దేవి చౌధురాణి

(రెండవ భాగం)

మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ

తెనుగు సేత – విద్యార్థి

నావ భూత్‌నాథ్ ఘాట్ వద్దకు చేరుకుంది. ప్రఫుల్ల వ్రజేశ్వర్‌లిద్దరు నావ దిగారు. దేవి ఘాట్ పైన నిలబడి తన పాత మిత్రులందరికీ వీడ్కోలు పలికి, నిండు తెరచాపలతో నిష్క్రమిస్తున్న నావను చూస్తూ తన పాత జీవితానికి కూడా వీడ్కోలు పలికింది.

వ్రజేశ్వర్ ఇంకో కొత్త కోడలితో వచ్చాడన్న వార్త ఊరంతా వ్యాపించటానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదు. వయసు పైబడిన స్త్రీని చేసుకున్నాడటనే మాట గుప్పుమన్నది. వెంటనే ఊరు వాడ కొత్త కోడలిని చూడటానికి బయల్దేరారు. పిల్లాపీచు, ముసలిముతక, కుంటిగుడ్డి అని వ్యత్యాసం లేకుండా అందరూ ఘాట్ దగ్గరకు తోసుకుంటూ బయల్దేరారు. వంటవాళ్లు పొయ్యి మీద పాత్రలని పొయ్యి మీదే వదిలేశారు. స్నానం చేస్తున్న వాళ్లు ఒక బట్ట వంటిపై వేసుకుని నీరు కారే తడిజుట్టుతోనే బయల్దేరారు. అప్పటిదాకా నోటి దురుసుతో పోట్లాడుకుంటున్న వాళ్లు పోట్లాట సంగతి మర్చిపోయి ఒక్క ఉదుటున కలసి బయల్దేరారు. అరటి ఆకు మీద భోజనం చేస్తున్నవాళ్లు సగం భోజనంలోనే , అలా ఎంగిలి చేత్తోనే లేచి బయల్దేరారు. ఎందుకంటే, వడ్డిస్తున్న పెళ్లాం చేపల కూర చేసింది కాని అది వడ్డించకుండా అప్పటికే వెళ్లింది కాబట్టి. యువతులు, మామ్మగార్లు, తల్లులూ, వాళ్ల వెంట పిల్లలు అందరూ కలసి గుంపులుగా ఘాట్‌కి ఎగబడ్డారు. జుట్టు ముడులు వూడి జుట్టు వేలాడుతున్నా, పైట చెంగుల జారిపోతున్నా, అవేమీ పట్టించుకోకుండా ఆడవాళ్లు గుంపులుగా తోసుకుపోయారు. సిగ్గు, మర్యాదలు వెనకడుగు వేసాయి.

తీరా ఘాట్‌కి చేరుకునేటప్పటికి ప్రఫుల్ల ఘూంఘట్‌ని కప్పుకుని ముఖం పైకి పూర్తిగా లాక్కుంది. వ్రజేశ్వర్ ప్రఫుల్లలు వారి అందరి మధ్యలో నుంచే ముందుకి నడిచి రంగాపురంకి బయల్దేరారు. కొత్త కోడలు ముఖమేమి ఊరి వాళ్లకి కనబడలేదు. వెంటనే అందరూ కొత్త కోడలు ముసలిది, అసలేమి బాగోలేదు అని తేల్చేసారు. పైగా కులీన బ్రాహ్మల ఆచారాలు పద్దతులూ అన్నీ విపరీతమే అంటూ పెదవి విరిచేసారు.

మొత్తానికి వ్రజేశ్వర్ ప్రఫుల్లలు రంగాపురంలోని తమ ఇంటికి చేరుకున్నారు. అక్కడ వ్రజేశ్వర్ తల్లి ఇద్దరికి గడప దగ్గర స్వాగతం పలికి మిఠాయి నోట్లో పెట్టింది. అప్పుడు ప్రఫుల్ల ఘూంఘట్ పైకి తీసి అత్తగారి కళ్లలోకి చూసి మళ్లీ ఘూంఘట్ క్రిందకి దించుకుంది. అత్తగారు చక్కని కోడలు అని మురిసిపోయింది, ఆవిడ కళ్లలో ఆనంద భాష్పాలు నిండాయి.

రంగాపురంలో కొత్త కోడలు వచ్చిందన్న విషయం తెలిసింది. కొత్త కోడలిని చూడటానికి ఇంటి ముందు పెద్ద గుంపు ప్రోగైతే, వ్రజేశ్వర్ తల్లి వాళ్లతో “తల్లులూ, మా అబ్బాయి కోడలు చాలా ప్రయాణం చేసి వచ్చారు, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. క్రొత్త కోడలు ఎక్కడికీ పోదు, ఇక్కడే వుంటుంది కదా, తర్వాత వచ్చి చూద్దురుగాని” అని గుంపును ఇంక వెళ్లమని చెప్పి పంపించివేసింది.

గుంపు రుసరుసలాడారు, విసవిసలాడారు. చివరకు గుసగుసలాడటం మొదలుపెట్టారు. ఊరివాళ్లు ఏదైనా అయితే వ్రజేశ్వర్ తల్లిని ఆక్షేపించాలి. కానీ గుంపులోని వారందరూ ప్రఫుల్లనే ఆక్షేపించారు, లేనివి కానివి చొప్పించి వంకలు పెట్టారు. “ముసల్దంట, వెంట్రుకల తెల్లబడ్డాయంట, మొఖమంతా ముడతలంట. మరి ఘూంఘట్‌తో మొహం కనబడకుండా కప్పుకోక ఏం చేస్తుంది? సర్లే, ఇంత ముసలిదాన్ని చేసుకున్నందుకు వ్రజేశ్వర్‌ని అనాలి అసలు” అన్నారు.

ఇంక తోచుబాటు కోసం ఊసులు ఎక్కువయ్యి ఉన్నవి లేనివి కథలు  చెప్పుకోవటం మొదలుపెట్టారు. “గోవింద ముఖర్జీ గుర్తున్నాడా? నలభై తొమ్మిదేళ్ల దాన్ని పెళ్లి చేసుకున్నాడు. నలభై తొమ్మిది!!!”

“అది సర్లే, హరి చటర్జీ లేడూ, డెభ్భై ఏళ్ల కన్యను తెచ్చుకున్నాడు. డెభ్భై!!!”

“మోనా బరువా ఎంత పెద్ద దాన్ని చేసుకున్నాడో తెలుసా?”

మొత్తానికి అందరు కలసి “ఏం చెబుతాం ఈ కులీన బ్రాహ్మల పద్దతులూ పనులూ, అంతా విపరీతమే అని అనుకుంటూ” అంటు వెనుదిరిగారు. కొంత సేపటికి ఊరు మళ్లీ సద్దుమణిగింది.

లోపల భవంతిలో గృహిణి కొడుకుని తన గదిలోకి పిలిచి “వ్రజేశ్వర్, ఈ కోడలు నీకు ఎక్కడ దొరికింది?” అన్నది.

“కొత్త కోడలు కాదమ్మా, ఇదివరకటి కోడలే, గుర్తు పట్టలేదా?”

“అదే అడిగేది. చెయ్యి జార్చుకున్న ఐశ్వర్యం మళ్లీ ఎలా ప్రాప్తించింది?” అంటూ కన్నీరు కార్చింది.

“విధాత కృప. నాన్నగారితో అప్పుడే ఏమీ చెప్పకు. నెమ్మదిగా నేనే చెబుతాను.”

“నువ్వు చెప్పాల్సిన అవసరమేమీ లేదు. క్రొత్త కోడలు వచ్చిన పేరంటం విందూ అయ్యిన తరువాత నేనే చెబుతాను. ఈ విషయంగా ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దు. నువ్వు మాత్రం ఇంకెవరికి చెప్పకు.”

పేరంటం రోజున ప్రఫుల్ల వంటిల్లు ప్రవేశించి పాత్రలనన్నిటిని తాకింది. నవధాన్యాలను ఇతర దినుసులను కూడా తాకింది. పురోహితుడు ఆశీర్వాద వచనాలు పలికాడు. “ఈ కోడలు ఈ ఇంటికి సౌభాగ్యం చేకూర్చుంది. ఈ ఇల్లు ధన ధాన్యాలతో, ఐశ్వర్యంతో విలసిల్లుగాక.”

విందు చిన్నగానే జరిగింది, ఆర్భాటాలేమీ లేవు. వయసు పైబడిన కోడలు కదా మరి. దగ్గర బంధువులు, సన్నిహితులు, ఇంటి ఇరుగుపొరుగు మాత్రమే వచ్చారు.

విందు కార్యక్రమం ముగిసిన తరువాత గృహిణి  హరివల్లభ రాయ్‌తో “కొత్త కోడలేమీ కాదు, పెద్ద కోడలే, ఇప్పుడు తిరిగి వచ్చింది” అన్నది.

హరివల్లభ రాయ్ దెబ్బ తగిలిన పులిలాగా ఎగిరిపడ్డాడు. “ఏమిటేమిటి? అసలు నువ్వు చెప్పేదేమిటి? పెద్ద కోడలా!?”

“అవును, నేను చూసాను. వ్రజేశ్వర్ కూడా అదే చెప్పాడు.”

“అది పదేళ్ల క్రితమే చచ్చింది కదా!?”

“చచ్చిన వాళ్లు తిరిగి ఎలా వస్తారు?”

హరివల్లభ రాయ్ అరవటం మొదలు పెట్టాడు. “ఈ పదేళ్లలో ఎక్కడ వుందట? ఎవడితో వుందట?”

“నాకు తెలవదు, నేను వ్రజేశ్వర్‌ని అడగను. వాడూ పెద్దవాడయ్యాడు, వాడేం చేస్తున్నాడో వాడికి తెలుసు.”

“అయితే నేనే అడుగుతాను.”

“అడిగితే ఊర్కోను, నా మీద ఒట్టు. పదేళ్ల క్రితం కోడలు ఇంటికొస్తే నువ్వు తరిమేసావు. నాకున్న ఒక్క కొడుకునూ పోగొట్టుకున్నంత పనయ్యింది. ఒక్కగానొక్క కొడుకు. మళ్లీ పోగొట్టుకోను. నువ్వు వాడిని అడగటానికి వీలు లేదు. నువ్వు అడిగావో, నేను ఉరి వేసుకుని చస్తాను జాగ్రత్త.”

హరివల్లభ రాయ్ అహం దెబ్బతిన్నది. తగ్గాడు. “సరేలే. అట్లైతే అందరికి కొత్త కోడలు అని మాత్రమే చెప్పు” అన్నాడు.

“మంచిది” అంటూ అక్కడి నుండి గృహిణి నిష్క్రమించిది. వెళ్లి కొడుకును పిలిచి “మీ నాన్నతో అసలు విషయం చెప్పాను. ఇంకేమీ ఎదురు చెప్పడు. నువ్వు ఇంక ఈ విషయం గురించి ఆయనతో మాట్లాడవలసిన అవసరం లేదు.” అన్నది.

విని వ్రజేశ్వర్ తల్లితో “అమ్మా, నేను చాటుగా ఏ తప్పుడు పనులనూ చెయ్యను. నా ప్రఫుల్ల ఒక దేవి. ఏభై వేల రూపాయలు ఇచ్చి మన పరువూ ప్రతిష్టా నిలబెట్టింది. నాన్నగారిని, మన కుటుంబాన్ని రక్షించింది” అన్నాడు.

ఈ విషయాన్ని గృహిణి హరివల్లభ రాయ్‌కి చేరవేసింది. హరివల్లభ రాయ్ ఉలుకు పలుకూ లేకుండా నెమ్మదించి చూస్తూ ఉండిపోయాడు.

వ్రజేశ్వర్ సంతోషంగా ప్రఫుల్లతో విషయాలన్నీ చెప్పటానికి వెళ్లాడు.

పాఠకుడా, ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన విషయంమేమిటంటే, ఇంటి ఇల్లాలు సమర్ధవంతురాలయితే ఇల్లంతా సుఖశాంతులతో నిండి వుంటుంది. గృహిణి సమర్ధవంతురాలని ఒప్పుకోక తప్పదు.

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.