
ఆత్మీయ స్పర్శ
(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-చెళ్ళపిళ్ళ శ్యామల
మర్నాడుదయానికి ఓ కొత్త ఉత్సాహంతో నిద్రలేచింది సుశీలమ్మ. ఆలోచన ఆచరణలో పెట్టడానికి కావాల్సిన వస్తువులను, మనుషులను ఏర్పాటు చేసుకోవడానికి ఆమెకి ఓ నెల్లాళ్ళ సమయం పట్టింది. తాను తీసుకున్న నిర్ణయం పిల్లలకూ చెప్పింది.కొడుకు ఆమె నిర్ణయం విని నీ యిష్టం అన్నా కూతురు మాత్రం ఆమె మాటలు పూర్తి కాకుండానే ఫోన్ కట్ చేసింది. పిల్లల నుంచి నిరసన ఆమె ఊహించినట్టే వచ్చింది.
ఓ గొప్ప కార్యక్రమం తన చేతుల్లో రూపుదిద్దుకోబోతోంది. ఈ ఆలోచనే గొప్ప తృప్తి నిచ్చి, చాన్నాళ్ళ తర్వాత హాయిగా నిద్రపోయిందామె.
భర్త పరాంకుశం ఆరోగ్యం బాగులేకపోవడంతో ఆమె తన ఉద్యోగానికి వాలంటీరీ రిటైర్మెంట్ యిచ్చి, భర్తని కంటికి రెప్పలా చూసుకుంది. అయినా భర్త ఆమెకి దక్కలేదు.భర్త పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పిల్లల బాధ్యతలూ ఒడ్డెక్కించింది. ఇప్పుడు పిల్లలిద్దరూ హాయిగా ఉన్నారు. దేనికీ లోటులేదు. అపుడపుడూ పిల్లలు వచ్చి ఆమెను చూసి వెళుతున్నారు
రెండు మూడు నెలలుగా సుశీలమ్మ మనసు మనసులా లేదు. అందుకుకారణం లేకపోలేదు. సుశీలమ్మ ఉంటున్న కాలనీలోనే ఓ ఇంటాయన కాలం చేసాడు. ఆయన మరణం సుశీలమ్మని ఎంతగానో కలవరపరచి ఆలోచింప చేసింది. ఫారిన్ కంట్రీలో పెద్ద పెద్ద జాబ్ లు చేస్తున్న పిల్లలున్నా వారికి వచ్చిన తగ్గని జబ్బుకు, ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తూ పనిమనిషిని ఏర్పాటు చేసారు పిల్లలు. అపుడపుడు బంధువులు వచ్చి వెళుతుండేవారు. పిల్లలూ వచ్చి వెళ్లారు. రోజూ వీడియో కాల్ చేసి అతని యోగ క్షేమాలు కనుక్కునేవారు పిల్లలు. అయినా ఏం లాభం. ఓ రోజు రాత్రి అనాధలా ఎవరినీ చూడకుండానే, ఎవరితో మాట్లాడకుండానే అందరినీ శాశ్వతంగా వదిలెళ్ళాడాయన.
అది మొదలు సుశీలమ్మ మనసు మనసులా లేదు. తీవ్ర అనారోగ్యానికి గురై బ్రతుకుతారన్న ఆశ లేని వారు, చుట్టూ నా అన్నవాళ్లు లేకపోతే మరింత క్రుంగి కృశించి పోతారు. అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని తీవ్రంగా ఆలోచించింది. ఆలోచన వచ్చిందే తడువు ఆచరణలో పెట్టేందుకు తన దగ్గర చదువు కున్న వారిలో అప్పటికీ ఉద్యోగంరాని వారి లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళను వచ్చి తనను కలవమని ఫోన్ చేసింది..సుమారుగా….. ఓ ఇరవైమందిదాకా స్టూడెంట్స్ వచ్చారు. ఏ ఉద్యోగం లేని వారు కొందరు, చిన్నా చితకా ఉద్యోగంచేస్తూ బ్రతుకు నెట్టుకొస్తున్నవారు కొందరు. ఉద్యోగవేటలో విసిగి బ్రతుకు
మీద విరక్తి చెందినవారూ ఒకరిద్దరు ఉన్నారు.
వాళ్లందరితో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి తన మనసులో మాట చెప్పింది. అంతా ఆమెచెప్పిన విషయాలు విని ఇలా కూడా సహాయం చేయవచ్చా అని నివ్వెర పోయారు. ఇలాంటి ఆలోచన వచ్చిన ఆమెను ఎంతగానో గౌరవించారు. బ్రతుకుకి ఓ సార్ధకత లభిస్తుందని తప్పకుండా తామంతా…… ఆమెకు సహాయపడతామని చెప్పారు. గురువు ఋణం ఇలాగైనా తీరుతుందని వాళ్లంతా భావించారు. ఎవరి కష్టం ఊరికే తీసుకోకూడదని వాళ్ళకి నెలకి తలాకొంత ఇచ్చే ఆలోచనలో తన పదెకరాల పొలంమీద ఆమె కొంతఋణం తీసుకుంది.
అనుకున్నదే తడవుగా తన టీమ్ తో కలిసి సర్వేచేసి, హాస్పిటల్స్ లో ఎంక్వయిరీ చేసి, డాక్టర్స్ కి తన సంకల్పం చెప్పి మొత్తానికి ఓ ఎనిమిది మందికి తమ అవసరం ఉందని తెలుసుకుంది సుశీలమ్మ. ముందుగా పన్నెండేళ్ల సరళ గురించి ఆమె తల్లితో మాట్లాడి తమ సంస్థ చేయబోయే విషయం చెప్పాక ఆవిడ కళ్లనీళ్ల పర్యంతమైంది. సరళ మరో రెండు మూడు నెలలు కంటే ఎక్కువకాలం ఈ లోకంలో ఉండదని, తనకి ఈలోకంలో ఆమె తప్ప ఎవరూలేరని ఆమె ఈ లోకం విడిచివెళ్ళాక తాను కూడా సుశీలమ్మ ఆశయానికి తన సేవలు అందిస్తానని చెప్పింది సరళ తల్లి. ఆ మాటలు సుశీ లమ్మకు ఎంతో
ప్రోత్సాహాన్నందించాయి.
సరళ ఇంటికి ఆరోజు సుశీలమ్మ టీమ్ వెళ్ళింది. వాళ్లంతా కొన్నాళ్ళు అక్కడేఉండి పాపను కంటికి రెప్పలా చూసుకుంటూ బతికినన్నాళ్ళు ఆమెకు ఆత్మీయస్పర్శ అందించి ప్రతి రోజూ ఓ పండుగ రోజులా ఎంతో వేడుకగా జరిపారు.
సుశీలమ్మ టీమ్ కురిపించిన అనురాగవర్షంలో…. తనివితీరా తడిసి ముద్దయింది సరళ. అనుకున్నదాని కంటే మరో రెండు నెలలు ఎక్కువగానే బతికింది. పోయినప్పుడు కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. మరిచిపోలేని అనుబంధాన్ని మిగిల్చి తనకి అండగా నిలిచిన సుశీలమ్మ పట్ల, ఎంతో కృతజ్ఞత చూపించింది సరళ తల్లి. తన కున్న యింటిని కొద్దిపాటి నగలను సుశీలమ్మకిచ్చి, తాను కూడా సుశీలమ్మ టీమ్ తో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంది.
అమెరికాలో పిల్లలు అనుకోకుండా భార్య మరణం మాధవ రావుని బాగా క్రుంగదీసింది. భార్య పోయాక అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుని అతనూ అమెరికా వెళదాం అనుకున్నాడు. భూములు, పొలాలు, స్వంత ఊరులో ఇల్లు అమ్మి అమెరికా వెళ్ళబోతూ తన చిన్ననాటి ఫ్రెండ్ డాక్టర్ సుధాకర్ ని కలిసాడు. అప్పుడు తెలిసింది. అతడికి కాన్సర్ అని. ఇన్నాళ్లు భార్యకి కిడ్నీ ప్రాబ్లెమ్ డయాలసిస్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగి విసిగి పోయి పిల్లల వద్దకు పోయి హాయిగా వుందా మనుకుంటే ఇప్పుడు తెలిసిన భయంకర విషయం అతని నవనాడులూ క్రుంగ దీసింది. అతను పిల్లలతో గడుపుదామనుకున్న ఆశ అడియాశ అయ్యింది. అమెరికా ప్రయాణం కలగానే మిగిలింది.రోజు రోజుకీ మరణానికి చేరువవుతున్నాడతను.పిల్లలతో ఫోన్ లో కూడా మాట్లాడ లేకపోతున్నాడు. ఇంతలో సుశీలమ్మ టీమ్ మాధవరావు గురించి తెలుసుకొని అతడికి సేవ చేయడానికి వెళ్ళి చివరి క్షణం వరకూ అతనికి తోడుగా ఉండడంతో మాధవరావు పిల్లలు ఎంతగానో స్పందిచీ తమ వైపు నుంచి భారీ నిధులు ఇవ్వడంతో ఇప్పుడు సంస్థ మరింత మందికి చేయగలుగుతోంది.
సుశీలమ్మ టీమ్ ఇరవై మంది కుటుంబాలకి తమ సాయం అందించింది. మనిషి సాయం మాట సాయం లేని కుటుంబాలకు ఎంతో ఊరట నిచ్చింది. ఎవరూ లేని ఒంటరి వాళ్లకు, నయంకాని రోగాలతో బాధపడే వాళ్లకు తమ టీమ్ ద్వారా పంపే వ్యక్తులు ఇంటి మనుషుల్లా ఆప్యాయత పంచుతూ…. మమతానురాగాలు కురిపిస్తూ….వారి బాధలను తగ్గించే ప్రయత్నం చేసి వారి కుటుంబానికి తోడుగా ఉండేవారు.
ఓ ఛానెల్ వారు ఆమెతో ఇంటర్వ్యూ చేసారు. అందులో ఆమె చెప్పిన కారణాలు అందరినీ అలోచింప చేసాయి. ఆమె మాటలతో సంస్థకు చేయూత నివ్వడానికి మరి కొంతమంది ముందుకొచ్చారు.
“ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది మేడం”
“బలగం….. బలగం మనిషికి బలాన్నిస్తుంది.ఒంటరితనం మనిషిని బలహీన పరుస్తుంది. మా టీమ్ ద్వారా నేను బలగాన్నందించి ఒంటరితనంలో వున్న వాళ్లకి బలాన్నిస్తున్నాను అంతే! డాక్టర్లు సైతం నిలబెట్టలేని ప్రాణాలకు కాస్త ఊరట నిస్తున్నా.
ఇంటర్వ్యూ విన్న ఆమె పిల్లలిద్దరు తల్లి ఆశయాన్ని గౌరవించడంతో పాటు చేయూత నందించడంతో సుశీలమ్మ మనసు ఎంతో తేలిక పడింది.
*****

చెళ్ళపిళ్ళ శ్యామల ఉపాధ్యాయిని. నివాసం విజయనగరం. ప్రవేశమున్న ప్రక్రియలు వచన కవిత, మినీ కవిత, పాట, వ్యాసం. బాలగేయాలు “పలకరింపులు” మినీ కవితా సంకలనం 2000 లో ప్రచురితమైంది. అనేక దిన వార మాస పత్రిక లలో కవితలు, కథలు, పాటలు ప్రసారం అయ్యాయి.
