స్వచ్ఛమైన నీరు

-కందేపి రాణి ప్రసాద్

పిల్ల ఏనుగు తల్లి వెనకగా నడుస్తూ వెళుతున్నది. తల్లి కాళ్ళ సందున నడుస్తూ తల్లిని ఇబ్బంది పెడుతున్నది. ఒక్కోసారి తన తొండమే కాళ్ళకు అడ్డంపడి పడిపోతున్నది. కొత్తగా నడక నేర్చుకునే పిల్లలు ఎలా అవస్థ పడతారో అలా అవస్థ పడుతున్నది. తల్లి ఏనుగు ప్రేమగా నడక నేర్పిస్తున్నది. ‘అమ్మా నీళ్ళు కావాలి’ అని పిల్ల ఏనుగు తల్లి కాలును పట్టుకుని అడిగింది. తల్లి చుట్టూ చూసింది దగ్గర్లో ఏవరు కనిపించలేదు.

‘కొద్దిగా ముందుకు వెళ్లి చూద్దాం’ అని తల్లి ఏనుగు ముందుకు అడుగులు వేసింది. నాకు దాహం! నాకు దాహం! అంటూ పిల్ల ఏనుగు మారాం చేసింది’ చూస్తున్నాను ఉండమ్మా అంటూ తల్లి ముద్దుగా చెప్పింది.

కొంచెం దూరం ముందుకు వెళ్ళాక ఒక కాలువ కనిపించింది. ఆ కాలువలోని నీళ్ళు చాలా మురికిగా ఉన్నాయి. పిల్ల ఏనుగు సంతోషంగా ముందుకు పరుగెత్తింది. గబగబా ఆ నీటిని తాగటానికి ప్రయత్నించింది. తల్లి ఏనుగు అప్రమత్తంగా ఉండి గబుక్కున పిల్లను వెనక్కు లాగింది. పిల్ల ఏనుగు ధడాల్న వెనక్కు వచ్చి పడింది.

‘ఏం నీకు బుద్ధుందా! నీళ్ళు ఎలా ఉన్నాయో చూడవా? పరమ మురికిగా ఉన్నాయి. ఆ నీళ్ళు తాగకూడదు. ఆ నీళ్ళలో కాలుష్య పదార్థాలు ఉంటాయి. అదుగో అక్కడ చూడు ఒక ఫ్యాక్టరీ కనిపిస్తున్నదా’ అని తల్లి తన తొండం చాచి చూపించింది.

పిల్ల ఏనుగుకు కోపం వచ్చింది. నీళ్ళు తాగేంతలో అమ్మ లాగి పడేసిందని ఉక్రోపంగా ఉన్నది. ఇప్పుడు అమ్మ ఫ్యాక్టరీని చూడమని చెబుతోంది. అటువైపు చూసింది. దూరంగా పొగ గొట్టంలో నుంచి పొగ వస్తోంది. ‘ఆ అయితే ఏమిటి ?’ అని కొంచెం కోపంగా తల్లి వైపు చూస్తూ అన్నది.

తల్లి ఏనుగు “ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విష పదార్థాలు ఈ కాలువలోకి వదులుతారు. అంటే అవి విషంతో సమానం. పైగా ఎంత మురికిగా ఉన్నాయో చూశావా. అలాంటి నీరు తాగితే జబ్బులు వస్తాయి. జబ్బులు వచ్చి చనిపోతారు కాబట్టి శుభ్రమైన నీరు తాగాలి” అని పిల్ల ఏనుగుకు అర్ధమయ్యేలా చెప్పింది.

“అమ్మా వాళ్ళెందుకలా విష పదార్థాలు కలుపుతారు. అడవిలో జంతువులు తాగుతాయని తెలియదా? వాళ్ళసలు మనుష్యులేనా? మనందరం చనిపోవాలనే ఉద్దేశ్యమా?” కోపం స్థానంలో ఆవేశంతో ప్రశ్నించింది పిల్ల ఏనుగు.

“లేదమ్మా! మనల్ని చంపేయాలని కాదు. మనుష్యులకు నిర్లక్ష్యం ఎక్కువ. స్వార్ధం ఎక్కువ. ఎవరేలా పోతే నాకెందుకు అనే నిర్లక్ష్యం. మనం గ్రామానికి దగ్గరగా ఉండటం వలన మనుష్యులు ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. సమాజంలో రకరకాల స్వార్ధాలుంటాయి. మన జాగ్రత్త మాత్రం మనమే చూసుకోవాలి. పరిసరాలు చూసుకుని నీరు తాగాలి. అవి స్వచ్ఛంగా ఉన్నాయా లేక మురికిగా ఉన్నాయా కూడా గమనించాలి అంటూ తల్లి ఏనుగు చెబుతూ ఉన్నది.

“నాకీ విషయాలు తెలియవు కదమ్మా. అందుకే తాగబోయాను. ఇక తాగనులే. నాకీ విషవయాలన్నీ ఎవరు చెబుతారు.” అంటూ పిల్ల ఏనుగు తల్లి కాళ్ళను చుట్టుకున్నది.

“చూడు తల్లీ ప్రతి జీవికీ తల్లి ఉంటుంది. బిడ్డలకు మంచి చెడు తల్లే చెబుతుంది. బిడ్డలు కూడా తల్లి మాట జవదాట కూడదు. ఇంత పెద్ద అడవిలో అపాయాలు ఎలా ఎదురవుతాయో ఎలా తప్పించుకోవాలో నేర్చుకోవాలమ్మా. నువ్వు చిన్నదానివి కాబట్టి నేను నెమ్మదిగా నేర్పుతాను నువ్వు నేర్చుకోవచ్చు. సరే మంచి నీటి కోసం వెతుకుదాం పద.” తల్లి ఏనుగు ముందుకు దారి తీసింది. పిల్ల ఏనుగు తల్లిని అనుసరించింది.

కొంచెం దూరం నడిచాక ఒక కొలను కనిపించింది. ఆ కొలను దగ్గరకు వెళ్ళేసరికి చాలా కొంగలు నీళ్ళలో ఆడుతూ, ఎగురుతూ కనిపించాయి. నీళ్ళు స్వచ్ఛంగా అడుగున నాచుతో సహా కనిపిస్తున్నాయి. నీళ్ళ అడుగున చేపలు అటూ ఇటూ ఎగురుతూ ఆడుకుంటున్నాయి. తామర చెట్లు విశాలంగా అల్లుకుని వీటిపైకి ఆకులు విస్తరించి ఉన్నాయి. అక్కడక్కడా తామర పూలు వికసించి అందంగా కనిపిస్తున్నాయి. బాతులు కూడా నీటిలో ఈదుతూ కనిపించాయి. కొన్ని జింకలు నీళ్ళు తాగటానికి వచ్చి ఒడ్డున నిలబడ్డాయి. కప్పలు బెకబెకమంటూ తిరుగుతున్నాయి.

“చూశావా ఈ కొలను. ఇక్కడ ఎన్ని జంతువులున్నాయి చెప్పు. నీకు దాహం వేసినపుడు నీటి మడుగులు కనిపించినపుడు అవి మంచివా, కావా అని తెలుసుకోవాలంటే పరిసరాలు గమనించాలి. అక్కడ, వేరే జంతువులు ఏమైనా నీళ్ళు తాగుతున్నాయా లేదా అని చూడాలి. తరువాత ఆ నీటిలో కప్పలు, చేపలు వంటి నీటి జంతువులు నీటి అడుగున నివసిస్తున్నాయా గమనించాలి. నీకు ఇందాక చేపలు కానీ కప్పాలు కనిపించాయా” అడిగింది తల్లి ఏనుగు.

‘నిజమేనమ్మా! అక్కడ చూసిన నీరు మట్టితో కలసిపోయి చిక్కగా బురదవలె ఉన్నది. ఇక్కడ నీరు స్వచ్ఛంగా ఉన్నది. అక్కడ ఒక చెట్టు కూడా లేదు. ఇక్కడ తామర పూలు పూస్తున్నాయి కదమ్మా అంటూ అడిగింది పిల్ల ఏనుగు.

శభాష్ తల్లీ! చూశావా ఆ చెరువులో తామరపూలు లేవు. ఈ చెరువులో తామరలు ఉన్నాయి. అని నీకే అర్ధం అయింది కదా! తామరలు ఎందుకు పూయలేదు అంటే ఆ నీరు బురదగా ఉండి విష మయమై ఉంది కాబట్టి చెట్లు మొలవ లేదు. నీరు మంచిదైతే చాలా నీటి చెట్లు మొలుస్తాయి. మనకు చెరువులు, కుంటలు వంటివి కనపడినపుడు అందులో చెట్టు చేమలు ఉన్మాయా అని పరిశీలించాలి. దానితో తెలుస్తుంది. అలాగే ఇక్కడ జింకలు నిలబడి ఉన్నాయి చుశావా! అవి దాహం తీర్చు కోవడానికి వచ్చాయి. అంటూ తల్లి ఇంకా చెబుతుండగానే పిల్ల ఏనుగు ఉత్సాహంగా ముందుకు వచ్చింది.

“నేను చెబుతా నేను చెబుతా! ఇక్కడ కొలనులో కప్పలు బెకబెకమంటూ తిరుగుతున్నాయి. చేపలు ఆడుకుంటున్నాయి. కొంగలు ఎగురుతున్నాయి. ఒంటి కాలు మీద నిలబడి ధ్యానం చేసుకుంటున్నాయి. ఇందాకటి కాలువలో ఇవన్నీ లేవు!. నాకు అంతా తెలిసిపోయింది. నాకంతా అర్థమయింది” అంటూ పిల్ల ఏనుగు హుషారుగా చెప్పింది.

తల్లి ఏనుగు సంతోషంతో తన తొండంతో పిల్ల ఏనుగును దగ్గరకు తీసుకున్నది. ” చాలా బాగా అర్ధం చేసుకుంటున్నావు. ఇప్పుడు అర్ధం అయిందా. నీళ్ళా ఎవరైనా తాగుతున్నారా లేదా అని చూసుకోవాలి. దానితో పాటు నీటిలో ఏవైనా జంతువులు నివసిస్తున్నాయా అని చూసుకోవాలి. అప్పుడే ఆ నీరు మంచిదా కాదా అన్న విషయం తెలుస్తుంది. ఇంకోక విషయం దాని రూపం రంగు కూడా చూసుకోవాలి. సరేనా అని సంతోషంగా చెప్పింది.

చాలా అర్థం అయిందమ్మా ఇక ఎప్పుడూ మురికి నీరు వైపు చూడను. స్వచ్ఛమైన నీటినే తాగుతాను. పరిసరాలు చక్కగా పరిశీలిస్తాను. అని తల్లితో చెప్పింది. తల్లి ఏనుగు పిల్లను పట్టుకుని ఈ రోజుకు ఈ పాఠం చాలు రోజుకొక పాఠం చెపుతాను చక్కగా నేర్చుకో అంటూ ముందుకు సాగిపోయింది,

*****

Leave a Reply

Your email address will not be published.