
ముక్తి దేవత..
(నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– సురేష్ బాబు
అవును నా తనువులో ఆశలలతలు
అల్లుకొని ఉంటాయి
నా మాటల్లో మనసు అలను తట్టి లేపే
భావాలు పొదుగుకుని ఉంటాయి
నా నడకలో నడతలో నిన్ను ఆహ్లాదపరిచే
సౌకుమార్యం కదలాడుతుంటుంది
నా ఉనికిలో శరత్చంద్రికల అల్లికలు
నీ చుట్టూ చేరి ఓ కమ్మటికలను చల్లగాలి లాలనగా
పరిచయం చేస్తాయి
నేనేమీ సోయగాల బేహారిని కాను
కానీ
నీ సహచర్యంలో గుబాళించే స్నేహపూల సుగంధాన్ని
బతుకుతనానికి నవ్వుల నగిషీలు అలంకరించే
స్త్రీత్వపు ప్రతిరూపాన్ని
మత్సరాలు నింపుకున్న మీ కుళ్ళు మెదళ్లకు ఎలా చెప్పను
ఆకాశాన్ని సగం చేసుకున్న ఆశయం నా సొంతమని
పంచడంలో ఆనందం నా సుగుణమని
రెక్కలున్నా సరిహద్దులు గీసుకుని
మీ జీవితాలకు పూర్ణత్వాన్ని ప్రసాదిస్తున్న
ముక్తి దేవతనని
ఎలా చెప్పను…
*****

నా పేరు సురేశ్ . నేను 1. విస్మృతి గానం 2. కెరటం నన్ను ఆవహించింది అనే కవితా సంపుటాలను రచించాను
వృత్తి రీత్యా ఆ. ప్ర ప్రభుత్వంలో సహాయ విద్యుత్ తనిఖీ అధికారిగా పనిచేస్తున్నాను
