
నీహార పథం – భాగం-5
-డాక్టర్ కొండపల్లి నీహారిణి
“నీహారపథం”లో ఇప్పటిదాకా : –
కొండపల్లి నీహారిణి ఆత్మకథనాత్మక ఉపోద్ఘాతంలో ఆమె పుట్టిన ఊరు, కన్నవారి విషయాలు చెప్పారు. ఆ తర్వాత తొలి తొలి అడుగుల చిన్నారి లోకం అంటూ బాల్యస్మృతులను పంచుకున్నారు. ఇల్లు, బడి, గుడి ముచ్చట్లు చెప్పారు, స్కూల్లో జరిగే జాతీయ దినోత్సవాలతో ఎలా ప్రేరణ పొందారో వివరించారు. ఆ రోజుల్లో నాగుల చవితి, బతుకమ్మ వంటి పండుగలు ప్రకృతి పట్ల గౌరవాన్ని పెంచాయని అన్నారు. బాల్యం నేర్పిన ఈ పాఠాలే తమ రచనలలో ప్రోది చేసి వ్రాసేలా చేశాయని కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఏడవ తరగతి వరకు చిన్న పెండ్యాల లో చదువు తర్వాత పక్కూరు ఘన్ పూర్ లో చదువులకు పయనమైన విధానాన్ని ఎలా వివరిస్తారో చూద్దాం…
***
నేను ఏడో తరగతికి వచ్చేటప్పటికి సమాజంలో చాలానే మార్పులు వచ్చాయి. విద్య ప్రాధాన్యత తెలుసుకున్న గ్రామస్తుల సంఖ్య కూడా పెరిగింది. ఇది ఎలా ఏమిటి అనేది నా జ్ఞాపకాల బుట్టలో నుండి కొన్ని కొన్ని అయినా చెప్పగలగాలి. టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, Time and Tide wait for none అని ఊరికే అన్నారా? ఇంత లోతైన భావం ఆ రోజుల్లో తెలియదు కానీ, ఇప్పుడు అనిపిస్తుంది…. అబ్బా .. అరవై వసంతాలను దాటి వచ్చానే అని! ఆనాటి జ్ఞాపకాలను ఇలా తలుచుకోవడం కేవలం జీవితానికి ఒక ప్రేరణ !!
స్పెండ్ టైం విత్ ద లైట్ మైండ్ పీపుల్ అన్నదీ మనకి ఎంతో ముఖ్యమైన వాక్యం. అయితే మన చుట్టూ అందరూ లైట్ మైండెడ్ వాళ్ళే ఉండరు.. అంతా మంచే జరగదు… ఈ జీవితమే సుఖదుఃఖ
సంగమం అవన్నీ తెలుసుకోవాలంటే బాల్యాన్ని తడమాలి, గుండెల్లో దాచుకుంటూ బ్రతికిన సంఘటనలు సందర్భాలు నిరాసక్తంగా కాదు తెలుసుకోవాల్సింది. Present Time లో, ప్రస్తుత క్షణంలో జీవించడం అత్యంత అవసరం. చేదు అనుభవాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. ఆ పాత కష్టపు జ్ఞాపకాల గురించి ఆలోచించడం మానేసి . అవసరమైన వాటిపై పూర్తిగా ఆసక్తిని పెట్టి ఆశతో బ్రతకాలి.
గతాన్ని పట్టుకొని వేళాడకుండా ఏ ఉదాసీనతకులోను కాకుండా వైరాగ్యాన్ని కలిగి ఉండకుండా పిడికిట్లోకి వచ్చిన ప్రతి క్షణం అనే సమయాన్ని బిగించి కాలమనే పడవలో పయనించాలి. ఇంత తాత్త్వికత తెలియని చిన్ననాటి బ్రతుకుకు ఇవన్నీ ఎందుకు జోడించి చెప్పాలి? చెప్పాలి…
అబద్ధాలు కాకుండా నిజాయితీని ఆలంబనగా చేసుకొని సహజ సిద్ధమైన జీవితాన్ని చెప్పాలి. లేకుంటే ఇదంతా రాయడం ఎందుకు? నేను నేనుగా ఒక్కదాన్నే పెరిగి బ్రతకలేదు … నేను పెరిగిన ఊర్లో , మా ఇంట్లో, మా కాలపు చదువులలో నేను ఎదిగిన క్రమంలో ప్రపంచం తననూ చూసుకోవాలి.
బడికి వెళ్లాలంటే తయారు కావాలి. తయారవ్వాలంటే స్నానం చేయడానికి వేడి నీళ్లు కావాలి . వేడినీళ్లని ఎక్కడ కాచే వాళ్ళమో తెలుసా? బప్కా లో నీళ్ళు కాచేవాళ్ళం. బప్కా అంటే బాయిలర్ . ఉర్దూ పదమది. వంట ఇంటి వెనుక ఒక బావి ఉండేది ఎందుకో ఆ బావిలో మేము పెరిగాక నీళ్లు ఉండేది కాదు . మరీ చిన్నప్పుడు ఉండేవి. దూడమ్మ అనే పనిమనిషి ఉండేది కదా ..ఆమె గోళెంలో నీళ్లు ఒక్క చెంబెడు నీళ్లు తీసినా ఆమెకి కోపం వచ్చేది. ఎప్పుడు నీళ్లు నిండుగా ఉండాలి. అరే నీళ్లు వాడుకోకుంటే ఎందుకు చేదుతున్నట్టు? ఆమెతో చిన్నచిన్న సరదాగా అయిన మాటలు, నవ్వులు అన్ని
సాగుతూ ఉండేది.
దూడమ్మ పని మానేయమన్నా మానేసేది కాదు. ఆమె చివరి రోజుల వరకు కూడా మా అమ్మ దగ్గరే పని చేసింది. కొప్పెర,గంగాళం ఏది నిండ నీళ్లు ఉండాలనేది. పిల్లలం మేమంతా దూడమ్మకు భయపడే వాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళ శారీరక కష్టానికి గౌరవమియ్యాలని అమ్మ బాపు చెప్పే వాళ్ళు కదా… ఇప్పటికీ మేము నేర్చుకున్నది అదే కదా అని. ప్రస్తుతం ‘ఎలీన’ తో కరువు అంటున్నారు
కదా .. అదేమోగాని మా అమ్మ ఓ మాట అనేది.. “ఏ ఇంట్లో నైతే నీళ్లు వృధా చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీ దేవి నిలవదు” అని! ఎన్ని అర్థాలు దాగున్నాయి ఈ మాటలో? ఇవీ నేర్చుకున్నాము! అవసరానికి ఖర్చు చేయడం… అతిగా ఖర్చు చేయడం మధ్య ఉన్న గీతను చూపారు మా పెద్దలు!!
నేను పాటలు పాడుతూ ఉంటే చాలా నచ్చేది దూడమ్మ. ఆమెను పట్టుకోని ఎగిరేవాళ్ళం.. ముసిముసి నవ్వులు నవ్వేది ” ఏ… ఏందుల్లా.. ” అంటూనో , “రామసక్కని తల్లి ” అనో! మా తమ్ముడు, అక్కయ్య, నేను, అన్నయ్య మేమందరము ఇంట్లో ఎప్పుడు పాటలు పాడేవాళ్ళ . అవి సినిమా పాటలు, లలిత గీతాలు దేశభక్తి పాటలు. ఇక మేము వేమన, సుమతి శతక పద్యాలు చదివామంటే ఇంటికొచ్చే వాళ్ళంతా మురిసిపోయే వాళ్ళు… మా చుట్టూ చాలామంది ఉండేవాళ్ళు. మాతో మళ్ళీ మళ్ళీ చదివించుకునే వాళ్ళు.
ఇంట్లో పచ్చని పంటల పరిమళాలు వ్యాపించినప్పుడు మేము పని వాళ్ళ అందరితో కలిసి పనులు చేసేవాళ్ళం పల్లికాయ కొట్టడము, మొక్కజొన్నలు ఒలవడము , గర్శల్లో కుండలలో నింపడం వాళ్లు ధాన్యం చెరుగుతూ ఉంటే మేము ఎత్తడం, వాళ్ళు ఇస్రురాయిపడుతూ ఉంటే మేము తిప్పడం అలా అన్ని పనులు వాళ్లతో పాటు చేసేవాళ్ళం. పసుపు కొట్టడానికి కొమ్ములు దంపడం, మిరపకాయలకు
తొక్కలు తీయడం, చింతకాయల గింజలు కొట్టి తీయడం, పండ్లు కూరగాయలు ఎండినవి ఏమైనా ఉంటే తీసేయడము మంచివి కడిగి పెట్టడం అలా! ఇట్లా చెయ్యమని ఎవరు చెప్పే వాళ్ళు కాదు… చేయవద్దు అని అడ్డుకునే వాళ్ళు కాదు. కానీ మేము ఆ పనులను చాలా సునాయాసంగా, ఇష్టంగా చేసేవాళ్ళం . పండగలకి ఇల్లు కడుగుతుంటే మేము చీపురుతో నీళ్లు కొట్టడాలు ,తోరణాలు కడుతూ ఉంటే మేము కట్టడం ఇట్లా ప్రతి పనిలో మా భాగస్వామ్యం ఇన్వాల్వ్న్మెంట్ ఉండేది.
మా బాపు వ్యవసాయం చాలా బాగా చేయించే వారు. ఏవేవో కొత్త కొత్త వంగడాలను తీసుకువచ్చారు మా గ్రామానికి. అప్పట్లో ఇప్పటిలా రసాయన ఎరువులు ఎక్కువ ఉపయోగించే వాళ్ళు కాదు. ట్రాక్టర్లు లేవు.
నాగళ్లతోనే దున్నేవాళ్ళు. ఎక్కువ శాతం వర్షాధార పంటలు ఉండేవి. మాకు జీతగాళ్లు ఉండేవాళ్ళు డ్యూటీ ప్రకారంగా వాళ్లు చేసే పనులు వాళ్ళు చేసే వాళ్ళు కానీ నాట్లు వేయడమైనా కోతలు కోయడమైన పంటలు ఇంటికి చేర్చడంలోనైనా కూలి వాళ్ళు బాగా అవసరమయ్యేవాళ్ళు దీనితో మా ఇల్లంతా ఎప్పుడు సందడిగా ఉండేది. ఎల్లమ్మ కొమురుమల్లు అనే ఇద్దరు ఆడవాళ్లు మా అమ్మతో చాలా చనువుగా
మాట్లాడేవాళ్ళు ఇసుర్రాయితో పప్పు ఇసిరి, పసుపును నూనెను పట్టించి గంపల్లో జాడీలల్లో ఎత్తి పెట్టేవాళ్ళు. ఏడాదికి సరిపడా చింతకాయ తొక్కు (పచ్చడి) దంపి పెద్ద రాచిప్ప లోకి ఎత్తి పెట్టేవాళ్ళు, బియ్యంలో పరిగెలేరేవాళ్ళు, వడ్లను శుభ్రంగా చెరిగి మట్టి పల్లెలు అన్ని ఏరేసి రాళ్లు లేకుండా చూసి కుంచాలతో కొలిసి బస్తాల్లోకెత్తేవాళ్లు. కూలి వాళ్లు డబ్బులు అడిగి తీసుకునే వాళ్ళు కాదు. వస్తు
రూపంలో, అంటే ధాన్యపు రూపంలోనే తీసుకునే వాళ్ళు. పండిన పంటనే కూలీ కింద తీసుకునే వాళ్ళు. ఈ పని ఎక్కువ శాతం ఎల్లమ్మ బుచ్చికొమురమ్మ ల పని . వీళ్ళు మిగతా కూలి వాళ్లకు గింజలను
సోలలతో కొలిసిపోసేవాళ్ళు. వడ్లు, జొన్నలు, సజ్జలు వంటివి సేరు, సవ్వ సేరు, అర్థసేరు, పావు సేరు అనే కొలతలతో ఇచ్చేవాళ్ళు. సోల, తవ్వెడు ,మానెడు ,అడ్డెడు ,కుంచెడు అనే పేర్లతో పిలుస్తారు కొలతలను. తవ్వెడు అంటే రెండు కుంచాలు, అడ్డెడు అంటే 8 కుంచాలు. కుంచెడు అంటే 16 సోలలు, సోల అంటె దాదాపు కిలో అన్నట్టు. ఇరుసు అంటే రెండు కుంచాలు , పుట్టెడు అంటే 80 కుంచాలు. తూమెడు అంటే నాలుగు కుంచాలు వీటిని సంప్రదాయ పాత్రల కొలతల లెక్కలు అంటారు.
ఎల్లమ్మ, కొమురమ్మ వంటి వాళ్ళంతా మమ్మల్ని చాలా ఇష్టపడేవాళ్లు. నేను తమ్ముడు అక్కయ్య ఎక్కువశాతం వాళ్ళ మధ్యనే తిరిగే వాళ్ళం . ఏమేమో జోక్స్ వేసేవాళ్ళు మాకు కొన్ని అర్థమయ్యేవి కొన్ని అర్థమయ్యేది కాదు లోపలికి వెళ్లి అమ్మనో బాపమ్మనో అడిగేవాళ్ళం. జీతగాళ్ళకి కూడా సంవత్సరానికి ఒకసారి కొంత ధాన్యాన్ని ఇవ్వడం ఎప్పుడో ఒకసారి నగదు రూపంలో ఇవ్వడం జరిగేది. వాళ్ళకు తప్పకుండా ఉగాది , దసరా పండగలకు కొత్త బట్టల జతలు, కొత్త చెప్పులు కొనిచ్చేవాళ్ళు. బావుల దగ్గర మోట కొట్టే పద్ధతి నా చిన్నతనంలో ఉండేది . అవి పోయి కరెంట్ మోటార్లు వచ్చాయి. బర్సనగడ్డ ( హైదరాబాద్ హై వే పై బస్ స్టాప్ పేరు) నుండి ఊళ్ళోకి, ఇంటి దగ్గరకు వస్తుంటే దారిలో ఉండే బావి పేరు ఇరుకు బావి. ఇరుకు బావి పేరు వినగానే నువ్వు వచ్చేది. ఎందుకంటే ఆ బావి పెద్దగా , విశాలంగా ఉండేది. నీళ్లు బాగా కనిపించేది. మరి ఎందుకు ఆ పేరు వచ్చిందో తెలియదు. ఇంకో బావి వెంకటేశ్వర్ల బావి బహుశా చిలుపూరు వెంకటేశ్వర స్వామి ఆలయం వైపున ఉన్న బావి కాబట్టి ఆ పేరు పెట్టారేమో!
కాలక్రమాన మోటార్లు రావడంతో పైపులు వేయించి , చాలా పెద్ద వ్యవసాయం చేయించేవారు మా బాపు . తర్వాత కాలంలో బోర్లు వేయాల్సి వచ్చింది. కరెంటు కట్ కావడంతో ఫీజులు కొట్టేయడం అవి మళ్లీ
పెట్టించడం ఓ ఇదంతా ఒక పెద్ద ప్రహసనం లా ఉండేది. ఎందుకో మా బాపు ఎప్పుడూ ఏదో ఆరాటపడుతూ , ఏదో బాధపడుతూ సుదీర్ఘమైన ఆలోచనలలో మునిగిపోతూ మంచంలో పడుకునే వారు. ఒక పెద్ద చేతుల కుర్చీ ఉండేది. కూర్చునే దగ్గర బట్ట ఉంటుంది. బాపు అంటె, మా నాన్న, తన నాసిక పైన వేలును పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉండేవారు. అలాంటప్పుడు ఆయనను పలకరించడానికి కూడా
మేము ముందుకెళ్లే వాళ్ళం కాదు. అంత జంకు!
ఆర్థికంగా చాలా ఇక్కట్లు పడుతున్నట్టు మాత్రం అర్థమయ్యేది. అవి ఎందుకనేది పెద్దయ్యాక తెలిసింది మాకు. పేరుకు పెద్ద భూస్వాములనే పేరు! కానీ, ఎవ్వరి చేతుల్లో క్యాష్ ఉండేది కాదు. కాసుల గలగలలు వినిపించడం అరుదు. అన్నయ్య విజయరామారావు పదవ తరగతి అయిపోగానే హనుమకొండలో ఇంటర్మీడియట్ లో చేరాడు అక్కయ్య ఎనిమిదవ తరగతి వరకు అంటే ఓ రెండు ఏండ్లు రిక్షా లోనే ఘన్పూర్ కు వెళ్లి చదువుకున్నది. తర్వాత RTC బస్సులు రావడంతో బస్సులో పోయేది. పది పూర్తి కాగానే అక్కయ్య కూడా హన్మకొండ లో చేరింది. ఘణపురం బడి చదువు కు మా అన్నయ్య నడిచి వెళ్ళేవాడు. కానీ నా వరకు వచ్చేసరికి బస్సులు మరికొన్ని ఎక్కువ వచ్చాయి. రిక్షా పాతదైపోయిందో పాడయిందో గుర్తుకులేదు గాని ఉపయోగంలో ఉండేది కాదు. బుచ్చయ్య ఇంటి పనులు పొలం పనులకు
పరిమితమై, కొన్నాళ్ళకే మానేసాడు. అశోక్ బస్ సర్వీస్ లు అని ఉండేవి. డొక్కు బస్సులు. డుగు డుగు చప్పుడు. ఊపిరాడకుండా బస్సు నిండా జనం తొక్కిసలాట. ఘన్పూర్ నుండి చిలుపూరు తరిగొప్పుల వరకు అవి నడిచేవి . బస్ టికెట్ కు 30 పైసలు అనుకుంటా ! ఈ 30 పైసలు కూడా లేని వాళ్ళు ఉండేవాళ్లు దాదాపు 20 మంది విద్యార్థులు ఘనపూర్ వరకు నడిచొచ్చేటోళ్లు వీళ్ళలో కొంతమందికి కాళ్లకు చెప్పులు కూడా ఉండేది కాదు. నా తర్వాత మా తమ్ముడు కూడా హైస్కూల్ చదువు కోసం ఘన్పూర్ కు నడిచే వెళ్ళాడు. నేను కూడా కొన్ని తడవలు నడిచే పోయేది. అలా నడచి పోతూ పోతూ ఎన్ని
ఆటలో ఆడుకునేది ..ఎంత నాలెడ్జో
సంపాదించేది ! మాకు గిర్ని ఉండేది కాబట్టి చిల్లర డబ్బులు ఉండేవి. ఈ కాసుల గలగలలు చిన్న చిన్న ఖర్చులకి వచ్చేదే కానీ నగదును కూడబెట్టుకుని ఎదిగేలా ఉండేవి కావు. ఎందుకంటే ఆ గిర్నీకి కూడా ఎప్పుడు ఏవో ఒక రిపేర్లు వచ్చేవి మోటర్ కాలిపోవడం పట్టా తెగిపోవడం వంటివి. పైగా గిర్నీ పట్టే అబ్బాయి కి జీతం డబ్బుల రూపంలోనే ఇవ్వాలి. అందుకే కొన్నేళ్ల తర్వాత గిర్నీ మూత పడింది.
నేను గిర్నీ పట్టడం నేర్చుకున్నా. చక్కగా పట్టేదాన్ని. “అబ్బో చిన్నక్కా నా ఉద్యోగం పోతది , బాపుజూస్తె కోప్పడ్తడు ” అని యాదన్న భయపడేది.
అయితే, రైతులు పంటలు పండినా పండక పోయినా, అప్పులు అవుతున్నా, మిత్తికి డబ్బులు తేవాల్సిన అవసరం వచ్చి నష్టాలలో కూరుకుపోయినా వ్యవసాయం చేయడం మాత్రం మానరు అనడానికి మా బాపు , అమ్మ చేయించిన వ్యవసాయం ఉదాహరణగా చెప్పవచ్చు… ఏదో కథలోనో నవలలోనో చదివాను… లోపల బనియన్ చినిగినది ఉన్నా పైన కోటు మాత్రం దర్జాగా వేసుకునే అలవాటు ఉన్న కుటుంబాలు ఊళ్ళల్లో దొరలుగా పిలవబడే వాళ్ళు . దాదాపుగా నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటికీ మా ఇంట్లో పరిస్థితి కూడా అదే . దీనికి కారణం ఆ కాలంలో చాలా పెద్ద కరువు వచ్చి పడింది.
వర్షాలు లేక బావులు చెరువులు కుంటలు అన్ని ఎండిపోయి Drot ఏర్పడింది . ఎంతోమంది ప్రజలు తినడానికి తిండి లేక చేయడానికి పనులు దొరకక వ్యవసాయ కూలీలు అయితే తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. ఆహార ఉత్పత్తి పతనంతో ప్రజల అవస్థలు ఇంతా అంతా కాదు. అరవయ్యవ దశకం లోని కష్టాలు చాలా ఏళ్ళే కంటిన్యూ అయ్యాయి. లాల్ బహుదూర్ శాస్త్రి అనుకుంటా అప్పటి ప్రధానమంత్రి. ఈ ఆహార సంక్షోభాన్ని తట్టుకోవాలంటే వారానికో పూట భోజనం మానేయాలి అని తాను తన కుటుంబంతో సహా అలా వారానికో పూట ఉపవాసం ఉన్నాడని అంటారు. అలా పిలుపునిచ్చి, పాటించిన సందర్భాలు ఉన్నాయి అని గుర్తు. భయంకరమైన కరువు భారతదేశానికి ఏదో పెద్ద పాఠాన్ని నేర్పించిందేమో అనుకుంటా. దేశ చరిత్రలోనే ఆహార సంక్షోభం ఏర్పడిన పరిస్థితుల నుండి కరువును
ఎదుర్కోవడానికి నాయకులు నడుం కట్టారు. హరిత విప్లవం అందుకే వచ్చిందేమో అనుకుంటా …
“జై జవాన్ జై కిసాన్” అనే నినాదం వెల్లువెత్తింది. గ్రీన్ రెవల్యూషన్ రావడానికి, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టడానికి అది ఒక సందర్భం అయ్యింది. ఇవన్నీ తట్టుకోవడానికి మా బాపు కూడా ప్రయత్నాలు చేయవలసి వచ్చింది కావచ్చు. మా ఇంట్లో మనసాలలో ఒక గదిని గరిసర్ర అనే వాళ్ళం. దాంట్లో ధాన్యం పోసి పెట్టేవాళ్ళు. అట్లాగే మూడు నాలుగు గాబులు ఉండేవి. గాబులు అంటే పెద్ద మట్టి కుండలు వాటిలోనూ ధాన్యం పోసి పెట్టేవాళ్ళు . ఇవన్నీ క్రమక్రమంగా ఖాళీ అయిపోయాయి, ఓటు పడ్డాయి ,వాడకం తగ్గింది. అవసరం లేని వస్తువులను, వేస్ట్ వి వాటిలో పెట్టడం అలవాటయింది. బహుశా దీనికి కారణం కూడా ఉంది. నాలుగు చోట్ల కొద్ది కొద్దిగా వ్యవసాయ భూమి ఉండడం వలన నలుగురు జీతగాళ్ల అవసరం పడేది. నాలుగు దిక్కుల వేరే పని వాళ్ళ , కూలి వాళ్ళ అవసరం పడేది. అమ్మ బాపు
ఇద్దరు చూసుకోవడం కష్టం అయ్యేది. దీనితోని తెలియని నష్టం. దోపకం విపరీతంగా జరిగింది. పంట భూమి అంతా ఒకే దగ్గర ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదేమో. ఏమో…ఏమో… అనుకోవడం తప్ప
ఇప్పుడు ఋజువులు కూడా ఏవీ లేకుండా అయిపోయాయి.
కాలం అనే చిత్ర యవనికపై రంగులు వెలవెలబోతుంటాయి. కొన్ని ఉషస్సులు, కొన్ని ఇంద్రధనస్సులు జ్ఞాపకాలుగా గుండె యవనికపై భద్రపరచుకుంటాము అంతే! మేం బడుల నుంచి వచ్చేసరికి ఏ
నూడుల్స్, ఏ పిజ్జాలో లేవు, కూల్ డ్రింక్స్ లేవు. మా అమ్మ అప్పాలు చేసి, చెక్క అలమారాలో చిన్న చిన్న, చిన్న గంపలలో పెట్టి పెట్టేది. మురుకులను మేం తేనెతేరలు అనేది. చెక్కలను బిళ్ళలప్పాలనేది. అవి రెండు తినేసి, మంచి ఇల్లు తాగామంటే ఆడుకోవడానికి కచ్చీరు దగ్గరికి పరుగో పరుగు. మేము ఎంతలా ఆడుతూ ఉంటే మా ఇంట్లో కుక్కలు కూడా మాతో అంతలా ఆడేది. ‘గిడింగి’ అని ఒక నల్ల కుక్క ఉండేది. గిడింగి ముసలిదై చనిపోయిన తర్వాత ‘టైగర్’ అని ఒక తెల్లది బ్రౌన్ కలర్ మచ్చల కుక్క ఉండేది. ఇది అయితే మరీనూ …మేము ఘన్పూర్ కి సినిమా కోసమో దవాఖానా కోసమో వెళ్తున్నామా అంటే మా బండి వెనక్కాలే పరిగెత్తుకుంటూ వచ్చేది. కానీ ఎత్తు కోని ముద్దులు పెట్టుకుంటూ మంచాలలో పడుకోపెట్టుకునే వాళ్ళం కాదు. అమెరికాలో పిల్లలతోపాటు చూసాం
కదా.. కుక్కను కుక్క అని కూడా అనొద్దు.”ఇట్స్ మై బేబీ” “హి ఈజ్ మై సన్”, “షి ఈజ్ మై డాటర్ ” అంటూ ఎత్తుకొని ముద్దులు కురిపిస్తూ పక్కన పడుకోబెట్టుకుంటారు. బహుశా ఈ మధ్యకాలంలో మన ఇండియాలో కూడా ఇలాంటివి చూస్తున్నామనుకుంటా….
అవును! బండ్లు అనగానే గుర్తొచ్చింది…. మాకు కచ్చరం బండి ఉండేది . కచ్చరం బండి అంటే పైన తడకతో మూసేసే , కప్పు ఉండి కాస్త నగిషీలతో అందంగా ఉండేది. దానికి కట్టే సవ్వారి ఎడ్లు కూడా
గజ్జెలతో ఉండేవి. దాన్ని కచ్చరం బండి అంటారు. కాలక్రమంగా కచ్చడం కూడా పోయి, మొద్దు బండిలో కూడా వెళ్లాల్సి వచ్చింది. మొద్దు బండి అంటే పైన కవర్ ఉండదు . వ్యవసాయ పనులకు వాడుతారు. దానికి కట్టే ఎడ్లకు అలంకరణ ఉండదు. ఇంట్లో కుక్కలకు అప్పుడప్పుడు అనారోగ్యం వస్తూ ఉండేది. వాటికి మందు ఎవరు పెట్టే వాళ్ళో తెలుసా? ఎలుకలి బక్కయ్య అనే అతను మందు పెట్టేవాడు. అతను ఇచ్చిన మందులు మా అమ్మ అన్నంలో కలిపి వాటికి పెట్టేది. వాటి అవస్థలు తగ్గిపోయి, మళ్ళీ హుషారుగా మాతో ఆడుకునేవి.
ఇవే కాదు మా ఇంట్లో చిన్ని చిన్ని దుడ్డెలు, లేగ దూడలు ఉండేవి. వాటిని మనసాలలో గుంజలకు కట్టేసి పెట్టేవాళ్ళం . కాస్త పెరిగి, మందలో కలవగలిగే వరకు చూసుకునేవాళ్ళం. ఆ చిన్ని దూడలతో ఎంతో ఆడుకునేవాళ్ళం. వెన్నాద్రి అనే ఆకులు తినిపించేవాళ్ళం. వాటికి పచ్చగా మలం వచ్చిందంటే ఏదో జబ్బేమో అని అర్థమయ్యేది. అలాంటి జబ్బులు వస్తే చచ్చిపోతాయని చాలా జాగ్రత్త పడే వాళ్ళం. దీనికి కారణం వాటికి తెలియకుండానే ఎక్కువ పాలు తాగేసేయడం వలన అజీర్ణం చేసేది. బాలింత బర్రె పాలను కాచితే వచ్చేదాన్ని జున్ను అంటారు. 4,5 రోజులు అలా వచ్చేది. ‘పాపం దూడకే పాలను వదలొచ్చు కదా అమ్మా’ అంటే , “అలా చేయవద్దు, లేగ దూడ దానికి తెలియక ఎక్కువ తాగుతుంది, ఇది అతి అయ్యి జబ్బు చేస్తుంది”. ఇది అమ్మ చెప్పిన కారణం. రోజుల పిల్లలు కదా
పాలు ఎక్కువ తాగొద్దు వాటికలా అజీర్తి చేస్తే బెల్లం కొమురయ్య అనే ఆయన వచ్చి మందు పెట్టేవాడు. ఇలా పశువుల దాణా విషయమెంతో ముఖ్యమైనది. మేం కూడా పోయి వాటికి గడ్డి వేయడము, కుడిది కలిపి పెట్టడం పని వాళ్ళతో పాటు చేసేది,
ఎప్పుడైనా పనివాడు రాకుంటే మేము, అంటే మా అన్నయ్య, తమ్ముడు చేసి పెట్టేది. నేనూ ఓ చెయ్యేసేదనుకోండి! ఇక్కడ తమాషా చెప్పాలి … ఒకసారి అమ్మా బాపూ వంటింట్లో అన్నాలు తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు . నేను వాకిట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి “అమ్మా అమ్మా బర్రె నీళ్ళాడింది, చిన్న బర్రె పుట్టింది ” అన్నాను. వాళ్ళు నవ్వారు. వెనకనుండి అక్కయ్య అన్నయ్యా వచ్చి విననే
విన్నారు! ఇంకేం నన్ను ఆటపట్టించారు. అదేంటి? అంటే “బర్రెను అలా నీళ్ళాడింది అని అనొద్దు. ఆది మనుషులకు ఉపయోగించే పదం, బర్రె ఈనింది అనాలి” అని చెప్పారు. ఇలా వ్యతిరేక పదాలు , పోలిక పదాలు అంటే, Antonyms, Comparisions ఉంటాయని సందర్భాలను బట్టి జంతు ప్రవృత్తి , మానవ ప్రవృత్తి అనేవి ఉంటాయని మన భాషలో మన సాహిత్యంలో పశుత్వము మనుష్యత్వము అనేవి ఉంటాయని జంతు ప్రవృత్తి మానవ ప్రవృత్తిని బట్టి మాటలు ఉపయోగిస్తామని అర్థమైంది. మనుషులకు ఉండే వివేచన, విచక్షణ జ్ఞానాన్ని బట్టి తేడాలు.. ప్రవర్తనను, లక్షణాలను పోల్చి చూపే పదాలు మాటలు ఉంటాయని తెలిసింది. ఇలా గ్రామెటికల్ టర్మినాలజీ చెప్పని పాఠాలు అయ్యాయి. ఇలా ఎన్ని నేర్చుకుంటాము కదా! ఇవన్నీ కుటుంబ నేపథ్యం నుండే వస్తాయి. అందుకే కుటుంబాలు నిలవాలని అందరూ కోరుకుంటారు.
ఇంట్లో మనసాలలో ఒక గదిలో కోళ్లను పెంచే వాళ్ళం. ఈ కోళ్ళర్ర తలుపు తీయాలంటే భయపడే వాళ్ళం . ఎందుకో తెలుసా ? రెండు పెద్ద ఎత్తైన తెల్లని పుంజులు ఉండేవి. అందులో ఒకటి మహా కోపిష్టి పుంజు! మనుషుల్ని చూస్తే ఎగబడి, ఎగబడి పొడిచేది. అందుకే అందరూ జాగ్రత్త పడేవాళ్ళు. కాని, మా అమ్మను ఏమనకపోయేది వింత కదా!! బాతులను , కుందేళ్ళను కూడా పెంచేది. ఇలా వీటన్నింటితో,
మా అందరితో కలిసి మా ఇల్లు ఓ పెద్ద పరిశ్రమలా ఉండేది. సొమ్ము చేసుకోవడం తెలిస్తే సరిపోదు, దాచుకోవడం తెలియాలి. దానధర్మాల మారాజులకు ధనం ఎక్కడ నిలుస్తుంది? మొట్టమొదటి రోజు ఎనిమిదో తరగతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఘనపూర్ కి వెళ్ళినప్పుడు అమ్మ ఒడిలోంచి తీసేస్తున్న పసిపాపలా తల్లడిల్లాను. మా ఊరు, మా బడి నాకెంతో ఇష్టం. ఈ కొలనులోని చేప పిల్ల చెరువులోకి
వెళ్తుంది. అంతా కొత్త… కానీ భయాన్ని జయించే శక్తిని మా కుటుంబం ఇచ్చింది. ఇక్కడ నాకు నా “అర్రతలుపులు” అనే పేరుతో 2011లో ప్రచురించిన కవితా సంపుటిలోని కవిత గుర్తుకొస్తున్నది.
“బాల్యంలో అంబాడినట్లు/ నా మది అర్రనిండా జ్ఞాపకాలే!/ అందిన వస్తువేదో అద్భుత నిధిలా తోచి /మోకాళ్లు మాసిన పట్టించుకోను/ తోటి వారితో ఆడిన దొంగాటలు భద్రంగా పెట్టెలో పెట్టి మురిసిపోతున్నా/ ఇంటి కిటికీలన్ని కిటికీలు లేని నా మనస్సర్ర పెద్దదే!/ జారుడు బండ పై ఆడినప్పుడు చిట్లిన కాలి రక్తాన్ని/ అప్పుడైతే ఆకుతో తుడిచిన గుర్తు/ బలపాలు తిన్నట్టు మరిచిన నాలుక నాకిప్పుడు/ కొత్త రుచులను అందిస్తున్నది/ పుస్తకాలతో బడి మెట్లెక్కే సంచీలోని రాళ్లు/ నా కాళ్లకు తగిలి దిశా నిర్దేశాన్నిచ్చినట్టున్నది! పక్కూరు పంతుళ్ళ/ గూడ్స్ రైలుంత ఇంటి పని చూసి /బెంగపడి రైలు పట్టాల వెంట నడిచి వచ్చినప్పుడు/ కలవని ఆ సమాంతర రేఖలు/ ఏదో జీవిత సూత్రాన్ని బోధిస్తాయనుకోలేదు”
ఈ కవిత్వం అచ్చంగా నా అనుభవాల నుంచి పుట్టింది.బడికి బస్సులో వెళ్లాలి. బస్సు రాకుంటే నడిచిన వెళ్ళాలి. కానీ స్కూల్ డుమ్మా కొట్టొద్దు. అక్కడ అంతా కొత్తవాళ్లు . పెద్ద చదువులు. అయినా సరే భయపడొద్దు, నేర్చుకోవాలి. కానీ అర్థం కాని చదువు లేవైనా వస్తే బెంగపడే రోజులు లేవని కాదు. ఇలా నడిచి వెళ్లాల్సి వచ్చినప్పుడు రైలు పట్టాల నుంచి, కాస్త అడ్డదారి , పిల్ల బాటలు ఉంటాయి స్కూలుకు తొందరగా చేరొచ్చని అందరం అట్లా వెళ్ళేవాళ్ళం. వెళ్లేప్పుడు దారి దారంతా మాదే ! మామిడి కాయలు కోసుకోవడమో, వేప పండ్లు తెంపుకొని బుడగలు చేయడమో, చెట్ల ఆకులు చేతులతో ఆడించడమో, గులకరాళ్లవంటివేవైనా ఏరుకుంటూ సంచిలో పడేసుకోవడమో ..ఒక్కటా? రెండా ? ఆటలే ఆటలు .. మాటలే మాటలు …ప్రకృతి అంతా మాదే!! బాల్య ప్రపంచమంతా మాదే!!!
వీటితో బాటు నా చదువూ సంస్కారం వంటివన్నీ తెలుసుకుందాం…
*****
( ఇంకా వుంది )

ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన చేసి , డాక్టరేట్ పట్టా పొందాను . నిత్యవిద్యార్థిగా నిరంతర సాహిత్య పఠనం . పెద్దల మాటలను , కొత్తగొంతుకలను వినడం ఇష్టం .
