నీహార పథం – భాగం-4

-డాక్టర్ కొండపల్లి నీహారిణి

నీహార పథంలో ఇప్పటిదాకా….

అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ గారు పెండ్యాల కౌసల్యాదేవి మహిళా మండలిని స్థాపించి స్త్రీల సాధికారత కోసం కృషి చేసిన విషయాన్ని, వరంగల్ జిల్లా మొట్టమొదటి ఎం.పీ.గా సేవలు అందించిన నాన్నగారు పెండ్యాల రాఘవరావు ఆనాటి పోరాట సమయంలో వారి స్పీచ్ కాగానే కాళోజీ నారాయణరావు ఏమన్నారో చెప్పిన విషయం అంతా రాశారు. ఆకాశవాణి ప్రభావం, పెద్ద కుటుంబ ఆహ్లాదం, యశోదమ్మకు కృష్ణుడు నోరు చూపించినట్టు వాళ్ళ అమ్మ గారికి ఎందుకు నోరు తెరిచి చూపించారో చెప్పిన కథనం తర్వాత….

***

నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు భారతి టీచర్ తెలుగు టీచర్ . ఆమె పద్యం ఎలా చదవాలో చదివి వినిపించి, నాకు శ్రద్ధ గా నేర్పించారు . భారతి టీచర్ మాట్లాడితే చాలు నేను ఎంతో మురిసిపోయేదాన్ని ఆవిడంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆవిడ నన్ను చాలా ప్రేమచేసేవారు. సుమతీ శతకం, వేమనపద్యాలు చాలా నేర్చుకున్నాను . అమ్మ బాపులు కూడా తెలుగు భాష మన మాతృభాష .. స్పష్టం గా, చక్కగా రావాలని గుర్తు చేస్తూ, సవరణలు చేస్తూ ఉండేవాళ్ళు.

బడిలో ఇంద్రయ్య సారు , రెహమాన్ సారు , మల్లయ్య సారు అందరూ మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసేవాళ్ళు. చదువు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి ఇవన్నీ కారణాలు. కానీ స్కూల్ ఫస్ట్ లాంటివి నాకైతే రాలేదు.

ఊళ్ళో నుంచి సర్వీస్ బస్సులు నడిచేవి చిల్పూర్ నుండి ఘనపూర్ వరకు . ఆ వేళ కు బడి కిటికీలోంచి తొంగి చూసి సంబర పడేవాళ్లం. ఈ పెద్ద ప్రపంచాన్ని ఆ కిటికీ చూపేది.. అంటే, ఏవైనా ‘ బంద్‘ లు ‘ స్ట్రైక్ లు జరిగితే తెలిసిపోయేది. అదన్నమాట!!

అసలే అప్పుడు చాలా విరివిరిగా రాస్తారోకోలు ర్యాలీలు వంటివి జరిగేవి. ఇక్కడ మీకు నేనో విషయం చెప్పాలి! ఇవన్నీ చెబుతున్నారు కదా మళ్లేంటి అనుకోకండి!! 1969 తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పుడు నేను “నిరాహార దీక్ష” లో పాల్గొన్న! ఆ… ఇదేంటి? ఐదేళ్లకే ఉద్యమాలు చేసారా? అంతా తూచ్ .. . అనకండి!! నిజం గా నిజం! తెల్లని కాటన్ ఫ్రాక్ తొడుక్కుని, మెళ్లో గన్నేరు పూల దండ, బంతి పూల దండ వేసుకొని నుదిటిపైన పెద్ద పొడవాటి బొట్టు పెట్టుకుని మా అన్నయ్య వాళ్లతోబాటు టెంట్ లో కూర్చున్నా!
” చిప్పా పోలీస్ ఎందుకు రా?
చిప్పలు తోమేటందుకురా!” అంటూ ఏవేవో నినాదాలు చేస్తూంటే వాళ్ళ తోబాటు ” జై” అంటే ” జై” అంటూ పిడికిలి బిగించి చేతిలో జెండా పట్టుకుని అరిచేదాన్ని! తర్వాత పోలీసులు వస్తే పరుగో పరుగు.. అదీ అయ్యిందనుకోండి! ఇవన్నీ ఎలా గుర్తంటాయబ్బా అని ‘హాశ్చర్యపడకండి‘! ఎందుకంటే మేం తోబుట్టువులం కలిసామంటే చిన్ననాటి ముచ్చట్లే ముచ్చట్లు! దశాబ్దాలుగా!! అయితే నా ఇంట్రెస్ట్ అంతా వీటి గురించి కానేకాదు.. ఏవైనా ఆందోళనలు జరిగితే స్కూల్ ఎట్లా? స్కూల్ కు సెలవులొస్తే నేను బాగా ఏడ్చేది! ఏం తోచదు. టైం అంతా వేస్ట్ అని నా ఫీలింగ్!! ఇంట్లో ఖాళీగా ఉండడం అంటే అది కేవలం ఆదివారం నాడే ఉండాలి.. హాలీడే అంటే సండే! అంతే ! ఇదండీ బస్సు”బాగోతం” !!

అప్పటికే మా అక్కయ్య, అన్నయ్య ఘన్పూర్ లో చదువుకునేవాళ్ళు. వాళ్లప్పుడు చిన్న పెండ్యాల లో ఐదవ తరగతి వరకే ఉండేది. సర్వీస్ బస్సులు ఆలస్యంగా వెళ్లేవి కాబట్టి ప్రయాణ సౌకర్యాలు వేరే ఏమీ లేవు కాబట్టి, ఆడపిల్ల… కష్టం అవొద్దని అక్కయ్య కోసం మా బాపు ఒక రిక్షా కొన్నారు . ఆ రిక్షా లో ఘన్పూర్ కు వెళ్లి వచ్చేవాళ్ళు. బుచ్చయ్య అనే అతను ఉదయాన్నే రిక్షా లో దింపివచ్చి, మళ్లీ సాయంత్రం వెళ్లి తీసుకొచ్చేది.

పండుగలు వచ్చాయంటే భలే సంబరంగా గడిపే వాళ్ళం . సెలవులు ఇస్తారు కదా ! ఈ పండుగ సెలవులు భలే ఉంటాయి. ఇంట్లో అమ్మ రకరకాల పిండి వంటలు చేస్తుంది కదా ! గుడికి తీసుకెళ్తారు కూడా!! మా ఊళ్ళో రెండు గుళ్ళు ఉండేవి. ఒకటి ఆంజనేయస్వామి గుడి . మా గిర్నీ కి దగ్గర లో ఉంటుంది. నా చిన్నప్పుడు చెట్టు కింద విగ్రహం ఉంటుండేది అంతే .. తరువాత కాలంలో చిన్నగా గుడి కట్టించారు . ఇక్కడే మసీద్ కూడా ఉంటుంది. ఇది నాలుగు బాటల కూడలి.

ఇంకోటి ఊరి బయట చిల్పూర్ వైపు మల్లంకుంట్ల అనే ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉండేది . అక్కడికి ఏదో విశేషమైన రోజున తీసుకెళ్లే వాళ్ళు. మా ఊళ్లో ఉండే గ్రహస్తులైన చిన్నమ్మలు, చిన్నాన్నలు వాళ్ళ పిల్లలు అందరం బండ్లు కట్టుకొని కలిసెళ్ళేవాళ్ళం . ఎంతో హడావిడి ! పులిహోర , దద్దోజనం తీసుకొని వచ్చేవాళ్ళు. దొప్పల్లో , ఇస్తరాకులలో పులిహోర ప్రసాదాలు పెట్టిస్తే తినేవాళ్ళం ! అక్కడ రకరకాల ఆటలు ఆడుకునే వాళ్ళం . ఒక కథ చెప్పాలి కథ కంటే జరిగిన విషయం అని చెప్పడం కరెక్టేమో ! చాలా రకరకాలుగా చెప్పేవాళ్లు ఇక మా పిల్లలమైతే సరే సరి … ఏంటంటారా ? చాలా పురాతన విషయం…. ఆ గుడి ఏ అలంకారాలు, పెద్ద గోపురం లేకుండా నిర్మానుష్య ప్రదేశంలో ఉండడంతో తలా ఓ మాట అనుకొని ఒక దేవాలయం కట్టిస్తే బాగుంటుంది అనుకున్నారట కానీ, మా పెండ్యాల తాతయ్యలల్లో ఒక తాతయ్య కలలో నరసింహ స్వామి కనిపించి నాకు ఆలయం కట్టవద్దు అని చెప్పారట కానీ వీళ్ళు ఊరుకోలేదట ! గుర్రాల మీద వెళ్లే వాళ్ళట! వెళ్లి అక్కడి ప్రదేశాన్నంతా పరిశీలించి చూసి గుడి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేశారట వద్దు వద్దు అంటున్నా గుడి కట్టించినందుకు మంచిగా ఉన్నవాళ్లు రక్తం కక్కుకొని చనిపోయారు అని చెప్పేవాళ్ళు . ఇది నిజమో కాదో తెలియదు. నా మనసులో ముద్ర వేసింది. పునరుద్ధరణ లేకుండా ఇప్పటికీ అలాగేవుందా దేవాలయం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి… ఏంటంటే, ఒక అయ్యగారు, అమ్మగారు ఉండేవాళ్ళు వాళ్ళు ప్రారంభంలో మా ఇంట్లోనే వంట చేసేవాళ్ళట! మా అమ్మ వచ్చిన తర్వాత , మన వంట మనమే చేసుకోవాలి వాళ్ళు చేయడమేంటి అని వంట ఇంటి బాధ్యతను తనే తీసుకున్నదట!! ఈ అమ్మగారు అయ్యగారికి ఉద్యోగం పోయి బ్రతుకుతెరువు పోతే యెట్లానని వాళ్లకు డబ్బులు తప్పకుండా ఇచ్చేది. మేం వీళ్ళ ను అమ్మగారత్తయ్య, అయ్యగారుమామయ్య అనేది. వీళ్ళ కు ఇల్లుకట్టించిచ్చారు. వీళ్ళు ఒక అమ్మాయి ని పెంచుకున్నారు. అమ్మగారు పాప అనేవాళ్లం. వీళ్ళ ఇంట్లో కుంకుడు చెట్టు ఉండేది . మా అమ్మ వాళ్ళ దగ్గరనే కొనేది .

ఊరూరా పండుగలు జాతరలూ జరపుతుంటారు కదా? మా ఊళ్ళో కూడా బతుకమ్మ పండుగ, బోనాల జాతర , పీరీల పండుగ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. తెలంగాణ లో ప్రతి ఇల్లూ ఆడబిడ్డతో కలిసి అత్యంత వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.

చిన్నపెండ్యాల కూ పెద్ద పెండ్యాల కూ మధ్య లో ఒక వాగు పారుతుంది. దీన్ని ” ఆకేరు వాగు” అనేవాళ్ళు. ఈ వాగుకు దగ్గరలోనే ఒక పెద్ద పుట్ట ఉండేది నాగుల చవితి రోజు మేమంతా వెళ్లే వాళ్ళం అమ్మ , ఆయమ్మ వాళ్లు ( పెద్దమ్మలు, ఆమ్మలు, పెద్దాయి అనీ కూడా అంటాం) , చిన్నమ్మ వాళ్ళు అందరూ ఆ పుట్టలో పాలు పోసేవాళ్ళు. కళ్ళు, ముక్కు, చెవులు రూపులు చేయించి పుట్టలో వేసే వాళ్ళు.

“నాగుల చవితికి నాగేంద్ర నీకూ… పొట్ట నిండా పాలు పోసేము తండ్రీ….
నీ పుట్ట దగ్గిరకి మా పాప లొచ్చేరు…
పాప పుణ్యాల వాసనేలేని బ్రహ్మ స్వరూపులైన పసికూనలోయి..
కోపించి బుసలు కొట్టబోకోయి…” అనే పాటను అందరూ హారతి పడుతూ పాడేవాళ్లు. ఎంత గొప్ప పాట ! ఇదంతా సాహిత్య వికాసమేకదా? ఆధ్యాత్మికం … ఆలోచనాత్మకం!! పర్యావరణ చైతన్యానికి సూచిక కదా!!! ప్రకృతి లోని చెట్టు నూ పుట్టనూ పక్షులనూ, జంతువులనూ , పంచభూతాలనూ దేవతలుగా కొలవడం అనే ఆచారాన్ని జీర్ణించుకున్న తరం మాది అని అనుకోకుండా ఉండగలమా? ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకలు పండుగలు. వాగు మనిషి జీవితంలో కనిపించే కాల ప్రవాహం! పెద్దయ్యాక, అమ్మనయ్యాక నా పిల్లలకూ, ఉపాధ్యాయినిగా బడిలో పిల్లలకూ మా బాల్యం లో చవిచూసిందే చెప్పాను. మనం ఎలా, ఏం చెబుతున్నామనే స్పృహ ఉంటే చాలు కదా!

ఆ రోజు అక్కడి పుట్టమన్ను ను తీసి అందరి కళ్ల మీద, చెవులమీద , నుదుటిమీద రాసేవాళ్ళు. సహజంగానే మేమంతా ప్రసాద భక్తులమాయె ! దైవభక్తి, భయమూ కూడా ఉండేవి సుమండీ!! ఎంత శ్రద్ధగానో దండం పెట్టుకునేది. పుట్ట దగ్గర ఇంకో విశేషమున్నది…. ఒక పెద్ద జారుడుబండ ఉండేది! అది మాకు అట్రాక్షన్ ! పోటీలు పడి జారేవాళ్ళం, జారుడాట ఆడేవాళ్ళం !! అక్కడే ఒక పెద్ద చెట్టు ఉండేది, ఆ చెట్టుకి ఉయ్యాలలూగేది. పెద్దవాళ్ళు పూజలు చేసినంతసేపు ఆటలే ఆటలు!! తర్వాత ప్రసాదాన్ని తిని, ఇంటికి వచ్చేవాళ్ళం . చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఆ వాతావరణమంతా! అమ్మ ఆ రోజంతా ఉపవాసం ఉండేది.

ఈ వాగు ఊరికి వెనుకవైపున ఉంటుంది. ఊరంతా మెయిన్ రోడ్డు , అంటే హైదరాబాద్ వరంగల్ హైవే వైపు కు పెరిగింది. ఈ వాగు కూ మా బాల్యానికీ ఇలా దగ్గరి సంబంధం ఉంది.
‘నాగమయ్య పండుగ‘ తోనే కాదు ఇది బతుకమ్మ తోనూ ముడిపడి ఉంది. తంగేడు పువ్వులు, గునుగు పూలు, కట్ల పూలు ఒకటా రెండా ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో అందంగా బతుకమ్మ లను పేరుస్తారు.

పెత్రమవాస్య నుండి సద్దుల వరకు ప్రతిరోజు బతుకమ్మలు పేర్చేది. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ. మొదటిరోజు ఆంజనేయ స్వామి గుడిలో బతుకమ్మ నిర్వహిస్తే, సద్దుల రోజు చివరి రోజు అయిన సద్దుల రోజు కుంట కట్ట దగ్గర ఆడుకునేవాళ్ళం, ఆ గార్లకుంట అనే పేరున్న కుంట నీళ్లల్లో నిమజ్జనం చేసే వాళ్ళం . కానీ రెండవ రోజు నుంచి చివరి రోజు వరకు ప్రతిరోజు ఈ ఆకేరువాగు దగ్గరికే వెళ్లి బతుకమ్మను ఆడుకునేవాళ్లం . నీళ్ళ ల్లో వదిలేవాళ్లం. ఎంత సరదానో…! ఎన్నెన్ని కబుర్లో!! వివేక , వికాసాలు వెల్లివిరిసిన రోజులు!!!

బతుకమ్మ పండుగ లో ఆరో రోజు ను “అర్రెం” అంటారు. కేవలం ఆ ఒక్కరోజు బతుకమ్మ ఆడేవాళ్ళం కాదు. బతుకమ్మ అంటేనే పూల పండుగ, పాటల పండగ . ఎన్ని పాటలు పాడే వాళ్ళమో! ఆ పాటలను చూసి చదివి నేర్చుకున్నది లేదు , ఎవరైనా కూర్చోబెట్టి నేర్పించిందీ లేదు ! అలా అలా … విని నేర్చుకున్నవే . పాడీ పాడీ చక్కగా స్పష్టంగా రాగయుక్తంగా పాడడం వచ్చేసింది.
“సాధనమున పనులు సమకూరు ధరలోన!” వేమన చెప్పిందెంత సత్యమో కదా!

రచయిత్రినయ్యాక విజ్ఞాన దాయకమైన ఈ బతుకమ్మ పాటలు అజ్ఞాత కతృత్వమని, స్త్రీల భావ ప్రకటన గొప్పతనానికి ఓ మచ్చుతునక అని, సామూహికంగా జరుపుకునే పాటల ఉత్సవమని వ్యాసాలెన్నో రాసాను. చిన్ననాడు ఏమీ తెలియకున్నా … ఎంతో ప్రేమగా ఆడుకున్న ఆ జ్ఞాపకాలతోబాటు ఇష్టంగా రాసాను !! “బతుకమ్మ పండుగ” అంటే నాకెంతో ఇష్టం.

సాయంత్రం డప్పు చప్పుళ్ళు మోగాయంటే ఇక మా హడావిడి ఇంతా అంతా కాదు! ప్రప్రథమంగా మా ఇంటికి వచ్చి డప్పు కొట్టి యాత్ర ప్రారంభించేవాళ్లు . మా అమ్మ పెద్ద బతుకమ్మ ను తీసుకొని బయలుదేరాలి, అలా కచ్చీరు దగ్గరికి వెళ్ళాలి అక్కడికి మిగతా అందరూ వచ్చేవాళ్ళు. చాలా ఎత్తుగా, పెద్ద బతుకమ్మ పేర్చేవాళ్ళు . అది జీతగాళ్ళు పట్టుకొని వచ్చేవాళ్ళు. అమ్మ పెద్ద బతుకమ్మ లేపి అతనికి ఇచ్చేది . ఇలా ఈ సంప్రదాయం నా చిన్నతనమంతా కొనసాగింది. తర్వాత తర్వాత చిన్నగానే పేర్చేవాళ్లం.

కుంట కట్ట దగ్గర రంగురంగుల వస్త్రాలతో సీతాకోకచిలుకల్లా ఆ దృశ్యం అంతా పూలవనం లా ఉండేది. ఎక్కడిదో పెళ్లి నాటి పట్టు చీరలను పెట్టెల్లోంచి తీసి దులిపి కట్టుకొని వచ్చేవాళ్ళు ఆడవాళ్లు. కొనగలిగినవాళ్లు కొత్త చీరలతో వచ్చేవాళ్ళు. ఇక మేము పిల్లలమంతా లంగా జాకెట్లు వేసుకుని పూల జడలతోనూ, చేతుల నిండా గాజులు , అందమైన బొట్టు పెట్టుకుని అలంకరించుకొని అమ్మల పక్కన నడుస్తూ చిన్న బతుకమ్మ, తోడు బతుకమ్మను తీసుకొని పోయేవాళ్ళం.

నేను నా స్నేహితులం అంతా ఒక బ్యాచ్ గా గుండ్రంగా పెద్దవాళ్ల బ్యాచ్ లో కాసేపు ఉండి , తరువాత మా గ్రూప్ ఆట పాటలు ప్రారంభించే వాళ్ళం.
” బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో…” అనీ,
” ఇద్దరక్క చెల్లళ్లను ఉయ్యాలో/ ఒక్కూరికిచ్చిరీ ఉయ్యాలో/ ఒక్కడే మాయన్న ఉయ్యాలో ఒచ్చన్నబోడాయె ఉయ్యాలో….” అనీ,
” జనకు జనకూనింట్లా కోల్ సాజనకూనింట్లా కోల్/ పుట్టింది ఆ సీతా కోల్ పురుడూ గోరింది కోల్/…” అనీ,
“శ్రీమంతూనింట్లోగ పుట్టి/ శ్రీమంతూనింట్లో పెరిగి …/… మాయమ్మా లక్ష్మీ దేవి పోయూరావమ్మా” అనీ .. ఈ పాటలెన్నో గొంతెత్తి పాడితే అందరూ అనుకరిస్తూ పాడుతుంటారు. వాళ్ళ కూ వస్తాయి. కానీ … ఇది ఒక నియమబద్ధంగా సాగే గాన వినోదం! పైగా స్పష్టం గా , తప్పులుబోకుండా, సిగ్గు పడకుండా ధైర్యంగా ఎవరు పాడగలరో వాళ్లను పాడమనడం సభ్యత గా భావిస్తారు.

అందరివి అయిపోయాక కురుమోండ్లు ఆడే ఆట దగ్గరికి వెళ్లి అందరం నిలబడి చూసేవాళ్ళం . అదిగో కులాలకు అతీతంగా అంటూనే పలానా కులం అంటున్నారేంటి అనే మీమాంస వద్దు. ఎందుకోగాని కురుమోండ్లు లేట్ గా వచ్చి వేరుగా ఆడేవాళ్ళు. కారణం ఏంటో? కానీ వీళ్లతో ఉయ్యాల బాగా ఒంగవచ్చినోళ్లు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ వలయాకారంలో తిరుగుతూ ఆడేవాళ్లు. వాళ్ళ స్పీడ్ ను అందుకోవడం సులభం కాదు. ఎందుకంటే వాళ్లు ఆడినంత బాగా ఎవరు ఆడక పోయేవాళ్ళు లయబద్ధంగా ఒకే విధంగా ఒంగుతూ , లేస్తూ…అడుగులు క్రమ పద్ధతిలో కదుపుతూ , పాటకు శృతి కలుపుతూ …. రాగ, తాళ , భావ యుక్తంగా “రామరామ రామ ఉయ్యాలో… శ్రీ రామ రామ ఉయ్యాలో…” అంటూ పాటను అద్భుతంగా పాడుతూ ఆడేవాళ్లు. ఆ దృశ్యం ఇంకా కళ్లల్లాడుతోంది! ఇదొక్కటే చాలు బతుకమ్మ పండుగ సంస్కృతి ఓ జీవన చక్రం అని పోల్చడానికీ, గొప్ప ఉదాహరణ అనడానికి! ఈ రోజు లలోని డి. జె. పాటలు , ఎగురుళ్లు దునుకుళ్లూ లేవు. ఒకళ్ళు చెబుతుంటే అందరూ విని పాట పాడడం ! అంటే దీనితో ధారణా శక్తి పెరుగుతుంది, పాటలలోని భావం , పదాలు తెలుస్తాయి. దీనితో భాషా జ్ఞానం ఇంప్రూవ్ అవుతుంది. ఈమధ్య కాలంలో సైంటిఫిక్ రీజెన్స్ ఎన్నో చెబుతున్నారు.. వంగి లేస్తూ చప్పట్లు కొడితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అని.. మనమే పాడుతూ ఆడుతుంటే పాటల్లోని నిగూఢ అర్థం మనసుకెక్కుతుంది. కొంతనైనా కమిట్మెంట్ అనేది తెలుస్తుంది. దీనికి ఉదాహరణ గా నాకైతే ఒక పాట గుర్తుకువస్తుంది…

” ఒకటో మాసం నెలతన గర్భిణి ఏమి కోరినాదే చెలియా ఏమి కోరినాదే చెలియా?./
ఒకటో మాసం నెలతన గర్భిణి ఓనగాయలడిగే చెలియా ఓనగాయలగిడే చెలియా….” అంటూ సాగుతుంది. పదినెలలకు పాప ను ఒడిలో చూసుకునేవరకు ఏ నెలలో ఏమేమి తినాలో చెప్పడానికి ఓ పాట! దీంట్లో గర్భిణీ స్త్రీలకు కోరికలుంటాయి వాటికి విలువ ఇవ్వాలని చెప్పడం అనే ప్రథాన ఉద్దేశ్యం అని నాకనిపిస్తుంది. ఇలాంటివే చాలా ఉన్నాయి.

సోషల్ ఇన్వాల్వ్మెంట్ స్వచ్ఛందంగా ఉంటుంది. ఎంత గొప్ప సంప్రదాయం !! ఆ పాటల భావం ఎంత బాగా వాళ్ళు వంట పట్టించుకున్నారు కదా అని ఇప్పుడు ఆశ్చర్య పడుతుంటాను.
అన్ని పాటలయ్యాక, “పోయిరా గౌరమ్మ పోయిరావమ్మా మళ్లీ ఈనాటి కి మళ్లీ రావమ్మా..” అని పాడుతూ గౌరమ్మ ను ఒక స్థాంబాళంలోని నీళ్లల్లో ఓలలాడించి , బతుకమ్మలకు దీపాలను వెలిగించి,, కుంటలోని నీళ్ళ ల్లో వేసేవాళ్ళు . అంటే అమ్మాయి అత్తారింటికి వెళ్లినా మళ్లీ పుట్టింటికి రావాలని కోరుకోవడమన్నట్టు. కోడళ్ళు వాళ్ళ తల్లిగారింటికి వెళ్తారు . ఇదొక సత్ సాంప్రదాయం. ఈ సభ్యతా సంస్కారాలు చిన్నప్పటి నుంచే ఎరుకవుతాయి! పాటలుపాడతూ చేసే ఈ నిమజ్జన కార్యక్రమం నన్ను చాలా ఆకర్షించింది.

నా చిన్నతనంలో జరిగిన ఒక విషయం ఇప్పటికీ గుర్తుకొస్తే ఒళ్ళు జలదరిస్తుంది . నా నాలుగు ఐదు ఏళ్ల వయస్సు లో అనుకుంటా ఒకసారి బతుకమ్మను నీళ్లలో వదలడానికి బుచ్చయ్య వెళ్ళినప్పుడు అతనికి వెనకాల నేనూ వెళ్ళా ( నట!) . అతను చూసుకోలేదు. ఇంకేముంది? మునిగాను . ఒడ్డున ఉండి ఇదంతా చూస్తున్న మా అక్కయ్య గట్టిగా అరిచేసరికి , అది విని , చూసి నేను కనిపించలేదుగాని నా లంగా నీళ్లలో కనిపించేసరికి బుచ్చయ్య తొందరగా నన్ను పైకి లేపాడట! నీళ్లు మింగాననీ, ఇంకాస్త అయితే ప్రాణం పోయేది అని అమ్మా, అందరూ ఎన్నోసార్లు చెప్పుకున్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తు.
బతుకమ్మ నిమజ్జనం అయిపోగానే ఒకళ్ళకొకళ్ళు పసుపు బొట్టు పెట్టుకునేవాళ్ళు, ప్రసాదాలు వాయినాలు ఇచ్చుకొని తినేవాళ్లు చిన్నంతరం పెద్దంతరం అన్న భేద భావమే లేదు. స్త్రీ ల ఐక్యతా భావానికి ప్రతీక. రాత్రి అయ్యాక అందరం సిబ్బులు , పళ్లాలు చేతిలో పట్టుకొని,
” ఇసుకలబుట్టే గౌరమ్మ.. ఇసుకల పెరిగే గౌరమ్మ
ఇసుకల వసంతమాడేనా ..
పొన్నాగంటి తాళ్లూ .. పోకల వంటి వనమూ
వనముల చిలుకలు ఆడే గౌరీ వాడంతా మురిసే గౌరి వాడంతా కదిలే” అంటూ ” పసుపుల బుట్టే గౌరమ్మ”, అనీ ” కుంకుమల బుట్టే గౌరమ్మ” అనీ పాట సాగుతుంది. ఇలా గౌరమ్మ ఇసుకలో, పసుపు లో , కుంకుమలో పుట్టడం అనేది బతుకమ్మ సంస్కృతి లో ఓ గొప్ప మెరుపు! ఇలా ఎన్నెన్ని పాటలు? పాట పాట లో ఆడవాళ్ళు , కుటుంబమూ వస్తుండడం ఎంతో కళాత్మకంగా ఉంటుంది. అలా పాటలు పాడుకుంటూ , మిగిలిన ప్రసాదాలు తినుకుంటూ ఇల్లు చేరే వాళ్ళం. ఎక్కడా కృతకం అన్నదే లేదు ! అంతా సహజంగా , అందంగా , ఆనందంగా ఉండేది!

ఎంతమంది స్త్రీలు ఇళ్లల్లో జరిగిన కష్టాల కన్నీళ్లను కనురెప్పల కింద దాచుకున్నారో నాకు ఆ వయస్సులో తెలియదు కానీ… ఆ పది రోజులైనా , ఆ కొద్ది రోజులైనా అన్నీ మరిచిపోయి తల్లిగారింటికి వచ్చి ఆడపిల్లలు గడపడం అనేది తెలంగాణ సంస్కృతికి ఒక చిహ్నం! “బతుకమ్మ- ఆడోళ్ళు” అనే కవితలో ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు రాసాను. 2021 లో ప్రచురించిన “కాల ప్రభంజనం” అనే నా కవితా సంపుటి లో చదవొచ్చు. ఇక ” ఎనిమిదో అడుగు” అనే కవితా సంపుటిలో “బతుకమ్మ” ను అస్తిత్వ చిహ్నంగా చెప్పాలనుకున్న సందర్భంలో…. మరో కవితలో ..
” తంగేడుకు బతుకమ్మకు / తరతరాల అనుబంధం / తలల తురుముకోకున్నా/ తరగని శోభకై తలకెత్తుకునే పువ్వు/ ……../ బతుకమ్మ కుంట ఒక సమ్మిళిత గ్రామ గంధం / ఊరూరి కలల పంట /మానవీయ చిత్రం / బతుకమ్మ ఒక స్వేచ్ఛా కేతనం” అనే కవితనూ రాసాను. పూల సమాహారం బతుకమ్మ.. ఇంతటి జీవవైవిధ్యం నింపుకున్న మన పండగ బతుకమ్మ! ఆడిపాడకున్నా పూలు తెచ్చిస్తూ, కుంట కట్టదగ్గరికి వెంట వస్తూ మగవాళ్ళు పరోక్షంగా పాల్గొనే బతుకమ్మ పండుగ ! మగువలకిష్టమైన పండుగ !!

స్త్రీలు కేవలం ఇంటికే చెందినవాళ్లా? కాదు ! స్త్రీలు సంస్కృతి ని మోస్తున్న కేంద్రాలు ! అటు తల్లి పాత్ర, ఇటు సంఘంలో పాత్ర . పండుగలలో స్త్రీల సామూహిక ఆత్మ నిబిడీకృతమై ఉంటుంది అనేది సాహిత్య విమర్శ లో భాగంగా నేర్చుకున్నాను.

ఇలా నా బాల్యపు జ్ఞాపకాలు, మా కుటుంబ విలువలను గురించి అయినా, పుట్టి పెరిగిన గ్రామీణ జీవనశైలిని గురించైనా, ఆనాటి సామాజిక వ్యవస్థ ఎట్లా ఉండేది అనే అవగాహన విషయమైనా ఎంతో చెప్పవచ్చు కానీ ఇంత చాలు ఇప్పుడు. అయితే , ఇలాంటిదే బోనాల జాతర . స్త్రీలకు సంబంధించిన పండుగ అంటేనే కుటుంబానికి సంబంధించిన పండుగ అన్నట్టు!! సమయానుకూలంగా సందర్భోచితంగా మనుముందు చెప్పుకోవచ్చు! కదా? మీరేమంటారు? మరి సెవెంత్ క్లాస్ తర్వాత నా చదువు పక్కూరికి వెళ్లాక ఎలా సాగిందో తెలుసుకుందాం! అంతదాకా సెలవ్!!

*****

( ఇంకా వుంది )

Leave a Reply

Your email address will not be published.