్తగా ఒక మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు మనసు పడే వెతుకులాట, ఆ వెతుకులాటలోని గమ్యాన్ని చేరాలని చిన్ని ఆశ, ఆ ఆశని అంటిపెట్టుకొని బ్రతికే బ్రతుకుల గుండె చప్పుడు ఈ అడుగులు.

ఈ అడుగులు ఎవరివి.?  కొత్త,పాత కలబోతల్లో వసంతంలో చిగురించిన వెన్నెల గాలి కోసం ఎదురు చూసినట్టు జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కొత్త,కొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణలో సాగే జీవన ఋతుక్రమమే ఈ అడుగులు.

రచయిత డా. ఎమ్.దేవేంద్ర రాసిన అడుగులు కథల పుస్తకంలో మొత్తం పది కథలు ఉంటాయి.

అడుగులు, కొత్తపల్లి, సంకల్పం, సుదర్శన చక్రం, వెండి గిన్నె, నారుమడి, రంగయ్య, వసుధ, కనిగిరి బడి,నిర్భయ నుండి దిశ వరకు.. సాగే ఈ కథలన్నీ మనకు నిర్భయంగా సమాజం ముందు వెన్ను చూపని మనుషుల కథలు వినిపిస్తాయి.

ఓర్పు మనిషి విజయానికి ఎలా ప్రతీకగా మారుతుందో ప్రతి కథలో స్థిరమైన గొంతుతో వినిపిస్తాయి ఈ కథలు.

జీవితం మొదలుపెట్టినప్పుడు తొలి అడుగు కెరియర్ పై దృష్టి పెట్టి నడిచే అనేక జీవితాల మధ్య సారుప్యతలను చూపిస్తూనే సమాజం ఏ దిశగా నడుస్తుందో అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉద్యమ కెరటాలని,  తెలంగాణ ఉద్యమ కాలాన్ని ఈ కథల లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమ కాలంలో యూనివర్సిటీలో చదివే విద్యార్థుల మానసిక స్థితిని,  ఉపాధ్యాయుల నిరసన క్రమాన్ని, ఉద్యమాన్ని అణిచివేసే ప్రక్రియలో జరిగిన మానసిక సంఘర్షణలు ఓ కాలేజీ విద్యార్థిగా, అధ్యాపకురాలిగా సామాజిక వాస్తవాన్ని నిక్షిప్తం చేశారు ఈ కథల్లో దేవేంద్ర.

విద్య – ఉద్యమం ఈ రెండు ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు. ముఖ్యం గా తెలంగాణ రాష్ట్రం కోసం చేసే పోరాటం ంలో ముఖ్య భూమిక వహించిన కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గురించి చెప్తాయి కథలు.

వ్యవసాయం చేసే మనుషుల శ్రమ జీవన సౌందర్యాన్ని నారుమడి కథ ద్వారా మనతో మాట్లాడతారు. విత్తనాలను పండించే విధానాన్ని  వివరిస్తూ అగ్రికల్చరల్ బిఏ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చేయడం వలన జీవితంలో కలిగే మార్పులను.. భావితరాల భవిష్యత్తును గురించి కలత చెందకూడదని చెప్పే కథ.  కనిగిరి బడి చిన్ననాటి స్నేహితులు కలయిక బృందాలుగా ఏర్పడే విధానం తో ఆ బృందాలలో ఒకరికి ఒకరు సహాయం చేసే చేతులు, చిన్ననాటి గురువుల క్రమశిక్షణ లో జీవితం నేర్పిన పాఠాలను గుర్తు చేస్తుంది ఈ కథ.

వసుధ చదువే ముఖ్యం చదువు ఉద్యోగం ఆడపిల్లకు స్థిరమైన జీవితాన్ని ఇస్తుంది. ఆ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి జీవితాంతం కుటుంబంతో ఎలా పోరాడాల్సి వస్తుందో పోరాడాల్సిన సమయంలో ఓర్పును వహించడమే సమస్యకు పరిష్కారంలా వసుధ కథనం చెప్తారు దేవేంద్ర. బిడ్డ బారసాల సమయంలో అత్తగారికి నచ్చిన పేరు పెట్టలేదని సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోయి ఉండడం. అకారణంగా భర్త అత్తగారు ఆర్థికంగా నిలదొక్కుకున్న ముందు నిలబడితే వసుద సాదరంగా ఆహ్వానించడం కథను అర్ధాంతరంగా ముగించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇందులో స్త్రీ ఉద్యోగం చేయడం కేవలం ఆమె ఇష్టమే కాక ఆమె కుటుంబ సభ్యుల ఇష్టాన్ని అనుసరించి ఉంటుందని ఓ బలమైన వాస్తవాన్ని ఈ సమాజంలో పేరుకుపోయిన వ్యవస్థను ప్రశ్నిస్తూనే ఓర్పుతో సర్దుకుపోవడమే అన్నింటికీ పరిష్కారం అని వినిపించిన కథ వసుధ.

వెండి గిన్నె స్త్రీ అస్తిత్వాన్ని ప్రశ్నించే చోట వృత్తి విద్యను తండ్రి కళను చేతబట్టి కంసాలి వృత్తి విద్య లో నిపుణత సాధించిన ఓ స్త్రీ కథ. చివరకు కొడుకు భవిష్యత్తు కోసం తను నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవడానికి కారణం మారుతున్న మార్కెట్ వ్యవస్థను నేటితరం కొనసాగించలేని వృత్తి విద్యను గురించి చిత్రించిన కథ ఇది.

నేటికీ సమాజంలో వేళ్ళూనుకు పోయిన కుల వ్యవస్థలో విద్యని ఓ సుదర్శన చక్రం ఆ విద్యా ని సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుందని చెప్పే కథ.

ఇలా కథలన్నింటిలోనూ చదువు చదువు తెచ్చి పెట్టే గౌరవం చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడంలో ఎదురయ్యే కష్టం, ఆ కష్టాన్ని ఎదుర్కొని ఓర్పుతో ప్రయత్నిస్తే కలిగే విజయాన్ని ఆ విజయం తెచ్చుకొచ్చి పెట్టే ఆత్మ తృప్తిని ఈ కథలన్నీ వివరిస్తాయి.

తెలంగాణ ఉద్యమ కాలాన్ని గురించి మాట్లాడుతున్న కథలు ఎక్కువ,  కరోనాకాలం తెచ్చి పెట్టిన సమస్యలు, తెలంగాణ ప్రభుత్వం రాకముందు సామాజిక పరిస్థితి, వచ్చాక వచ్చిన మార్పును రెండింటి గురించి మాట్లాడతాయి ఈ కథలు. ఈ కథల రచన చాలా సరళంగా ముక్కుసూటిగా సంభాషణ రూపంలో సాగుతాయి.

ఈ అడుగులు జీవితపు తొలి అడుగులు.. అభినందనలు మారోజు దేవేంద్ర గారు.

కథల సంపుటి : అడుగులు

రచయిత: డా. ఎమ్. దేవేంద్ర.

ప్రచురణ: విశాల సాహిత్య అకాడమీ.

*****

Leave a Reply

Your email address will not be published.