కనక నారాయణీయం -85

–పుట్టపర్తి నాగపద్మిని

‘ఏమి స్వామీ? బాగున్నారా?’

కాళిదాసు రఘువంశం కావ్య పఠనంలో ఏకాగ్రతతో మునిగి వున్న పుట్టపర్తి ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. తలెత్తి చూస్తే, ఎదురుగా, గజ్జెల మల్లారెడ్డీ, రాచమల్లు రామచంద్రా రెడ్డీ, వై.సీ.వీ.రెడ్డీ నవ్వుతూ కనిపించినారు.

‘ఒరె ఒరె! అందరూ ఒకేసారి కట్టగట్టుకోని వచ్చినారేమప్పా?’ నవ్వుతూ పలకరించారాయన.

గజ్జెల మల్లారెడ్డి, అక్కడే ఓ మూల ఉన్న చాపను తీసి కింద పరుస్తూ అన్నాడు,’ఎంతమందొస్తే ఏమి స్వామీ? నువ్వు తలెత్తి మమ్మల్ని చూడనే లేదే?’

ఫెళ్ళున నవ్వుతూ వై.సీ.వీ. అందుకున్నాడు,’మా సామి ఆ కావ్యాటవుల్లో విహరిస్తూ ఉంటే, ఎదురుగా సింహమొచ్చి నిలబడినా పట్టించుకోరులేబ్బా!’

వాళ్ళ ఈ పరిహాసాలను తానూ చిరునవ్వుతూనే స్వీకరిస్తూ పుట్టపర్తి అన్నారు,’అది సరేలేగానీ, ఇంతకూ ముగ్గురూ ఒక్కసారి నామీద దాడికి వచ్చినారెందుకప్పా?’

‘ఏమీ లేదు స్వామీ! మన గజ్జెల మల్లారెడ్డికి ప్రొద్దుటూరులో సన్మానం చేస్తామని ఒక ఆలోచన. మీరు కూడా వస్తే బాగుంటుందని, మీ దగ్గరికే వచ్చినాము ముందు.’ అన్నాడు వై.సీ.వీ.

‘చాలా మంచిదప్పా! నేను వస్తాను తప్పకుండా! ఇంకా ఎవరెవరొస్తున్నారు?’ ఉత్సాహంగా అడిగారు పుట్టపర్తి.

రా.రా. అన్నాడు.’శ్రీశ్రీ గారిని కూడ ఆహ్వానిస్తున్నాం.అయన అంగీకారం తెలిపితే డేట్ నిర్ణయించొచ్చు. మీరు శుభం అన్నారు కదా! ఇంక పనులు ముందుకు నడుస్తయిలెండి.’

పుట్టపర్తి ముఖాన చిరునవ్వు. ‘అదేముందప్పా? నా మాట మీద మీకంత నమ్మకమెందుకప్పా?’

వైసివీ అన్నాడు,’నానృషి: కురుతే కావ్యం.’ మీ శివతాండవం, మిమ్మల్ను ఋషిని చేసేసింది స్వామీ!ఋషివాక్కు నిజమౌతుదంట కదా! అందుకని!’

రా.రా. ముఖంలోనూ చిరునవ్వు.

పుట్టపర్తి అన్నారు,’ఋషినౌనో కాదో తెలీదు కానీ, ఆ నాటి మీవంటి స్నేహితులు ఉండేవారో లేదో కానీ, నాదీ ఆ అదృష్టం. కానీ ఇదుగో మీ రా.రా కైతే నా ధోరణి నచ్చదు కదా?’

గజ్జెల అన్నాడు,’భలేవారే స్వామీ! రా.రా. విమర్శ చేస్తున్నప్పుడు ఆయన కలం పదునైనదే కానీ మనసు మంచి కవిత్వానికి ఎప్పుడూ దాసోహమే కదా! మీ మేఘదూతం, రా.రా. కు ఎంతిష్టమో!’

పుట్టపర్తి ముఖాన ప్రశాంతత.

గజ్జెల కొనసాగించాడు.’అందులో, మీరు కారాగారంలో నిరుపేద ఖైదీ కడగండ్లు వర్ణిస్తూ, ఆ తల్లి ఆకలికి ఏడుస్తూ ఉన్న తన పిల్లవాడికి తన ఎండిన రొమ్ములోని పాలే తాగిస్తుందో, లేక తన రక్తాన్నే తాగిస్తుందో, ధనికులేమెరుగుదురు? అన్న మాటలు తనను కదిలిస్తాయని ఎప్పుడూ అంటూ ఉంటాడు తెలుసా మీకు?”

రా.రా.తల పంకిస్తూ అన్నాడు,’కానీ స్వామీ!’ ఆగిపోయినట్టు గమనించి పుట్టపర్తే అన్నారు,’చెప్పు రాచమల్లూ! అగిపోవద్దు.’ అని!

రా.రా. అందుకున్నాడు,’సామాజిక న్యాయం కోసం మీరు వ్రాసిన ఆ కావ్యంలో ప్రబంధ కవిత్వ వాసనలుండడం, నాకు నచ్చలేదు.’

పుట్టపర్తి ముఖాన సందిగ్ధత! ‘ఎక్కడప్పా?’

‘అక్కడక్కడా ..ఖడ్గతిక్కన కరవాల ధారలనుంచీ ఒక్కసారి, గొల్లెతల అందాలవైపు పుట్టపర్తి కలం..’భళ్ళున నవ్వుతూంటే, వై.సీ.వీ రా.రా. ముఖాల్లో ఎటూ తోచని సందిగ్ధత.

ఆసక్తిగా వింటున్న పుట్టపర్తి ముఖాన తేటదనం.

‘ఏమోరా మల్లారెడ్డీ! రా.రా. మాటల్లో నిజముందేమో! ప్రబంధ సాహిత్యాన్ని బాగా మధించిన అలవాటు అక్కడ నాతో ఆ మాట పలికించి ఉంటుందేమో అ కవితా ధారలో ఆ విధంగా దొర్లినా, నేను దాన్ని తొలగించలేదు నిజయితీగా! నా నేపధ్యం కూడ చదువరికి తెలియవలె కదా!’

రా.రా. చప్పట్లు కొడుతూ అన్నాడు,’మా వంటి విమర్శకులకూ కొంతైనా పని కల్పించవలె అని మీ ఉద్దేశమేమో గానీ, పంటికింద రాయి మాదిరి అనిపిస్తుంది స్వామీ, ఇటువంటి చోట్ల!’

‘పోనీలేప్పా! మా వంటి కవుల శక్తినే కాదు ఇటువంటి బలహీనతలను కూడ అంగీకరించే మీవంటి సహృదయ పాఠకులుండడం మా అదృష్టం. ఇంతకూ మీరు వచ్చిన సంగతిదేనా? ఇంకా ఏమైనా..”

‘అదే స్వామీ! ఇంక మేము బయలుదేరుతాము.’

‘అదేమప్పా! కాఫీ గీఫీ..!

‘ఏమీ వద్దులేండి. ఇంకో చోటికి కూడా పోవల..’

ముగ్గురూ లేచారు.

వారిని సాగనంపేందుకు పుట్టపర్తి కూడ కలిసి నడిచారు.

***

చిన్నారి నాగకు ఒకటే ఉత్సాహంగా ఉంది.

అమ్మ, బంధువులతో కలిసి అటూ ఇటూ ఉన్న అంగళ్ళలో బొమ్మలూ, దేవుళ్ళ పటాలూ, తాటి ఆకులతో చేసిన బుట్టలూ, చెక్క బొమ్మలూ వంటివి బేరమాడుతూ ఉంటే, తాను మాత్రం, ఆ చిన్న ఇరుకు సందుల్లో పక్క పక్కనే ఉన్న అంగళ్ళూ, వాటిలో కనిపిస్తున్న అనేక వస్తువులూ, అద్దాల ఫ్రేముల్లో అమర్చిన దేవుళ్ళ పటాలూ..సవరాల షాపులూ..అదేదో అద్భుత ప్రపంచంలో ఉన్నట్టే కలియదిరుగుతూ ఉంది.

మధ్యలో అమ్మా, తమ చుట్టాలేమి చేస్తున్నారో గమనిస్తూ, మళ్ళీ చురుగ్గా, చుట్టూ పరికిస్తూ ఉంది నాగ.

ఎటు చూసినా గుండు కొట్టించుకున్న తలలే! ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా గోవింద! అన్న నామస్మరణలే! నుదుటినిండా నామాలే! ఏడుస్తున్న పిల్లలను, భుజాల మీద ఎత్తుకుని నడుస్తున్న పెద్దవాళ్ళను చూస్తుంటే భలేగా ఉంది తనకు!

అక్కయ్యా వాళ్ళ బంధువులతో కలిసి తిరుమలకొస్తున్న కనకమ్మ వెంట నాగ కూడా బయలుదేరిందిప్పుడు. గుడిపాటవ్వ, రాధమ్మను తాను చూసుకుంటానంటే ఆమె దగ్గర వదిలి వచ్చిందామె! కడప నుండీ బస్సులో నాలుగైదు గంటల ప్రయాణం తిరుపతికి! అక్కడ మరో దూరపు బంధువులింట్లో సామాను పెట్టేసి, ఇదిగో ఏడుకొండలయ్య దర్శనం కోసం తిరుమలకు వచ్చినారందరూ!

బంధువులంతా , తిరుమణి పొట్లాలూ, చెక్క బొమ్మలూ, ఇంకా ఏవేవో కొనుక్కుందామనుకుంటుంటే, కనకమ్మ అన్నది,’అది కాదమ్మా! ముందు పుష్కరిణిలో మునిగి, తరువాత వరాహ స్వామి దర్శనం, తరువాత స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి, ఆ తరువాత కొనుక్కుంటే, ఇంక కొండ దిగొచ్చు ఒకేసారి! ఒక గంటలో వచ్చేస్తాం కదా!’

ఆ మాటా నిజమేననుకుని, అందరూ పుష్కరిణి వైపుకు కదిలారు.

*****

  (సశేషం)

Leave a Reply

Your email address will not be published.