రోజు ఇలాగే

-మహెజబీన్

రోజు ఇలాగే కొత్తగా మొదలవుతుంది జీవితం
తొలిసారి చూసినట్టు ప్రతీ సూర్యోదయం అద్భుతమే
సంధ్యా సాయంకాలం ప్రతీ రోజు వర్ణ చిత్ర మవుతుంది
చూసినప్పుడల్లా సముద్రం ఆశ్చర్యమవుతుంది

పుట్టినప్పటి నుండి చూస్తున్ననీలాల గగనమే,
అయినా తనివి తీరదు
నక్షత్రాల్నిచెల్లా చెదురుగా పడేసుకున్న రాత్రి ఆకాశం,
దాని మీద కురిసే వెన్నెల చూపు తిప్పనీదు

ప్రతీ ఋతువు కొత్తగా కనిపిస్తుంది
వచ్చిన ప్రతీసారి వసంతం కొత్త రంగుల్నిఇచ్చి వెళుతుంది
వాన కురిసిన ప్రతీసారి అహ్లాదమే
తొలకరి జల్లులో తడవాల్సిందే అంటుంది మనసు

నిన్నటి కంటే ఈ రోజు మరింత బాగుంది
రేప్పొద్దున మళ్ళి కొత్తగా చిగురిస్తుంది జీవితం

*****

Leave a Reply

Your email address will not be published.