
నడక దారిలో-71
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు సాహిత్యం , సంగీతం, బొమ్మలు సాధన. మా వివాహం. పల్లవిజననం.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారి స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి అమెరికాలో పాప జన్మించటం, , . హైదరాబాద్లో పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ పోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది.నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేక తెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం.డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం ,వీర్రాజుగారికి బోయి భీమన్న,బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ,నాకు అమృతలత అపురూప పురస్కారం,ఆషీ కాలేజీ ప్రహసనాలూ,పల్లవికి కరోనా వచ్చి తగ్గటం,వీర్రాజుగారి పెయింటింగ్స్, సేకరించిన ఆర్ట్ పుస్తకాలు రాజమండ్రి దామెర్ల చిత్రకళా పరిషత్తులో అంకితోత్సవం , కుందుర్తి శతజయంతిప్రతిభా పురస్కారాలు ఎంపిక,వసుధ ఎంగేజ్మెంట్,సుశీలా నారాయణరెడ్డి అవార్డు,మరో రెండు నెలలకే వీర్రాజుగారుఅనారోగ్యంతో మరణించారు. తర్వాత—)
***
వీర్రాజుగారి శ్రద్ధాంజలి కార్యక్రమం అయిపోయిన తర్వాత బేంకులకూ,పెన్షన్ ఆఫీస్ కు తిరిగి అన్నీ ఒక కొలిక్కి తీసుకుని రావటానికి రోజూ పల్లవీ ,నేనూ వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని మరణాలు కొందర్ని దూరం చేస్తాయి.కొందర్ని దగ్గర చేస్తాయి.ఇప్పుడు కూడా అదే జరిగింది.ఆయన వున్నప్పుడు సన్నిహితంగా వున్నవాళ్ళు కొందరు ఎందుచేతో దూరం అయిపోయారు.కొత్తగా కొందరు ఆత్మీయులు అయ్యారు.
బ్రహ్మానందనగర్ కాలనీ నుండి ఒక ఇద్దరు వచ్చి “ఇల్లు అమ్ముతున్నారా? “అని అడిగారు.”అమ్మినా,అద్దెకి ఇచ్చినా మాకు చెప్పే చేయండి”అన్నారు.ఇంటి మగవాడు చనిపోతే ఆ ఇంటిపెత్తనం ప్రతీ ఒక్కరూ తీసుకోవాలనే చూస్తారు అనుకుంటాను.అప్పుడే మేము ముగ్గురం దృఢంగా వుండి ,ఏ విషయాన్నైనా నిర్ణయాధికారం ఎవరిమీదా ఆధారపడకుండా మేమే చేసేలా వుండాలని మేము నిర్ణయించు కున్నాము.
వీర్రాజుగారికి దశదిన కర్మకాండలు చేయకపోవటం వలన కాబోలు చిట్టివాళ్ళింట్లో అవసరమైనప్పుడు వంటలకూ వాటికి సాయం చేసే లలిత అనే ఆవిడ పూజచేసి దానం అదీ చేయకపోతే మంచిదికాదని అందిట.అందుకని చిట్టి వాళ్ళింట్లో శాస్త్రోక్తంగా పూజ చేసి (లలిత) చాకలిదంపతులకు బట్టలు,వంటదినుసులు దానాలు చేసాడు. పల్లవిని రమ్మని ఫోన్ చేసి వండినవి ఇచ్చారు.ఒకరోజు మమ్మల్ని కూడా భోజనానికి పిలిచి బట్టలు పెట్టారు.ఇక మధ్య మధ్యబంధువులు భోజనాలకి పిలచి ముగ్గురికీ బట్టలు పెట్టటం కొంచెం ఇబ్బంది కరంగా అనిపించింది.ప్రేమతో అయితే పర్వాలేదు.కానీ కొందరు ఆబ్లిగేషన్ గా ఆహ్వానిస్తేనే కష్టంగా వుంటుంది.
మేము తాజ్ లో కార్యక్రమం చేసినప్పుడు పెద్దన్నయ్య మనవరాలి వోణీ పంక్షన్ అయిందట.అది అయిన తర్వాతైనా నన్ను పలకరించటానికి రాకపోవడం నన్ను బాధ పెట్టింది.నిజానికి ఏనాడో పేరుకి మాత్రమే వాళ్ళని తోబుట్టువులుగా పరిగణించి వదిలేసాను.ఇప్పుడిక బాధపడటం ఎందుకు అని మనసులోంచి తుడిచేసాను.
కుందుర్తి శతజయంతి సందర్భంగా ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాల జూమ్ సమావేశం ప్రక్రియ మళ్ళా మొదలు పెట్టాము.వాట్సాప్ సమూహంలో పురస్కారాలకు ఎంపిక చేసిన వారిగురించి రోజుకొక పరిచయం పోష్టు చేసాను.సమావేశంలో వారిగురించి మాట్లాడే వక్తలకు తెలియజేసాను.
కుందుర్తి శతజయంతి ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతిభా పురస్కారాలు జూలై పదహారు సాయంత్రాన జూమ్ అంతర్జాల వేదికలో సుధామగారి అధ్యక్షతలో జరిగింది. ఈ పురస్కారాల నేపథ్యాన్ని, వీర్రాజుగారు వున్నప్పుడు జరగాల్సినది అనివార్యంగా వాయిదా పడటం గురించి చెప్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యాను.
పురస్కారగ్రహీతలైన అడిగోపుల వెంకటరత్నం కవిత్వం గురించి కొండ్రేడ్డి వెంకటేశ్వరరెడ్డి,దాట్ల దేవదానం రాజు కవిత్వం గురించి శిఖామణి,రాధేయ కవిత్వం గురించి సుంకర గోపాల్ ,దేవరాజు మహారాజు కవిత్వం గురించి ప్రసాద మూర్తి,సీతారాం కవిత్వం గురించి వంశీకృష్ణ , అనిశెట్టి రజిత కవిత్వం గురించి జ్వలిత మాట్లాడగా పురస్కార గ్రహీతల స్పందన అనంతరం జూమ్ లో పాల్గొన్న కవులు ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కొనసాగించాలని కోరారు.కానీ నేను వీర్రాజు గారి అభిమతం మేరకు అంగీకరించలేదు.నేనూ, కుందుర్తి శాంత,కవిత ముగ్గురు మహిళల నిర్వహణలో కుందుర్తి కవిత వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది.
వసుధ పెళ్ళి పనులకు ముందే మేము. కళ్యాణ్ కోరిక మేరకు కోరుకొండ విజయనగరం వెళ్ళివచ్చాము.మధ్యలో రంజనా దగ్గరకు వైజాగ్ కు కూడా వెళ్ళాము. ఇంట్లోని పుస్తకాలను నాకు నచ్చినవీ,మేము సేకరించుకున్న మంచి పుస్తకాలూ కాకుండా కొన్ని మా రచనలతో పాటూ పేజీలు ఎర్రగా అయిపోయిన పాత పుస్తకాలుమొదలైన ఇతరములైనవన్నీ కేటగరైజ్ చేసి కార్టన్స్ లో పెట్టి కూరెళ్ళ విఠలాచార్య గారి గ్రంథాలయానికి వెళ్ళి ఇచ్చివచ్చాము.విఠలాచార్యగారు ఎంతో అభిమానంతో మాట్లాడటమే కాకుండా నాకు చీర,శాలువాతో గౌరవించారు.
కడప బ్రౌన్ లైబ్రరీ వాళ్ళు, మైసూర్ విశ్వవిద్యాలయం వాళ్ళూ,రాజమండ్రి నన్నయ్యభారతి వాళ్ళకూ కొన్ని పుస్తకాలు ఇచ్చాను.ఒకసారి ముగ్గురం కార్లో గుంటూరు, విజయవాడ వెళ్ళి నాగార్జున విశ్వవిద్యాలయానికీ,అన్నమయ్య గ్రంథాలయానికి వెళ్ళి ఇచ్చి వచ్చాము.అద్భుతమైన గ్రంథాలు కలిగిన అన్నమయ్య గ్రంథాలయం చూసి సంబరపడ్డాము.అక్కడ వున్న అపురూపమైన రాజ్యాంగ గ్రంథం,పాత బైబుల్స్ మొదలైనవి చూసి అబ్బురపడ్డాము.నిర్వాహకులు లంకా సూర్యనారాయణ గారు దగ్గరుండి మాకు ఆ పుస్తకాలన్నీ చూపించటమే కాక మా ముగ్గురికీ,మాతో వచ్చిన సుశీలగారికీ శాలువాలతో సత్కరించారు.
రెండురోజులు విజయవాడలో హొటలు తీసుకుని వున్నాము.గుత్తికొండ సుబ్బారావుగారు వచ్చి కలిసారు.మందరపు హైమవతి వచ్చి కళాసాగర్ గారి అరవై నాలుగు కళలు సంచిక కోసం ఇంటర్వ్యూ చేసింది.వనజా తాతినేనితో కలిసి కొండపల్లి కోట,మొదలైనవి చూసాము.చరిత్ర ఆనవాళ్ళు తెలుసుకోవడంలో ఆసక్తి కల ఆషీ,పల్లవీ సంతోషంగా తిరిగారు.రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చేసాము.
మరి కొన్నాళ్ళుకే పెద్దన్నయ్య పోయారని వార్త వచ్చింది.గుడ్డికన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే అన్న సామెతలా వున్న ఒక్క తోబుట్టువూ వెళ్ళిపోయాడు.భారవీ,పల్లవీ కలిసి విజయనగరం వెళ్ళి వచ్చారు.
వీర్రాజుగారి గురించి పదిరోజులలో వచ్చిన సంతాపం వ్యాసాలనన్నింటినీ సేకరించి సంవత్సరీకాలనాటికి పుస్తకంగా ప్రచురించే ఆలోచనతో ఆ పని మొదలుపెట్టాను.శిఖామణిగారు కూడా కవిసంధ్య పత్రిక వీర్రాజుగారి ప్రత్యేక సంచికగా ఆయనమీద వ్యాసాలతోనే తీసుకు వచ్చారు.అందులో నన్నుకూడా రాయమని అడిగారు. అంతే కాకుండా ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం పొందిన యాభై మంది, కుందుర్తి శతజయంతి పురస్కారం అందుకున్న ఆరు మంది గురించి క్లుప్త సమాచారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ ఆవిర్భావం, కొనసాగించిన కార్యక్రమాలతో కూడిన సమాచారం మంతటినీ గ్రంథస్థం చేయాలనే ఆలోచన వచ్చింది.ఎందుకంటే ఒక సాహిత్య సంస్థగా ఒక కుటుంబం ఎక్కడనుండీ చందాలు వసూలు చేయకుండా యాభై ఏళ్ళ పాటూ అకాడమీ స్థాయిలో పురస్కారాలు, పుస్తకప్రచురణలతో వచన కవిత్వవ్యాప్తికి కృషి చేయటం అపూర్వం కదా అందుకని డిసెంబర్లో కుందుర్తి శతజయంతి ముగింపులోగా నా స్వంత ఖర్చుతో ఆ పని మొదలెట్టాను.కలర్ ఫొటోలు వేయటంతో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల పుస్తకానికి ఖర్చు ఎక్కువే అయింది.ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డువచ్చిన వారందరికీ అయిదు కాపీలు చొప్పున పోష్టు చేయటానికి మరింత ఖర్చు అయింది.
డిసెంబర్ లో కుందుర్తి శతజయంతి సభ కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో శిఖామణి గారు నిర్వహించారు.ఆ సభలోనే నా సంపాదకత్వంలో వేసిన ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుల పుస్తకం కూడా ఆవిష్కరణ చేసాము.
డిసెంబర్ లో వసుధ పెళ్ళికి విజయనగరం వెళ్ళాము.చాలా ఘనంగా జరిగింది రెండురోజులు హడావుడిగా గడిచింది. హైదరాబాద్ లో సంగారెడ్డిలో జరిగిన రిసెప్షన్ కు చిట్టినీ, ఉషనీ తీసుకొని వెళ్ళాము.ఆ సందర్భంలోనే అక్కడకు కూతురుతో వచ్చిన పెద్దవదినా ,నేనూ ఒకరినొకరం పరామర్శించుకున్నాం.మానవసంబంధాలు ఎలా మారిపోయాయో కదా!! ఆ రోజుల్లోనే మా పెద్దఆడపడుచు మనవరాలి వివాహం అమెరికాలో జరిగింది.మేము విజయనగరం పెళ్ళికి వెళ్ళే హడావిడిలో వుండగా ఆడబడుచు కుమార్తె వచ్చి విషయం తెలియజేసింది. పెళ్ళిసంబరంలోనే మునిగివుండగా ఒక విషాదవార్త వినాల్సి వచ్చింది. వీర్రాజుగారిని ఎంతగానో ప్రేమించే వారాల కృష్ణమూర్తిగారి హఠాన్మరణం మనసును కలచి వేసింది నేను వూర్లో లేకుండా అయిందని బాధపడ్డాను.తిరిగి హైదరాబాద్ రాగానే పల్లవి నేనూ వెళ్ళి కృష్ణమూర్తిగారి భార్యని పలకరించి వచ్చాము.నేను కృష్ణమూర్తిగారి గురించి వ్యాసం రాయడానికి వాళ్ళబ్బాయి దగ్గర కథలపుస్తకం తీసుకుని ప్రజాసాహితికి వ్యాసం రాసాను.జనసాహితి వాళ్ళో,ఏజీ ఆఫీస్ వాళ్ళో కృష్ణమూర్తిగారి నివాళిగా నాటకం వేయించాలని అడుగుతే “ఏమో ఎక్కడున్నాయో తెలియదు”అంటూ వాళ్ళబ్బాయి సరీగా స్పందించలేదని లక్ష్మి బాధపడింది.
సాహితీవేత్తల పిల్లలకు సాహిత్యం పట్ల ఆసక్తి లేకపోతే ఇంక వారిసాహిత్యం అంతా అనామకంగా అయిపోవలసిందేనా?ఒక వేళ ఆ సాహితీవేత్తలను భుజానమోసే శిష్య ప్రశిష్యులు వుంటే మరికొంత కాలం గుర్తుంటాయేమో.ఒక్కసారిగా దిగులుగా అనిపించింది.
జనవరిలో మాకు బొమ్మలకొలువు సందడి వుంటుంది.ఈసారి ఆ పని లేదు. డా.సూర్యప్రకాష్ దంపతులు చింతల్ లోని ఆనందనిలయంలో మూడురోజుల కార్యక్రమం ఏర్పాటు చేసారు. వాళ్ళతో అక్కడికి వెళ్ళాము.అక్కడ పుస్తకాలతో కొలువు, ముగ్గుల సందడితో మాకు కొంత రిలాక్స్ పొందాము.
చిట్టీ వాళ్ళూ మళ్ళా అమెరికా ప్రయాణం పెట్టుకుని వెళ్ళిపోయారు.
ఫిబ్రవరిలో మూడేళ్ళ నుండీ వాయిదా పడిన మాడభూషి స్మారక కథాపురస్కారాలసభ జరిగింది.అధ్యక్షత వహించిన సుధామగారితో పాటూ వేదికమీద మూడేళ్ళఅవార్డు అందుకున్న ఎండ్లూరి మానస,అయోధ్యా రెడ్డి, ఎమ్వీ రామిరెడ్డి అందరూ ఫోన్లో వీర్రాజుగారి ద్వారా అవార్డుకి ఎంపిక అయిన విషయం తలంచుకున్నారు అవన్నీ వింటుంటే ఇన్నాళ్ళూ బింకంగా అందరి ముందూ కన్నీళ్ళు పెట్టకుండా వున్న నేను గుండెల్లోంచి పొంగుతూ వచ్చిన దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కిళ్లు పెట్టాను.ఆ రాత్రే నా వేదన ” మా చెడ్డ కన్నీళ్ళు”గా అక్షరరూపం దాల్చింది.
పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు భూటాన్ యాత్ర ప్లాన్ చేసారనీ తాను వెళ్తున్నానని చెప్పి మీరు వస్తారా అని నా స్నేహితురాలు ఉమ అడిగింది.పల్లవికూడా వెళ్ళమనటంతో నేనూ తయారయ్యాను.అయితే నా పాస్ పోర్ట్ లాప్స్ అయింది.అందుకని పల్లవీ తనదీ నాదీ రెన్యువల్ కు అప్లై చేసింది.అదృష్టవశత్తూ చాలా తొందరగా పాస్పోర్ట్ వచ్చేసింది.మొదటిసారి ఇలా స్నేహితురాలితో విహారయాత్రకు నేనొక్కదాన్నే మరో దేశానికి వెళ్ళటం. భూటాన్ లో దిగగానే చాలా ఉద్వేగంగా అనిపించింది.చూసిన ప్రతీ ప్రదేశం గురించి సమాచారం సేకరించుకున్నాను.తర్వాత చాలా రోజులకు వ్యాసం రాసాను.
సంవత్సరీకాలలోపుగా ఇంటికి కలర్స్ వేయించాలని మాట్లాడాము.ఇంటినిండా పుస్తకాలు,శిల్పకళాకృతులు అంతా సామాన్ని ఎలా సర్దుకుంటూ కలర్స్ వేయించాలా అనే భయం వున్నా అంతకుముందు మలక్ పేట ఇంట్లో వేయించే శ్రీనివాసునే మాట్లాడాము.చాలా శ్రమే అయినా ఇంచుమించుగా నెలరోజులపాటూ పని జరిగినా చాలా బాగా వేసారు.
స్త్రీ సంఘటన, జన సాహితి అధ్వర్యంలో అనంతపురంలో మహాసభలకు ఆహ్వానించారు.టికెట్లు ఎప్పుడో కొన్నాము.ఇంట్లో పని పూర్తికాలేదు.ఒక వారం రోజులు పని ఆపుచేయించి బయలుదేరాము. సామాను పట్టుకొని ఆటో కోసం చూస్తుంటే ఆరోజు సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ వాళ్ళ బహిరంగసభ వుంది సోనియాగాంధీ వచ్చిందట.అప్పుడే సభ పూర్తిఅయిందనుకుంటాను.రోడ్డంతా కిటకిటలాడుతోంది.ఒక్క ఖాళీ ఆటో రాలేదు.ట్రైన్ బయలుదేరే టైం దగ్గర పడుతోంది.లక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పాను.ప్రయాణం కేన్సిల్ చేసుకోవాల్సిందే అనుకున్నాము.అప్పుడు ఒక ఆటో దొరకటం,వాయువేగంతో ట్రైన్ కి అందించటం ఒక అద్భుతమే. ఉదయానికి అనంతపురం చేరాము.పదిగంటలకు మహాసభ మొదలైంది.ఎప్పటిలాగే జ్యోతి రాణి గారు అనర్గళంగా అనేక విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడారు.నేను నా ధోరణిలో మాట్లాడాను.మధ్యాహ్న భోజనం అయ్యాక వేరేచోట సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అని లక్ష్మి చెప్పింది.అనంతపురంలోని మనలో మనం సమూహం మిత్రులు నిర్మలా రాణీ,బిజిలీ వచ్చారు.చాలాసేపు మాట్లాడుకున్నాము.
మర్నాడు మాకు కారు ఏర్పాటు చేయటంతో లేపాక్షి వెళ్ళాము.అనంతపురం ఎండలు కదా అప్పటికే మధ్యాహ్నం కావటం, చెప్పులు లేకుండా చూడటం కష్టమే అయినా ఇష్టంగా చూసాము.ఇలాంటి ఎండల్లోనే వీర్రాజు గారు 1965లో శిల్పాలముందు నిలబడి స్కెచ్ బుక్ నిండా ఈ శిల్పాలచిత్రాలతో నింపింది.ఎన్నిసార్లో ఆయనతో కలిసి లేపాక్షి వెళ్దామని ఆశించి వెళ్ళలేకపోయాము.కానీ ఏ శిల్పం చూస్తున్నా దానిముందు పుస్తకంలో కలంతో శిల్పాలను చెక్కుతున్న మౌనమునిలా వీర్రాజుగారి చిత్రం కళ్ళముందు ఆవిష్కారమౌతూనేవుంది.లేపాక్షిని చూసిన తర్వాత దగ్గరలోనే హిందుపురం ప్రభుత్వకాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ప్రగతిని కలిసాము.
మర్నాడు నిర్మలారాణీ,బిజిలీలతో కలిసి మేము దేవకీ మహాసముద్రం గారి ఇంటికి వెళ్ళాం.ఆమె మమ్మల్ని చూసి సంబరపడింది.మా అందరికీ ఆత్మీయంగా చీరలు కూడా పెట్టింది.అనంతపురం పరిసరాల్లో చూడదగిన ప్రదేశాలు చాలా వున్నా సమయాభావం వలన ఇంకేమీ చూడలేదు.ఒకరోజు రాధేయగారింట భోజనం చేసి తిరుగు ప్రయాణానికి బయల్దేరాము.
ఇంటికి వచ్చాక మళ్ళా కలర్స్ మిగులు పనులు పూర్తి చేయించాము.రాజమండ్రిలోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో వీర్రాజుగారి జయంతి రోజున,సంవత్సరీకం రోజునా భోజనాలు పెట్టించమని డబ్బు పంపించాను.అదేవిధంగా విజయనగరంలో చారిటబుల్ థెరీస్సా క్లబ్ వాళ్ళకి కూడా ప్రతీ ఏడాదీ వీర్రాజుగారి జయంతి,వర్థంతుల రోజుల్లో హాస్పిటల్ లో రోగుల అటెండెంటులకు భోజనాలు పెట్టించమని డబ్బు పంపించాను.
ఇక హైదరాబాద్ లో నారాయణగూడ తాజ్ మహల్ హొటల్ బుక్ చేసాము.వీర్రాజుగారి గురించి వివిధ మాధ్యమాల్లో వచ్చిన రచనలు అన్నింటినీ డీటీపిని చేయించాను. పాపికొండలుకు వెళ్ళినప్పుడు వీర్రాజుగారు తీయించిన గోదావరి ఫోటోనే పల్లవి ముఖచిత్రంగా డిజైన్ చేసింది.పుస్తకం శీర్షికను నదిప్రయాణం అనే పెట్టి పుస్తకం ప్రచురించాను.ప్రచురణబాధ్యత డి.చంద్రశేఖరరెడ్డిగారే చూసుకున్నారు. అంతకుముందు మాదిరిగానే శివారెడ్డి, నగ్నముని,ఎన్.గోపి,నిఖిలేశ్వర్, సిధారెడ్డి ,శిఖామణి, ప్రసాద మూర్తి మొదలైన వారిని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించాను.ఆషీచేత పుస్తకాన్ని ఆవిష్కరింప జేసాను.ప్రముఖులందరూ ఆత్మీయంగా ప్రసంగించారు.అదే సందర్భంగా గణేశ్ రాం గారు తాను హిందీలోకి అనువదించిన మైనా నవలను బెంగుళూరునుండి వచ్చిన తనమిత్రులతో ఆవిష్కరింప జేసారు.సుమారు రెండువందల మంది బంధువులూ,ఆత్మీయమిత్రులతో వీర్రాజుగారి సంవత్సరీకాలు జరిగాయి.విజయనగరం నుండి కళ్యాణ్,రంజనాల కుటుంబాలు శర్వాణితో సహా వచ్చారు. పెద్దఆడబడుచు భర్తా, పెద్దకూతురు శిరీష వచ్చారు.కుకట్ పల్లిలోవున్న కృష్ణ పిల్లలు,చిన్నన్నయ్య పిల్లలూ ,శ్రీదేవివాళ్ళూ అంతా వచ్చారు.చిట్టీవాళ్ళే జనవరిలో వెళ్ళినవారు అమెరికాలోనే వుండిపోయారు.
వీర్రాజుగారు చనిపోయిన సందర్భంగా పదో రోజు తాజ్ లో ఏర్పాటు చేసినప్పుడు ప్రముఖులు అందరూ రావటంలో ఆయనమీద అభిమానంగా భావించాను.కాని ఈసారి మా కుటుంబ కార్యక్రమంగా చేసిన సమావేశానికి కూడా అందరూ ఆత్మీయంగా రావటం,భిన్న దృక్పధాలు కలిగిన వారు ఒకే వేదికపై వుండటం చూసిన చాలా మంది ఇదొక చారిత్రాత్మక సందర్భంగా అనుకుంటున్నారని తెలిసింది.
*****

జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
